శ్రీ విద్య ఉపాసన విధానము -1
శ్రీ విద్య ఉపాసన విధానము -1
పరాపశ్యంతి ప్రియా వైఖరీశశికళా శ్రీమంజులా
మధ్యమా కరుణాకటాక్ష లహరీ కాత్యాయనీ భారతీ
దుర్గాంబా నవకోటిమూర్తి సహితా మాంపాహి మాహేశ్వరీ
వేదాంతము యొక్క సత్యము లేదా గూడార్థము లేక పరమార్థమే అద్వైత సిద్ధాంతము. ప్రతి ఆలోచన వెనకాల ఉన్న ప్రణవ నాదమయిన ఓంకారము మరియు బీజాక్షరములు దీనిని సమర్థిస్తాయి.
వేదాంతము యొక్క ప్రణవనాదము ఓం.
హ్రీం, మరియు అహం అనేవి శక్తి మరియు శివ బీజాక్షరములు.
ప్రణవము యొక్క అంతము బిందు అనగా శక్తి.
అన్నింటికీ ద్రవ్య కారణము (material cause) బిందు అనగా శక్తి.
నియమరహితమయిన, మరియు సర్వవ్యాపి అయిన పరబ్రహ్మన్ లేదా పరమసత్యము నుండే నియమసహితమయిన సత్యములు (entities) అన్నీ ఏర్పడతాయి. కనబడుతున్న చరాచర ప్రపంచము అంతయూ ఈ అనంత మయిన పరాబిందులోని భాగమే.
శక్తి, శివుడి లోని భాగమే సృష్టి, మరియు లయలు. వైభవము, కృప, మరియు సౌందర్యములతో కూడిన ఈ ఆదిశక్తి నిత్యసంతోషి. ప్రతి మనిషి తెలిసో తెలియకో కోరుకునేది ఆనందమే. ఇదే సనాతన వైదీక ధర్మ సారము.
అన్యదేవ తద్విదితాదథో అవిదితాదథి
ఇతి శుశృమ పూర్వేషాం యేనస్తద్వ్యాచ చక్షిరే ....కేన 4.1
పరబ్రహ్మము నిశ్చయముగా తెలిసినదానికంటే భిన్నమయినది. తెలియని దానికంటే అతీతమయినది.
మహాత్రిపుర సుందరీ దేవి అతి సౌందర్యవతి మరియు జ్ఞానవతి. సృష్టి, స్థితి, మరియు లయకారిణి. వ్యక్తీకరణకు కారణమయిన త్రిగుణములు, మరియు పృథ్వీ, ఆపః, తేజో, వాయు, మరియు ఆకాశము అనే పంచ భూతములకు అధికారిణి.
స్థూలరూపములో ప్రార్థించే వారికి త్రిపురభైరవిగా దర్శనమిస్తుంది ఆ అమ్మ. ఆమె నిజమయిన రూపము ఆ అనంతమయిన పరమాత్మే.
మంత్రధ్యానముద్వారా ఆ అమ్మను క్రియాశక్తి రూపమయిన శ్రీదేవిగా దర్శించుకొనవచ్చు. దీనిని అనవోపాయ మార్గము అనగా కాంతి మార్గము అంటారు. ఈ ధ్యానమును క్రియ అంటారు. దీనిలో మంత్రమును పునః పునః బయటికి వినబడునట్లుగా ఉచ్ఛరించుతూ ఉంటారు. శ్రీదేవి శరీరము మంత్రము.
విమర్శనా శక్తి అనేది ఆత్మావబోధ. దానిద్వారా అమ్మ శరీరమును వర్ణిస్తుంది. సాధకుడి సాధనఫలించి ఆ దేవతా చేతన లభ్యము అయినప్పుడు దానిని శ్రీవిద్య అందురు.
ఆ శ్రీవిద్య యొక్క వాచికోచ్చారణ పంచదశిమంత్ర ఉచ్చారణము. దానిని దర్శించుకోవటము అనేది శ్రీచక్రము.
శ్రేష్ఠతరము, దానికి సాటులేనిది, అద్భుతము, చేతనా స్వరూపము, మరియు స్వయంప్రకాశీ అయిన అమ్మయే ఆ మహాత్రిపుర సుందరీదేవి. తన చేతనతో ఆ అమ్మ మూడు లోకాలను అనగా కారణ, సూక్ష్మ, మరియు భౌతిక లోకాలను లోపల బయట ఆక్రమించినది.
ఆ అమ్మయే పరాశక్తి, పరమ శివ, మరియు పరబ్రహ్మ. తీవ్ర, మరియు నిశ్చల సాధనద్వారా ఆ అమ్మ దయతో సాధకుడు అపరిమితమయిన ఆనందం మరియు ఆఖరి సత్యము తెలుసుకుంటాడు.
పరబ్రహ్మ అనగా పరమాత్మ చైతన్యము శివ మరియు శక్తి స్వరూపము. అదే ప్రకాశము మరియు మార్పిడి. శివ మరియు శక్తి చూడాటానికి రెండు. నిజానికి ఒకే పరమాత్మ చైతన్యముయొక్క రెండు ముఖములు. ఆత్మ స్వయం ప్రకాశమయినది. దానిలో శివ భావము అత్యధికముగా ఉండును. దానిలోని రెండవ భావమయిన స్పందనా భావమే విమర్శన, క్రియ లేక శక్తి. ఈ శక్తిభావము శివభావమునకు లోబడే పనిచేస్తుంది. దీనిలో భౌతిక మయిన ప్రక్రియ ఉండదు. మానసికమయిన ప్రక్రియదే ప్రధాన పాత్ర.
వ్యర్థమయిన ఆలోచనలనుండి మనకు మనమే పూర్తిగా ఉపసంహరించు కొనవలయును. తన మనస్సును తనే చూస్తుండవలయును. దీనినే సహజ సమాధి అందురు. ఇది క్రియాయోగాములోని హాం సా క్రియయే. ప్రకాశము తెలియజేయడమును శివభావము అంటారు. ఈ శివభావమే శబ్దము లేక శక్తి భావమును కలగచేయును. మరియు చైతన్యమును కలగచేయును.
పరాశక్తియే అన్ని శక్తులకు మూలకారణమయిన ప్రప్రథమ శక్తి.
కారణ, సూక్ష్మ, మరియు భౌతిక మూడు పురములకు వలసిన శక్తిని ఒసగు నది, మరియు కారణమయినది కావున దీనిని త్రిపుర అందురు. బాల అనగా యౌవనము. అది శక్తివంతము. శక్తివలననే సుందరత ప్రకటితమగును గాన దీనిని బాలాత్రిపురసుందరి అందురు.
కారణ శక్తిని సరస్వతిమాత అని, సూక్ష్మ శక్తిని లక్ష్మి మాత అని, మరియు భౌతికశక్తిని కాళీమాత అని పిలుచు కోవటము పరిపాటి.
సూర్యుడు, మరియు సూర్యకాంతి వేరు వేరు కాదు. అటులనే శివుడు వేరు, ఆయన శక్తి అనగా పరాశక్తి వేరు కాదు. పారిభాషికముగా మనము అర్థము చేసికొనుటకై వేరు వేరుగా చెప్పుకుంటాము.
కారణ, సూక్ష్మ, మరియు భౌతిక మూడు పురములను ప్రకాశించునదే ఈ పరాశక్తి. కారణపురమును గాఢనిద్రావస్థ అని, సూక్ష్మపురమును స్వప్నావస్థ అని, మరియు భౌతిక పురమును జాగ్రతావస్థ అని పేర్కొంటారు.
వ్యష్టిలో భౌతికపురమును పాతాళలోకము, సమిష్టిలో భూ అనగా భూలోకము అంటారు.
వ్యష్టిలో సూక్ష్మపురమును మహాతలలోకము, సమిష్టిలో భువర్ అనగా భువర్లోకము అని,
వ్యష్టిలో కారణపురమును తలాతల, సమిష్టిలో స్వ లోకము అని పేర్కొంటారు.
ఈ పరాశక్తి పరమాత్మయొక్క మెరుపు అంటారు. ఇది మానవ శరీరములోని మూడు ప్రదేశములలో అనగా లలాటము, శిరస్సు, మరియు హృదయము లలో జ్ఞానము, క్రియ, మరియు ఇచ్ఛాశక్తులుగాను, ప్రదర్శించ బడుతుంది. ఆ విధముగా ధ్యానములో తెలియబడుతుంది. ఈ అంతర్గతముగానున్న శక్తులు పూజాసంకేతము, చక్రసంకేతము, మరియు మంత్రసంకేతము, అని మూడు విధములు.
పూజాసంకేతము:
బాలాత్రిపురసుందరి మహావిద్య యొక్క మొదటి బీజము. అమ్మ తన లలాటములో శోభ, మరియు జ్ఞానశక్తి రూపములో ప్రదర్శిస్తుంది. దానినే సృజనాత్మకశక్తి, లేదా సృష్టి లోని భిన్న రూపములు. ఈ లలాటమునే ఆజ్ఞాచక్రము అందురు. ఈ ఆజ్ఞాచక్రమును ఇంద్రుని వజ్రాయుధము అందురు. ఇక్కడే మనస్సును దృష్టిని ఏకాగ్రతచేయవలయును. పరాశక్తి తన ప్రకటత్వమును జ్ఞానముద్వారా తెలియజేయును. పరాశక్తి వ్యక్తీకరించుట అనునది ఒక శబ్ద రూపములో తెలియబరచును. ఈ నిరంతర అనాహత నాదము శబ్దరూపములో ప్రకటితమగును. ఆ నిరంతర అనాహత నాద శబ్దమునుండి అన్నివిధములయిన దైనందిన కార్యకలాపాలు ప్రారంభమగును.
ప్రతివ్యక్తియొక్క లలాటము జ్ఞానము యొక్క సింహాసనమే. స్థూలముగా వ్యక్తియొక్క లలాటము పరిశీలించినయడల ఆ వ్యక్తియొక్క హావ భావము లను, ఉద్దేశ్యములను, మరియు ప్రవర్తనను గ్రహించుటకు వీలుబడును. జ్ఞానము అనేది ఆలోచనకు రంగుపులుమును. జ్ఞానశక్తి తనను తను భిన్న రూపములో వ్యక్తము చేయును. దానికి ప్రతీకయే ఇంద్రధనుస్సు.
మంత్రసంకేతము:
మంత్రసంకేతము యొక్క మార్మికమయిన (Mystic) బీజముద్వారా దాని ఉద్దేశ్యము లేదా సంకల్పము తెలియబరచును. విశ్వవ్యాప్తశబ్దబ్రహ్మ నాదము ద్వారా ప్రప్రథమమయిన జ్ఞానము తెలియ చేయును. ఈ నాదము స్థూలముగా అయ్యి మూడువేదములద్వారా వినబడుతుంది.
ఋగ్వేదములోని ప్రథమ మంత్రము ‘అ’ అక్షరముతో ప్రారంభమగును.
యజుర్వేదములోని ప్రథమ మంత్రము ‘ఇ’ అక్షరముతో ప్రారంభమగును.
సామావేదము లోని ప్రథమ మంత్రము ‘అయి’ అక్షరముతో ప్రారంభమగును.
ఇది స్థితి – జ్ఞానము – ఆనందము అనే బ్రహ్మముయొక్క అంశములను తెలియబరుస్తుంది. అనగా మూడువేదముల సారము అద్వైతమే.
‘అయి’ అక్షరముతో బిందును కలిసి ‘అయిం’ అవుతుంది. అది వివిధ రకముల శబ్దములను శాసిస్తుంది. కనుక తనకు సాటిరాని అద్వైతశక్తి తన జ్ఞానముతో ‘అయిం’ మంత్రములో నిక్షిప్తమయిఉంటుంది. ఇదియే సరస్వతీ జ్ఞానదేవత యొక్క బీజమంత్రము.
వాక్కుయొక్క ప్రథమ రూపము ‘పశ్యంతి’. ఏకాగ్రత అనగా ఆజ్ఞాచక్రము మీద మనస్సు దృష్టి ఉంచాలి.
క్రియాశీల వ్యక్తీకరణకు సిద్ధమయిన ‘కుండలినీ’ యొక్క ప్రదేశము భౌతిక శరీరములో పొత్తికడుపు, నాభి క్రింద శరీరము. దీనినే అథోకుండలినీ అంటారు. ముఖ్యమయిన ఇడా, పింగళ, మరియు సుషుమ్న సూక్ష్మనాడులు ఇక్కడే ప్రారంభమవుతాయి. అవి ప్రారంభమయ్యే ప్రదేశమును యుక్తత్రివేణి అంటారు.
మార్మిక(mystic)నిద్రనుండి జాగృతి చెందిన కుండలినీ సహస్రార వరకు మెరుపులాగా చేరుతుంది. అప్పుడు దానిని ఊర్ధ్వ కుండలిని అంటారు. ఈ ఊర్ధ్వ కుండలినిని ముక్త త్రివేణి అంటారు.
కుండలినీ అన్ని రకముల శక్తులకు మూల యోని. అది సూక్ష్మమయిన కందర్పవాయు, ప్రాణవాయువు కాదు. ఆ కందర్పవాయువు నివాసము మూలాధారచక్రములోని త్రిభుజము. ఇది ఇచ్ఛాశక్తి, జ్ఞానము, మరియు క్రియాశీలతకు ముఖ్యముగా జ్ఞానమునకు స్థానము. పైన బిందువుతో ఇది శక్తివంతమయిన బీజమంత్రము. ఈ ‘అయిం’ బీజమంత్రమును పునః పునః ఒక పధ్ధతి ప్రకారము ఉచ్ఛారణ చేయుటవలన కుండలినీ జాగృతి చెందును.
పూజాసంకేతము ప్రకారము బాల మహావిద్య యొక్క రెండవ బీజమంత్రము శిరస్సు నుండి అన్ని ప్రక్కలకు వ్యాప్తిచెందు చంద్రుడి లాంటి స్వచ్ఛమైన, మరియు ధవళ కాంతితో కూడిన క్రియాయాశీలకశక్తి. ఆ అమ్మని శాంతి, మరియు ప్రేమలతో సంయుక్తమయిన జగన్మాతగా కొలుస్తారు.
శిరస్సు నుండే క్రియాశీలకశక్తి పనిచేస్తుంది. జ్ఞానమునకు మూలము ఆలోచన. ఆలోచననుండే క్రియాశీలక శక్తి పనిచేస్తుంది. జ్ఞానము మరియు ఆలోచన రెండూ కలిసి క్రియాశీలకతకు కారణము అగును. క్రియాశక్తి జ్ఞానశక్తిని (predominates) అధిగమిస్తుంది. స్వచ్ఛమైన, మరియు ధవళ కాంతితో కూడిన చంద్రకాంతి సహస్రారచక్రములోని స్వచ్ఛమైన జ్ఞానమునకు ప్రతీక. ఇక్కడినుండి క్రియాయాశీలకత సమంగా ఫలీకృతముగా నిర్వర్తించ బడుతుంది. వ్యక్తియొక్క శిరస్సు కాంతికి స్థానము.
శిరస్సులో ఊహ జనితమయినప్పుడే కార్యాచరణ(Activity) మొదలగును. జ్ఞానమును వృద్ధిచేయును. దాన్ని బలపరచును. సఫలీకృతమయిన సాధనకు దారితీయును. అది ముక్తికి (emancipation) దారితీస్తుంది.
మంత్రసంకేతము ప్రకారము బీజమంత్రము ‘క్లీం’ యొక్క వివరణ ఇక్కడ చెప్పుకోవాలి. పరమాత్మ జ్ఞానము అవ్యక్తమయిన శబ్దబ్రహ్మ రూపములో వ్యక్తీకరించుతుంది. దానిని అనాహత నాదము అంటారు.
‘అ’ నుండి ‘అం’ వరకు ఉన్న అక్షరములను అచ్చులు అంటారు.
‘క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ఱ ల’, అను హల్లులు ఈ అచ్చులతో కలిసినప్పుడు విశిష్టమయిన శబ్దము వ్యక్తీకరిస్తుంది. ‘క్ల’ అను శబ్దము సృష్టికి సంకేతము. అది పరిరక్షణమునకు దారితీయును. జ్ఞానము క్రియాశీలతకు దోహదపడును.
‘ఐ’ అనునది స్వచ్చమైన భావనకు సంకేతము. అది కేవలము భావనాశక్తి యొక్క పరివర్తనే.
బిందు అనునది ద్వైత లేదా వేరొక భావనలేని అద్వైత పరాశక్తి భావనకు సార్వత్రిక(universal) వ్యక్తీకరణకు సంకేతము. అది ఒక కూడలి(junction). ఇక్కడ అన్ని కోరికలు లేక కామకోటి సఫలీక్రుతము అవుతాయి. అది ఒక చల్లని కాంతి. ఇక్కడ బీజమును మహాలక్ష్మి లేదా లలితా బీజము అంటారు. అది కాళి మరియు లక్ష్మి అని రెండు విధములుగా ఉంటుంది.
కాళిగా దూషణ రూపము దాల్చి పిరికి మరియు నిర్లక్ష్యపు(unwary) హృదయములలో భయము మరియు ఆందోళన(fear and panic)లను పోగొడుతుంది. లక్ష్మిగా నిరపాయమయిన (benign) రూపము దాల్చి తెలుసుకొనే మరియు పట్టుదలగల సాధకులను పెంపుడు (foster) తల్లిగా సాకుతుంది.
ఈ విధముగా ‘క్లీం’ అనేది పరాశక్తియొక్క క్రియాశక్తికి ప్రతీక. దీనిని వాక్కు యొక్క రెండవమెట్టు ‘మధ్యమ’ అంటారు. దీని ఉచ్ఛారణ శిరస్సులో జరుగుతుంది.
అచ్చులు హల్లులకు తోడ్పడి సరియిన సంయుక్తాక్షర శబ్దమును దొర్లించును. భావనలు (ideas) శబ్దరూపము (words) దాల్చును.
ఇచ్చ్చాశక్తి(power of will or volition)యొక్కస్థానము హృదయము. పూజా సంకేతము ప్రకారము త్రిపుర విద్య అనగా మహా త్రిపురసుందరి యొక్క మూడవ బీజము హృదయమునుండి ఉత్పన్నమగును. అనాహత చక్రము స్థానము హృదయము. ఇచ్ఛాశక్తియే జ్ఞానము మరియు కార్యాచరణమునకు మూలకారణము. సూర్యుడు చీకటిని పోగొట్టినట్లు, ఇచ్ఛాశక్తి జ్ఞానాంధకారము ను పోగొట్టును. హృదయముయొక్క కేంద్రము నిత్య నూతనముగా ఉండును. కార్యాచరణమునకు కంటే జ్ఞానము అధికమయినప్పుడు, ముక్తి మరియు ఆనందమునకు మార్గము సుగమము అవును. అప్పుడు ఆలోచనా శక్తి, ఇచ్ఛాశక్తి పనిలోకి దుముకును. దీని స్థానము హృదయము. పరిపూర్ణముగా అర్థముచేసికొనుటకు హృదయము ప్రతీక. మంచి చెడు సంస్కారములన్నియు (అలవాట్లు) తగలబడిన తదుపరి హృదయము ప్రకాశించును. ప్రశాంతత (serenity)కు దారితీయును.
అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసాం
ఉదారచరితానాంసు వశుధైక కుటుంబకం
జ్ఞానము లభ్యమయిన తదుపరి, వాడు వేరు, వీడు వేరు, నేను వేరు అనే భేదము వదిలి వేస్తాడు సాధకుడు. ప్రపంచమే ఒక కుటుంబం అని పరిపూర్ణముగా అర్థముచేసికుంటాడు. దీనినే పరమాత్మ చైతన్యము అంటారు. ఇక్కడ అధిష్టాన దేవత గౌరి. ఆ అమ్మనే మహాత్రిపురసుందరి అంటారు. ఇక్కడ మార్మిక అక్షరము ‘సౌ’. ‘సౌ’ అక్షరము ఇచ్ఛాశక్తికి ప్రతీక. ఇచ్ఛాశక్తినే విసర్గశక్తి అనికూడా అంటారు. విసర్గశక్తి అనగా వదిలిన శక్తి. కురుస్తున్న ధారామృతమును లేదా సాటిలేని సుఖమును విసర్గ అంటారు.
ప్రపంచము మూడువిధములు మాత, మేయ, మాన, అని. ఈ మూడు ఒకటి అవటమును సత్తాయొక్క సామాన్య అవస్థ అంటారు. అప్పుడు ద్వైతము నుండి మానవుడు విడివడుతాడు. వ్యక్త మరియు అవ్యక్త జగత్తు రెండింటిలోను, ఆధ్యాత్మిక కాంతి వ్యాపిస్తుంది. దీని స్థానము హృదయము.
‘స’ అనగా ‘తో’ లేక ‘కూడా’ అని, ‘ఔ’ అనగా ‘నిశ్చయము లేక నిర్ణయం, మరియు ‘విసర్గ’ అనగా ‘విముక్తిని’ అని అర్థము. కనుక నిర్ణయముతో ఈ బీజము అన్ని బంధములనుండి విముక్తిని ప్రసాదించును. ఈ బీజమును పరా బీజము అని కూడా అంటారు. మహాత్రిపురసుందరి తనను తాను సాధకుని ఆత్మే అని తెలియబరచటమే సఫలీకృతమునకు గుర్తు. అంతియేగాదు, జీవుడు పృథ్వీ నుండి మాయవరకు 31 తత్వాలతో ‘స’ అనే బీజాక్షరము ప్రాతినిథ్యము వహిస్తుంది. త్రిపురభైరవి యొక్క శుద్ధవిద్యయే సదాశివ, మరియు ఈశ్వర తత్వములు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, మరియు క్రియాశక్తి లకు ‘ఔ’ ప్రతీక.
‘విసర్గ’ శివస్వరూపములో నిబిడియున్న ‘శక్తి’ స్వరూపమునకు ప్రతీక.
జాగృతి చెందిన సాధకునకు కుండలినీ శక్తి అంతర్గతమయిన కాంతితో వెలుగొందు చుండును. జ్ఞానముద్రలో ఈ ‘సౌ’ మంత్రమును తీవ్ర ఏకాగ్రతతో జపించిన ‘ఇచ్ఛాశక్తి’ నిర్ణయాశక్తిగా మారును. సాధకుడు విషయవాంఛలలో నుండి బయటపడును. అది ముక్తికి దారితీయును. దీనినే వాడవ మంత్రము అనికూడా అంటారు.
శ్రుష్టి కర్మ లో ఈ వ్యక్తీకరణను ‘వైఖరీ’ అంటారు. ‘మల’ దోషము అనేది అజ్ఞానం వలన జనించును. అందువలన తన అంతర్గత అజ్ఞానం వలన తగులము ఏర్పడును. ఇది మొదటి ‘అపూర్ణత్వ’ పరిమితి. ‘అపూర్ణత్వ’
ఆనవమల అనగా అపూర్ణత్వమానవం నుండి తీసుకొనిరాబడుతుంది. విశ్వచేతన నుండి వ్యష్టి పరిమితి చేతనవరకు అనగా అణుత్వము వరకు తీసుకొనిరాబడుతుంది. పరమాత్మయొక్క చేతన ఆఖరికి పరిమితి చెందుతుంది.
ఆనవమల రెండు విధములు.
అవి:
పౌరుష అజ్ఞాన మరియు బౌద్ధఅజ్ఞాన.
1. పౌరుష అజ్ఞాన: మూర్తీభవించిన అజ్ఞానము.
2. బౌద్ధఅజ్ఞాన: బుద్ధిలో అంతర్గతముగానున్న అజ్ఞానము. ఈ మలిన దోషము వలన వ్యక్తి తనను ప్రత్యేకమయిన జీవి అని తలపోస్తాడు. విశ్వచైతన్యం నుండి తన చైతన్యం వేరు అనుకుంటాడు. ఇది అత్యంత సూక్ష్మమయిన మలినము. ఇది కాక సూక్ష్మము, మరియు స్థూల సూక్ష్మము అని ఇంకా రెండు రకముల సూక్ష్మము మలినములు ఉంటాయి. అశుద్ధ మార్గముతో సంపర్కము కలిగిన మానవుడు లేక జీవుడ్ని మయ్యామల మరియు కర్మమలములు ఇంకా నీచస్థితికి దిగజార్చుతాయి.
మయ్యామలము భిన్నమయిన చేతనా బేధమును కలుగజేయును. (భిన్న వేద్య ప్రథాత్వం మయ్యం). పరిమితితోకూడిన శరీరముయొక్క భిన్నమయిన అంగములవలన కలిగే సంయోగమే దీనికి కారణము. దీనివలన జ్ఞానశక్తికి విఘాతమేర్పడి పరిమితిచెందినదిగా అవుతుంది. అంతేకాదు, వాసనలవలన (శుభాశుభ వాసనామయత్వం కర్మాం) మిగిలిన పాత జన్మలలోని తీరని కోరికలవలన కలిగే సంచిత కర్మ అవశేషాలు ఈ పరిమితిని అధికము చేస్తాయి.
దీనిని కర్మమలము అంటారు. (సశేషం)..