Online Puja Services

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం

13.58.60.34
అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం.............!!

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలోమొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది. 

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ.....

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది. 

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది. 

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.
 
- రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha