Online Puja Services

పాండవులు - తాపత్యులు

3.145.34.51
పాండవులు - తాపత్యులు :

లక్క ఇంటిలో పాండవులు తగలిబడిపోయారని దుర్యోధనుడు & సోదరులూ ఆనంద పారవశ్యం లో ఉన్నారు .కానీ నిజానికి వారు ఇల మార్గం లో అడవిలోకి వెళ్ళి హిడింబుడిని వధించి , హిడింబిని భీముడిని పెళ్ళి చేసుకున్నాడు .
ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుడి ఇంటిలో బ్రాహ్మణుల్లా వేషంవేసుకుని ఉంటుండేవాళ్ళు . ద్రౌపది స్వయంవరం గురించి తెలుసుకుని " కంపిల్య " నగరానికి బయలుదేరారు .

రాత్రి వేళల్లో కుంతికి కష్టం కలగకూడదని అర్జునుడు ఒక కాగడా పట్టుకుని ముందు నడుస్తున్నాడు మిగతా ఐదుగురు అతన్ని అనుసరిస్తున్నారు . మార్గ మధ్యం లో ఒక విశాలమయిన చెరువును చూసి దాహం తీర్చుకోవడానికి , చెరువులోకి దిగి దాహాన్ని తీర్చుకుని కాళ్ళూ చేతులూ కడుక్కుంటుంటే , "ఎవరు మీరు? ఈ అర్ధ రాత్రి ఈ అడవిలో తిరుగుతున్నారు? ఈ అడవి, గంగానది అంగారపర్ణుడనే గంధర్వుడివి అని తెలీదా ?ఏమిటీ దుస్సాహసం ?? అని కేకలు వేసెను. దానికి అర్జునుడు , నదులు దైవ ప్రసాదాలు , వీటిని ఎవరయినా ఉపయోగించుకోవచ్చు .ఈ నదిలో ఎవరు స్నానము చేస్తారో వారిది కానీ, నీది ఎలా అవుతుంది? నీవు వద్దంటే ఈ అడవిలో ప్రవేశించకూడదా? అని అర్జునుడు సమాధానమిచ్చాడు.

అప్పుడు అంగారపర్ణుడు అర్జునుడి పై నాలుగు బాణాలతో దాడి ప్రారంభించాడు. అర్జునుడు తలన చేతిలో ఉన్న కాగడాతోనే , ఆ నాలుగు బాణాలనూ తోసివేశాడు .ఆ తరువాత అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు . దానితో అంగారపర్ణుడి రధం భస్మమయిపోయింది . ఆగ్నేయాస్త్ర ప్రభావాన్ని , చూసి గంధర్వుడయిన అంగారపర్ణుడు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు .అంగారపర్ణుడు కుప్పకూలాడు. అర్జునుడు అతనిని ఓడించి జుత్తు పట్టుకుని యీడ్చుకుంటూ ధర్మరాజు దగ్గరకు తెచ్చి పడేసాడు, అతని భార్య " కుంభీనసి "వచ్చి పతిభిక్ష పెట్టమని ధర్మరాజుకు ప్రణమిల్లింది. అన్న చెప్పిన మీదట విజయుడు గంధర్వుని విడిచి పెట్టాడు.

అర్జునుడి పరాక్రమానికి & ఆగ్నేయాస్త్ర ప్రభావానికి అచ్చెరువొందిన అంగారపర్ణుడు, అతనిని స్నేహితుడిగా స్వీకరించి "చాక్షుషి" అనే గంధర్వ విద్యనూ & కొన్ని దివ్య గంధర్వ అశ్వాలను ఇస్తాను , నాకు " ఆగ్నేయాస్త్రాన్ని " ఇయ్యండి అని అర్జునుడిని వేడుకున్నాడు .దానికి అర్జునుడు విద్యలను బ్రాహ్మణ ఆచార్యులనుండీ గ్రహిస్తాను , దివ్యాశ్వాలను మాత్రం నాకు ఇవ్వండి అని తీసుకున్నాడు . అంగారపర్ణుడికి ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చి , దివ్యాశ్వాలను తాను స్వీకరిస్తూ , " మీరు ఇంత మంచివాళ్ళు అయ్యి ఉండి , చాక్షుసీ విద్య ఉండీ కూడా , నాతో ఎందుకు ఘర్షణ పడ్డారూ ? " అనిఆడిగితే , " తాపత్యులారా " మీ గురించి నేను విన్నాను , చాక్షుసీ విద్య వళ్ళ సర్వమూ తెలుసుకున్నాను అయితే ప్రత్యక్షముగా , మీ శక్తి సామర్ధ్యాలను తెలుసుకోవాలనే , ఘర్షణ పడ్డాను అన్నాడు . 

అర్జునుని బాణాలకు తన రధం ఆహుతి అయిన కారణంగా , తన మిత్రుడయిన " కుబేరుడిని " స్మరించి చిత్ర విచిత్రముగా అలంకరించబడిన రత్నయుక్తమైన సొంత రధాన్ని పొంది "చిత్రరధుడు" అని పేరు మార్చుకున్నాడు.

అర్జునుడు , మీరు నన్ను " తాపత్యా " అని సంబోధించారు , మేము " తాపత్యులము " ఎలా అయ్యాము ? అని అడిగాడు దానికి , చిత్ర రధుడు ఇలా అన్నాడు :
లోకాలన్నింటికీ వెలుగునిచ్చే సూర్యభగవానుడు విశ్వకర్మ కుమార్తె సంజ్ఞను పెళ్ళి చేసుకున్నాడు. వారికి కాళింది, యముడు అని ఇద్దరు పిల్లలు కలిగారు. రాను రానూ సూర్యుడితో కలిసి బతకటం సంజ్ఞకు కష్టమైంది. ఆయన తేజస్సును ఆమె భరించలేకపోయింది. భర్తకు సేవలు చేసే బాధ్యతను తన పరిచారిక చాయకు అప్పగించి ఆమె తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్ళింది.

సంజ్ఞ రూపంలో చాయ సూర్యుడికి చాలాకాలం సేవలు చేసింది. ఆమెకు సూర్యుడి వల్ల శనీశ్వరుడు, తపతి కలిగారు.

తపతి అందాల బొమ్మ, సుగుణాల ప్రోగు. ఆమెకు యుక్త వయస్సు వచ్చేసరికి మరింత అందంగా తయారైంది. సూర్యుడు కుమార్తెకు పెళ్ళిచేయాలని నిశ్చయించుకున్నాడు. తగిన వరుడికోసం అన్వేషిస్తున్నాడు.

ఒకరోజు సంవరణుడు తపతిని చూసాడు. ఆ సంవరణుడు చంద్రవంశ రాజు ఋక్షుని కుమారుడు. పర్వత ప్రాంతాలలో పగలంతా వేటకై తిరిగి తిరిగి అలసిపోయి సంవరణుడు కమలాలు, కలహారాలతో నిండిన ఒక సరస్సును చేరుకున్నాడు. అక్కడ దేవకన్యలు ఆటపాటల్లో మునిగి వున్నారు. వారందరిలో తపతి మొగలిరేకుల మధ్య మెరుపుతీగలా వుంది. సంవరణుడు శిలాప్రతిమలా తపతినే చూస్తూ నిలబడిపోయాడు. చూసినకొద్దీ ఆమెపట్ల అతనికి అనురాగం అధిగమయింది. ఆమె దగ్గరకు వెళ్ళి "సుందరీ! నిన్ను చూసిన క్షణంలోనే నేను నీకు దాసుడినయ్యాను. నన్ను కనికరించు" అని బతిమాలాడు. అతను అలా అంటూవుండగానే తపతి మాయమైంది. ఆమె కూడా మన్మథాకారుడైన సంవరుణుని మోహించింది. అతన్ని చూసిన క్షణం నుంచి ఆమెకూ మనసు స్వాధీనంలో లేకుండాపోయింది.

రాజధాని ప్రతిష్ఠానగరానికి వెళ్ళిన సంవరణునికి నిద్రాహారాలు లేవు. ప్రజల మంచిచెడ్డలు పట్టించుకోవడం పూర్తిగా మానేసాడు. తపతి తప్ప మరో ధ్యాస లేదు. ఈ విషయం ఋక్షుని కులగురువైన వశిష్ట మహామునికి తెలిసింది.

సూర్యపుత్రి తపతి కోసం అతను తపిస్తున్నాడని మహాముని గ్రహించాడు. "నీ మనోరథం నెరవేరుస్తాను. దిగులు మానుకో" అని సంవరణుడికి చెప్పి వశిష్టుడు యోగబలంతో ఆదిత్య మండలానికి వెళ్ళి వేదమంత్రాలతో సూర్యభగవానుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు.

భాస్కరుడు మహర్షిని సాదరంగా ఆహ్వానించి ఆతిద్యం యిచ్చి "మునివర్యా! మీ రాకకు కారణం ఏమిటి?" అని అడిగాడు.

"ఋక్షుడి కుమారుడు సంవరణుడు నీ కుమార్తె తపతిని చేపట్టాలనుకుంటున్నాడు. అతడు నిర్మల యశస్యుడు. ప్రజారంజకంగా పాలన చేస్తున్నావాడు. పెద్దలు, గురువుల ఎడ విశేష గౌరవం కలిగినవాడు. వేదాలను శ్రద్ధగా నేర్చుకున్నాడు. అన్నిటికీ మించి నాకు ప్రియాతి ప్రియమైన శిష్యుడు. అతనికి నీ కుమార్తెను ఇమ్మని అడగడానికి వచ్చాను" అన్నాడు వశిష్ఠ మహర్షి .

సూర్యుడు సంతోషంతో సమ్మతించి తన కుమార్తె తపతిని వశిష్టుడి వెంట సంవరణుడి దగ్గరకు పంపాడు. ప్రతిష్ఠానపురంలో వారిద్దరి వివాహం వశిష్టుడి ఆధ్వర్యంలో అతి వైభవంగా జరిగింది.

సంవరణుడు తపతిని పెళ్ళి చేసుకున్నాక రాజ్యపాలనంతా మంత్రులకు అప్పగించి నదీపర్వత ప్రాంతాలలో భార్యతో ఇష్టభోగాలు అనుభవిస్తున్నాడు. అలా పన్నెండేళ్ళు గడిచాయి. రాజు యజ్ఞ యాగాది ప్రజాహిత క్రతువులు చయ్యకుండా విషయలోలుడై వున్నందున అతని రాజ్యంలో అనావృష్టి ప్రబలింది. తిండి, బట్ట కరువై ప్రజలు దేశాంతరం వెళ్ళవలసిన దుస్థితి కలిగింది.

అప్పుడు వశిష్టుడు సంవరణుని సతీసమేతంగా నగరానికి తీసుకువచ్చి పుణ్యస్నానాలు చేయించి శాంతి క్రతువులు నిర్వహింప చేశాడు. ఇంద్రుడు సంతోషించి వర్షం కురిపించాడు. దేశం మళ్ళీ సుభిక్షమైంది. సంవరణుడు అప్పటినుంచి యజ్ఞయాగాది కర్మలు చేస్తూ చాలాకాలం చక్కగా పరిపాలన చేసాడు. ఆ దంపతులకు కురు వంశానికి మూలపురుషుడైన 'కురువు' జన్మించాడు.

భూమ్యాకాశాలకు తన ప్రచండ కిరణాలతో తాపం కలుగచేసే సూర్యభగవానుడి కుమార్తె కావడం వలన కురువు తల్లికి తపతి అని పేరు వచ్చింది. తపతి వంశోద్ధారకులు కాబట్టి కురుసంతానాన్ని 'తాపత్యులు ' అని కుడా అంటారు.

వింధ్య పర్వతాలకు పశ్చిమంగా ప్రవహించి ప్రజల పాపాలు పోగొట్టమని భాస్కరుడు తన కుమార్తెను దీవించాడట. తండ్రి ఆశీస్సును అనుసరించి తపతీదేవి నదీమతల్లిగా మారి నర్మదానదిలో లీనమై ప్రవహిస్తోంది.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore