జ్యోతిష్యం నమ్మాలా, వద్దా?
భవిష్యత్తు పై కలల సౌధాలను నిర్మించుకోవడానికి ఆస్కారం కల్పించే జ్యోతిష్యం అంటే అందరికి ఉన్న భయం-కుతూహలం నాకూ ఉన్నాయి. కానీ కనపడిన ప్రతి జ్యోతిష్యులచేత జన్మకుండలి రాయిస్తూ, చెయ్యి చూపిస్తూ కూర్చోకుండా, జ్యోతిష్యం యొక్క మౌలిక అధారాలేమిటి? పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలేమిటి? వైజ్ఞానిక తర్కాలేమయినా ఉన్నాయా? అని పరిశీలించిన మీదట, నిజమని అనిపించిన వాదనలని మాత్రమే ఇక్కడ రాస్తున్నాను.
నిజానికి జ్యోతిష్యం శాస్త్రాన్ని సమర్ధిస్తూ రాసినప్పటికీ, భవిష్యం చెప్పే శాస్త్రానికి ఉన్న మరో కొత్త కోణాన్ని పరిచయం చెయ్యాలన్నదే ముఖ్యోద్దేశ్యం . ముఖ్యంగా నావరకూ జ్యోతిష్యం అన్నది మానవుడి ని ధార్మిక, సన్మార్గాలలో నడిపించే ఒక తంత్రం మాత్రమే! మిగతా అన్ని శాస్త్రాలలోను కనిపించే, స్పష్టత, నిఖరత జ్యోతిష్య శాస్త్రం లో కనపడవు. మిగతాశాస్త్రాలు భూతకాలానికి సంబంధించినవయితే, ఒక్క జ్యోతిష్యం మాత్రమే భవిష్యత్తుకి సంబంధించినది.
ఈ శాస్త్రమే అటువంటిది. నమ్మనివాళ్ళకు, ట్రాష్ అనిపించి, నమ్మేవాళ్ళకి అత్యంత వైజ్ఞానికంగా అనిపిస్తుంది. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అతి కొద్దిమందిలో ఒక్కడయిన రజనీష్ కూడా ఈ శాస్త్రాన్ని నమ్మాలో లేదో తెలియని అయోమయ స్థితి లో పడిపోయాడు. సామాన్యంగా తన అలోచనల్లో, ఆచరణల్లో ముక్కున వేలేసుకొనే రీతిలో, స్పష్టత నీ, నిక్కచ్చిత ని ప్రదర్శించే ఓషో , జ్యోతిష్యం విషయం లో మాత్రం అతని అలోచనలు డోలాయమానం.
ఒక శాస్త్రాన్ని చర్చించే సమయం లో దానికి ఉన్న గౌరవమర్యాదలకు భంగం కలగకుండా, అదే సమయంలో అతి ప్రాచీనమయిన, వైభవోపేతమయిన మన భారతీయసాంప్రదాయాలకు అద్దంపడుతూ, మరొక్కసారి మన మహోన్నతమయిన భారతీయసంస్కృతికి నివాళి......
ఇరవై అయిదు వేల సంవత్సరాలక్రితం విలసిల్లిన సుమేరియన్ నాగరికతలో జ్యోతిష్యం అనే గ్రహగతులని వివరించే శాస్త్రం ప్రాచుర్యం లో ఉండేది అనే విషయాన్ని ప్రపంచం అంగీకరించింది. కానీ జ్యోతిష్యం అన్నది కేవలం ఇరవయి అయిదువేల సంవత్సరాల క్రితానికి చెందినది కాదు. నిజానికి అది కనీసం లక్ష సంవత్సరాల వయస్సు కలిగిన అతి వృద్ధశాస్త్రం!
ఋగ్వేదం లో నిర్దుష్టమయిన తారాసముచ్చయం గురించిన ప్రస్తావన ఉంది. నేటి ఖగోళ శాస్త్రజ్ఞుల ప్రకారం అలాంటి తారా సమూహం గోచరించింది దరిదాపు తొంభయిఅయిదువేలసంవత్సరాలక్రితం! మరి మనవేదాలు అందులో ప్రస్తావించబడిన జ్యోతిష్యం మనం నిర్ణయించుకున్న కాలానికన్న చాలా ప్రాచీనం అయితీరాలి కదా? లోకమాన్య బాలగంగధర్ తిలక్ చెప్పినదీ ఇదే!
ప్రపంచం నలుమూలలకూ వ్యాపించడం లో ఆలస్యమయినప్పటికీ, జ్యోతిష్యశాస్త్రం భారతం లో జన్మించింది(జన్మించడం సరిఅయినపదం కాదేమో!), తొంభయి అయిదు వేల సంవత్సరాలక్రితం అయ్యుండాలి. మూల ఋగ్వేదం లో జ్యోతిశ్యం ప్రస్తావన లేదనీ, కాలాంతరం లో చేర్చబడ్డాయనీ, కొన్ని వాదనలు లేకపోలేదు. తొంభయి అయిదువేల సంవత్సరాల క్రితం కనిపించిన సదరు తారాసమూహన్ని, ఊహించి, గుర్తించి దానిని ఋగ్వేదం లో ఇరికించేంతటి ఖగోళజ్ఞానం అరోజుల్లో ఉండేదా? అన్నది అలోచించాల్సిన విషయం. ఎంతటి హాస్యాస్పదం! ఇంతఖగోళజ్ఞానం లభించింది మనకి ఇటీవలీ రోజుల్లొనే కదా? ఒక వేళ అలా ఇరికించబడినట్టయితే కాలంతరంగా వేదాధ్యయనం చేస్తూ వస్తున్న వారికి అ వ్యత్యాసం తెలిసేది కాదా?
దురదృష్టవశాత్తూ జ్యోతిష్యం ఎంతటి ప్రాచీన శాస్త్రమో అంతటి నిర్లక్ష్యానికి లోనయిన విజ్ఞాన భాండాగారం. ఇది మనం గ్రహిస్తే జ్యోతిష్యాన్ని తెలుసుకోవడం కష్టం కానేరదు.
నిజానికి దశమాంశ పద్ధతి, వాటిని లెక్కించే తీరు, సంఖ్యలు రూపుదిద్దుకున్నవి మన భారతదేశం లోనే అని తెలుసు కదా? ఈ గణితం జన్మించడానికి మూలకారణమే జ్యోతిష్యం! గ్రహగతులను లెక్కించడానికి ఒక ’లెక్క’ అన్నది కావలసి వచ్చి ’గణితం’ అనే శాస్త్రం ఉదయించింది. వెన్నంటే జ్యోతిష్యం కూడా ప్రవర్ధమానమయ్యింది.
ఇలా సుమేరియన్ ప్రజలను చేరిన జ్యోతిష్యం క్రీస్తు పుట్టక మునుపే సుమారు ఆరువేల సంవత్సరాల క్రితం పాశ్చాత్యులను చేరుకుంది. సుమేరియన్ల కి ఎంతగా జ్యోతిష్యం దగ్గరయినదంటే వారు గ్రహగతులను లెక్కించడం కోసం ఏడువందల అడుగుల ఎత్తుగల ఒక గోపురాన్ని కట్టి అక్కడ వంతులవారీగా కూర్చుని ఆకాశం లోని గ్రహ,తారా చలనాల్ని గణించేవారు. శతాబ్దాల తరబడి నడిచిన ఈ ఆధ్యయనాలతో వారు ఒక విషయాన్ని స్పష్టంగా గమనించగలిగారు. మానవజనాంగం పై జరిగే ప్రతి ఒక్క పరిణామం మీద గ్రహ-నక్షత్రాల ప్రభావం ఉన్నది, తాము అనుభవించే కష్ట-నష్టాలు, రోగ-భయాలు,ఉరుము-మెరుపులు మొదలయిన వాటి నేపధ్యాన్ని కొన్ని నిర్దుష్టమయిన కొన్ని గ్రహలు నిర్దేశిస్తున్నాయని నమ్మేవారు.
అలా అనేక సహస్రాబ్దాలు గడచిన నంతరం, 1920 లో, చిజెవ్ స్కీ అనే రష్యన్ శాస్త్రవేత్త సుమేరియన్ల నమ్మకానికి వైజ్ఞానిక లేపనాన్ని ఆపాదించాడు. ప్రతి పదకొండు సంవత్సరాలకీ సూర్యగోళం లో భయంకరమయిన పరమాణు విస్ఫోటనాలు సంభవిస్తాయనీ, ఆ సమయం లో భూమిమీద పిడుగులో, లేక విప్లవమో జరిగే అవకాశాలున్నాయనీ, అతడు ప్రయోగాలతో, చరిత్ర ఆధారాలతో సహా నిరూపించాడు. అంతవరకూ కేవలం నమ్మకం అనుకున్న జ్యోతిష్య శాస్త్రం ఉన్నట్టుండి విజ్ఞానశాస్త్రంగా ఆవిర్భవించింది. అతడి ఈపరిశోధనల ఫలితాలు దక్కడానికి ఎక్కువ సమయం పట్టలేదు. విప్లవాలు సాధారణంగా ఆర్థిక, సామాజిక, అసమతోలనం వల్లనే సంభవిస్తాయని నమ్మిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం అతడిని సైబీరియా లోని కారాగారం లో నిర్బంధించింది! స్టాలిన్ మరణించి, కృశ్చేవ్ అధికారానికి వచ్చేవరకూ అతడు జైలు లోనే మగ్గిపోయాడు. విడుదలయిన తరువాత ఆరునెలల కన్న ఎక్కువ బ్రతకలేదతను.
కానీ అతడి ప్రయోగాలు శాస్త్రజ్ఞుల వలయం లో సంచలనం సృష్టించింది. ప్యారాసెల్సన్ అనే స్వీడన్ కి చెందిన వైద్యుడు చిజెవ్ స్కి థియరీ నే మరింతగా పరిశోధించి మేధావుల నే కలవరపరిచే రీతి లో కొత్త వాదాన్ని ప్రతిపాదించాడు. మానవుడు జబ్బు పడటం అన్నది అతడి జన్మరాశి యొక్క సంవేదన లో అపస్వరాలు ఉన్నపుడు మాత్రమే అన్నది అతది పరిశోధనల సారాంశం. ఈ పరిశోధన నాస్తికుల, మేధావుల వర్గం లో కలకలం రేపింది. అయితె అతడిది ఒట్టినమ్మకం కాదు, ప్యార సెల్సన్ దగ్గర దానికి సంబంధించిన ఏడువందల కేస్ స్టడీ లు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి గ్రహ-నక్షత్ర-ఉపగ్రహాలు తమ చలనం వల్ల నిర్దుష్టమయిన ప్రకంపనలను కలిగిస్తాయనీ, ఆ ప్రకంపనల హెచ్చుతగ్గులు మానవ జీవితాలను ప్రభావితం చేస్తాయనీ స్పష్టీకరించిన పైథాగరస్ అనే గ్రీకు గణితజ్ఞుడి వాదనని పునాదిగా తన వాదనని ప్రతిపాదించాడు. స్వతహా గ వైద్యుడయిన సెల్సన్ రోగి యొక్క జన్మ కుండలి ని పరిశీలించిన మీదట దాదాపు చికిత్స అసాధ్యం అనుకున్న జబ్బులను నయం చెయ్యగలిగాడు!
ఇంతకీ ఆరోగ్యం అంటే ఏమిటి అన్న ప్రశ్నకి సమాధానంగా " రోగాలు, జబ్బులు లేని స్థితి" అని చెప్పారంటే, అంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు. అసలు ఆరోగ్యం అంటే మన ప్రకృతి, లేదా మన దేహ (నిజమయిన) స్థితి. జబ్బులు రోగాలు అనేవి అప్పుడప్పుడు ప్రకృతి మీద జరిగే దాడి. అరోగ్యం మనతోపాటుగా ఉండేది. జబ్బులు అప్పుడప్పుడు వచ్చిపోయే అతిధి అన్నమాట.
ఈ సదరు ’అతిథి’ రాక గ్రహగతులు ప్రచోదించడం వల్లనే అని ప్యారసెల్సన్, చెజెవ్ స్కీ, ప్రాచీనభారతీయులకీ తెలుసు.
ఈ బ్రహ్మండం లో ఏదీ ప్రత్యేకమయినది కాదు. బ్రహ్మండం లోని ప్రతి పదార్థం ఒకే బిందువు నుంచి ఉద్భవించింది అని మనకి తెలుసు కదా? (వివరాలకు అగోచరప్రపంచం చదవండి..) మనకి ఆకాశలోని గ్రహ నక్షత్రాలకి నేరుగా సంబంధం లేకపోయినా అవి మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయన్నది నిర్వివాదాంశం. కాలికి ముల్లు తగిలితే కళ్ళనుంచి నీళ్ళు కారడం ఎంత సహజమో ఇది కూడా అంతే సహజం.
ప్రతిరోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ లెక్కలేనన్ని తారా సమూహాలు సూర్యుడితో పాటు ఉదయిస్తూఉంటాయి. మరెన్నో తారా సమూహాలు అస్తమిస్తూ ఉంటాయి. అప్పుడే జన్మించిన శిశువు మెదడు పై ఈ ఆకాశ స్వరూపపు కంపనం ముద్రింపబడుతుంది. అదే ఆ నవజాత శిశువు యొక్క జన్మకుండలి!
జ్యోతిష్యం ప్రాచీనాతి ప్రాచీన కాలం లో పుట్టినందువల్ల అది ఎక్కువ అభివృద్ధి చెందకుండానే కనుమరుగయ్యింది అనే ఒకవాదన ఉంది. కానీ అది నిజం కాదు. అంతటి ప్రాచీనకాలం లోనే అది ఒక , పూర్ణ ప్రమాణం లో వికసించిన విజ్ఞానశాస్త్రం గా విలసిల్లింది. కానీ కాలాంతరం లో కొన్ని ముఖ్యమయిన జ్యోతిష్యభాగాలు నాశనం అయ్యాయన్నది నిజమే. మనకి ఇప్పుడు మిగిలింది ఒక మహాశాస్త్రం యొక్క శిధిలాలు మాత్రమే అంటే అతిశయోక్తి కాదేమో! ఈ శిధిలాలే ఇంతటి పరిణామ కారిగా, పరిపూర్ణంగాను ఉన్నాయంటే ఇక మూలమయిన మహాశాస్త్రం ఎలా ఉండేదో ఊహించండి.
ఒకే జన్మ రాశి లో జన్మించిన లక్షలమంది జాతకాలు ఒకే రీతి లో ఉండవు. భిన్న రీతులు భిన్న మనస్తత్వాలతో ఎదుగుతారు. ఏ ఇద్దరి జాతకం ఒకేలా ఉండదు. దీనికి కారణం తొమ్మిది గ్రహాలు, ఇరవయి ఏడు నక్షత్రాలు వివిధ నిష్పత్తులలొ కలపబడతాయి(?). ఈ ’నిష్పత్తులు’ అన్న పదం పైనే మన అసలయిన జాతకం నిర్మించబడుతుంది. దీనిని ఒక ఉదాహరణ ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తాను. .మన ఉనికి కి నడక కి, ప్రవర్తననీ, క్రోమోజోమ్స్ లోని జీన్స్ నిర్దేశిస్తాయి అని తెలుసు కదా? దేహంలోని క్రోమోజోమ్స్ నిర్మాణానికి అతిముఖ్యమయిన ముడిపదార్ధం ఇరవయి రకాలయిన అమినోఆసిడ్స్!. కేవలం ఈ ఇరవయి రకాల అమినోఆసిడ్స్ ఒక ప్రత్యేకమయిన నిష్పత్తి లో, ఒక ప్రత్యేకమయిన రీతిలో కలిసి మనిషి గుణగణాల్ని రూపు రేఖల్నీ, జుట్టు, కళ్ళరంగునీ నిర్దేశిస్తాయి. ఒక విధంగా దీనిని మన జీవితానికి మాత్రమే ఉన్న ప్రత్యేక కోడ్(Genetic code) గా పరిగణించవచ్చు. ఏ ఇద్దరు ఒకేలా ఉండరు. కవలపిల్లలు తప్ప. దానికి కారణం ప్రత్యేకరీతిలో ఉన్న మన జీన్స్ నిర్మాణం. అదే విధంగా తొమ్మిది గ్రహాలు ఇరవయిఏడు నక్షత్రాలు ఒక ప్రత్యేకమయిన రీతిలో కూడి మన జీవితగమనాన్ని అదుపు చేస్తూ నిర్దేశిస్తాయి. అందుకే ఏ ఇద్దరి జాతకాలు ఒకే రీతిలో ఉండవు. అంతెందుకు? ఒకేసమయం లో జన్మించిన కవల పిల్లల జాతకాలు ఒకేలా ఉండవు. ఒకే నక్షత్రం లో ఒకే జన్మ రాశీ లో పుట్టిన ఇద్దరి లోను కొన్ని సామాన్య పోలికలు ఉన్నప్పటికీ వారిద్దరు జీవితం ఒకేలా ఉండే అవకాశాలు చాలావరకూ మృగ్యం అనే చెప్పవచ్చు. దీనికి అనేక ఉదాహరణలు చెప్పవచ్చు కాని కాలావకాశం, స్థలావకాశం లేక ఇంతటితో అపేస్తున్నాను.
మొన్న మొన్నటివరకూ జ్యోతిష్యాన్ని ఒక సైన్స్ గా ఎవరూ అంగీకరించలేదు. ఇటివలనే జ్యోతిష్యానికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. బాహ్యాకాశానికి పంపిన ఆకాశనౌక వల్ల మన భూమికి ముట్టడించే కిరణ, వికిరణాలు ఎటువంటి ప్రకంపనలని సృష్టిస్తున్నాయి అన్నది మనకి తెలిసింది. మన పూర్వీకులు చెప్పినదీ ఇదే. చంద్రుడి శక్తి సాగర జలాలపై సృష్టించే తీవ్రమయిన ఆటుపోట్లను అంగీకరించిన విజ్ఞానప్రపంచం, అంతే అనుపాతం లో మన దేహంలోనూ నీరు, లవణ, ఖనిజాంశాలు ఉన్నాయన్న సంగతి, మన దేహం మీదకూడా చంద్రుడు పరిణామాలను సృష్టించగలడు అన్న విషయాన్ని మరిచి జ్యోతిష్యాన్ని నిరక్ష్యం చేసారు.
విదియ నుండీ పౌర్ణమి వరకూ చంద్రుడి కళలు పెరిగే కొద్దీ ఆస్పత్రులలో దాఖలౌతున్న మానసిక రోగుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అదే విధంగా చద్రుడి కళలు తరిగి అమావాస్య చేరుకొనేటప్పటికి ఒక నిష్పత్తి లో నమోదయ్యే మనసిక రోగుల సంఖ్య తగ్గుతూ వస్తూంది. దీనికి సంబంధించిన అధికారిక లెక్కలు ఉన్నాయి. దీని కారణం చంద్రుడి ప్రభావం . చంద్రుడు మనఃకారకుడు. అంటే మన మనసు గురించి తెలుసుకోవాలంటే మన జాతకం లో చంద్ర గ్రహస్థితి వల్లనూ తెలుసుకోవచ్చు. గమనించి చూడండి. మానసిక అసమతోలనం ఉన్నవాళ్ళని ఇంగ్లీషు లో Lunatic అనీ, హిందీ లో ’చాంద్మార్’ అనీ అంటారు. ఈ రెండు పదాలు చంద్రుడికి సంబంధించినవే!
కేవలం ఒక చిన్న గ్రహమయిన చంద్రుడికే ఇంత ప్రభావం ఉంటే ఇక మొత్తం బ్రహ్మాండం లోని ఆకాశ కాయాల ప్రభావాల మాటేమిటి?
పరమ నాస్తికుడయిన ప్రొఫెసర్ బ్రౌన్ కూడా అనుకోకుండా కుతూహలంకొద్దీ జ్యోతిష్యాన్ని అభ్యసించీ, అభ్యాసం లో భాగం గా వందలాది జాతకాలను పరిశీలించాడు. ఆశ్చర్యకరంగా సేనాని, సేనకు సంబంధించిన వారి జాతకాల్లో కుజుడి ప్రభావం ఎక్కువగా ఉండటం గమనించాడు. అదే ఇతర వృత్తులలో ఉన్నవారి జాతకాల్లో లేదు. ఇది చూశాక శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ బ్రౌన్ జాతక పరిశీలన ముఖ్య మయిన వృత్తిగా మారిపోయింది. దరిదాపు యాభయివేల జాతకాలను పరిశీలించాడు. ఒక వృత్తిలో ఉన్నవారి జాతకాలకీ మరొక వృత్తిలోఉన్నవారి జాతకాలకీ ఎక్కడా పొంతనలేదు.
భారతీయులు చెయ్యాల్సిన, చేసి ఉండాల్సిన పనిని పాశ్చాత్యులు సాధించారు. ఇదీ మన దౌర్భాగ్యం.
జ్యోతిష్యం ఒక మూఢనమ్మకం అన్న భావన అనేకుల్లో ఉంది. అది వారి తప్పు కాదు. వివరించలేని, తర్కాలకు అందని సంగతులను మనం అంధవిశ్వాసం గానూ, మూఢనమ్మకం గానూ కొట్టిపడెయ్యడం మామూలే..కానీ జ్యోతిష్యం అలాకాదు. అదికూడా ఒక విజ్ఞానశాస్త్రమే. అన్నట్టూ విజ్ఞానం అంటే ఏమిటి? cause(కారణం,నిమిత్తం) మరియూ Effect(పరిణామం) మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించడం. జ్యోతిష్యమూ అంతే. కారణం లేకుండా ఏదీ జరగదు అనే అదీ వివరిస్తుంది. అయితే ఈ cause లు మనకి తెలియవు అంతే.
జ్యోతిష్యం అన్నది గ్రహగతులను లెక్కించే శాస్త్రం మాత్రమే కాదు దానికి వివిధ అంగాలు, శాఖలూ, ఉపశాఖలూ ఉన్నాయి. భవిష్యం గురించి మనకు తెలియాలీ అంటే భూతకాలం ముందుగా అర్థం చేసుకోవాలి. హస్తసాముద్రికం, అంగసాముద్రికం, ముఖ సాముద్రికం ఇందుకు దోహదపడతాయి. చేతిలోని రేఖలు నుదుటిమీది రేఖలు, శాశ్వతమయినవి కావు. మనస్సు మార్పు చెందినప్పుడల్లా అవి కూడా మారుతుంటాయి. అందుకే చేతిరేఖలు భవిష్యాన్ని చెప్పలేవు. భూతకాలాన్ని మాత్రమే చెప్పగలుగుతాయి.
రేఖలకన్న మనసు ముఖ్యం. మనసు అంటే మనకి పరిచయం ఉన్న జాగృతమనసు కాదు. సుషుప్త మనసు! అందులోని యోగ దృగ్గోచరాలయిన శక్తికేంద్రకాలయిన చక్రాలు. ఈకేంద్రకాలను అధ్యయనం చెయ్యగలిగినవాడు మాత్రమే కరారువాక్కుగా భవిష్యం చెప్పగలడు! ఇందులో ఎటువంటి అపోహలకీ తావులేదు.
ముందే చెప్పినట్టుగా విజ్ఞానం ఇప్పుడు "చుట్టూఉన్న వాటి ఉనికి కి కారణాలు విశ్లేషిస్తే" , జ్యోతిష్యం "వాటి ఉనికి వల్ల భవిష్యత్తులో జరగబోయే పరిణామాల్ని విశ్లేషిస్తుంది"
జాతకాలను రాయడం కూడా భవిష్యత్తుని మార్చే ఉద్దేశ్యం తో కాదు. ఒక వ్యక్తి జీవితం పై అతడికి ముందుగా సూచన ఇచ్చి అతడిని అనివార్య సంఘటనలకి మానసికంగా తయారు చెయ్యడం.
బ్రతుకును స్వీకరించడం, అలా స్వీకరిస్తూ ధర్మంగా, సన్మార్గం లో నడిపింపజేసే శాస్త్రమే జ్యోతిష్యం
- రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి