Online Puja Services

రామడుగు రామదాసు

3.15.44.161

 

 

 

ఈయన రామడుగు రామదాసు!
ఓ ఆలయ నిర్మాణం కోసం లక్షల రూపాయలు భూరి విరాళం ఇవ్వడం ఈ రోజుల్లో గొప్ప విషయం ఏమీ కాదు. గోనె రాజమల్లయ్య విరాళం ఇవ్వలేదుకానీ... సొంత డబ్బుతో తానే స్వయంగా ఆలయం ‘నిర్మించారు’. తాపీ మేస్త్రీగా పునాదులు తవ్వడం నుంచీ స్థపతిగా ఆలయ గోపురాన్ని కట్టడందాకా అన్నీ తానై చేశారు. వడ్రంగి, వాస్తు పనులూ ఆయనవే. అంతేకాదు, విగ్రహప్రతిష్ఠకీ తానే ఆగమశాస్త్ర పండితుడిగానూ వ్యవహరించారు. సకలం తానై కరీంనగర్‌ రామడుగులో ఆయన నిర్మించిన ఆ ఆలయం విశేషాలివి...

గోనె రాజమల్లయ్యది కరీంనగర్‌ జిల్లా రామడుగు మండల కేంద్రం. చిన్నప్పుడు ఆయన ఇంటిపక్కనే ఓ శిథిల శివాలయం ఉండేది. నిజానికది శివుడూ కేశవుడూ ఒకే ఆలయంలో ఉండే రామేశ్వరాలయం! మల్లయ్యకి పదేళ్లు వచ్చేటప్పటికే ఆ ఆలయం కూలిపోయి రాళ్ళూరప్పలుగా మిగిలింది. ఆ వందగజాల స్థలంపైన కన్నేసిన కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే ఒకప్పుడు తన తండ్రి ఎల్లయ్య వాళ్లకి వ్యతిరేకంగా పోరాడటం... రాజమల్లయ్యకి బాగా గుర్తు. అందుకే ఎప్పటికైనా ఆలయాన్ని పునరుద్ధరించాలనుకున్నాడు. అదే తన జీవితానికి ముక్తి అని భావించాడు. ముక్తి సరే... ముందు భుక్తి చూడాలికదా! అందుకే ఏడో తరగతితోనే చదువు మానేసి చిన్నాచితక పనులకి వెళ్లడం మొదలుపెట్టాడు. తమది చేనేత కుటుంబమైనా తాపీ మేస్త్రీగానూ పనిచేశాడు. వడ్రంగి పనుల్లోనూ పట్టు సాధించాడు. గానుగ వ్యాపారం చేశాడు. కొన్నాళ్లు వస్త్రవ్యాపారిగానూ రాణించాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లూ, నలుగురు కొడుకులు... అందర్నీ ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. సాంసారిక జీవితంలో తన బాధ్యతలన్నీ తీరాయనిపించగానే ఐదేళ్లకిందట నిజామాబాద్‌లోని శివరామకృష్ణ తపోవనంలో శ్రీ విరిజానంద స్వామి సమక్షంలో సన్యాసం తీసుకున్నారు. తన పేరుని విశ్వేశ్వరానంద తీర్థస్వామిగా మార్చుకున్నారు. దాంతోపాటూ తన చిననాటి జ్ఞాపకాల్లో ఉన్న శిథిల శివాలయాన్ని పునరుద్ధరిస్తానని సంకల్పం చేసుకున్నారు. సన్యాసిగా దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలని సందర్శించారు. యజ్ఞాలూ, హోమాలూ, ఆలయ ప్రతిష్ఠ వంటి క్రతువులన్నీ నేర్చుకున్నారు. అవి చేయగా వచ్చిన డబ్బుని ఆలయ నిర్మాణం కోసం దాచుకోవడం మొదలుపెట్టారు.

పనులు మొదలయ్యాయి...
సిరిసిల్ల కేంద్రంలో తన కుటుంబానికి చెందిన ఇంటిని అమ్మి మూడు లక్షల రూపాయలతో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు! ముగ్గు పోయడం మొదలు పునాదులు తీయడం, గోడలు కట్టడం, స్లాబ్‌ వేయడంలాంటి అన్ని పనులూ తానే చేశారు. సాయం కోసం ఇద్దరు ముగ్గురు కూలీలని చేర్చుకున్నారు అంతే. గత డిసెంబరులో రాజగోపురం నిర్మాణం పూర్తిచేశారు. తర్వాత స్తంభాలపైన స్వయంగా దేవతాకృతులు, ధ్వజస్తంభం, లలిత చక్రం వంటివి చెక్కి కొత్త శోభతెచ్చారు. తొలిసారి వేసిన మూడులక్షలు సహా ఈ అయిదేళ్లలో మొత్తం పదిహేను లక్షల రూపాయలు ఆలయ నిర్మాణం కోసం ఖర్చుపెట్టారు. చుట్టుపక్కల జరిగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు, ఇతర యాగాలకు వెళ్లగా వచ్చిన డబ్బునీ, తన పాత వ్యాపారాల నుంచి వచ్చిన నగదునీ ఇందుకోసం వాడుకున్నారు. స్వామీజీ ఇలా ఒక్కడే ఆలయం కోసం కష్టపడుతుండటం చూసి భక్తులు కొందరు ఒకటిన్నర లక్షల రూపాయలు విరాళం ఇస్తే తీసుకున్నారు. అలా అన్నీతానై నిర్మించిన ఈ ఆలయంలో గత ఫిబ్రవరి 22న తానే ఆగమపండితుడిగానూ ఉండి విగ్రహాల ప్రతిష్ఠ చేయించారు. రాముడూ, శివుడూ సమానంగా పూజలందుకునే ఈ ఆలయంలో ఆంజనేయస్వామీ, లలితాంబికా కూడా కొలువుదీరారు.

‘నా ప్రమేయం ఏమీ లేదు’
ఈ ఆలయం నిర్మాణం పూర్తవ్వకముందే ఇది భక్తులకి సందర్శనీయ ప్రాంతంగా మారిపోయింది. ఒక్కడే అన్నీతానై చేస్తున్నాడని రామడుగు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు వచ్చి చూడటం మొదలుపెట్టారు. ‘భద్రాచలం రామదాసు ఎన్నో కష్టనష్టాలకోర్చి రామాలయాన్ని నిర్మించినట్టు... మా స్వామీజీ ఇక్కడ రామేశ్వరాలయాన్ని నిర్మించారు. ఆయన మా ఊరు రామదాసు’ అంటున్నారు వాళ్లు. విశ్వేశ్వరానందతీర్థ ఆ పొగడ్తల్ని పట్టించుకోవడం లేదు. ‘ఇదంతా ఆ దైవం చేయిస్తున్న కార్యం... ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు!’ అంటారు తాత్వికంగా!

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha