భీష్ముడు చేసిన ఉపదేశం
భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒకనాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.
భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్చంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని భాదలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది. ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.