అద్భుత మంత్ర శక్తి
అంతశ్చేతన మనస్సు యొక్క_శక్తి - వైజ్ఞానిక విశ్లేషణ :
"ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ...." అంటూ చేతులు దగ్గరగా చేర్చగానే అందులోంచి విబూది రాలడం మొదలైంది, అక్కడ ఉన్నవాళ్ళంతా ఆశ్చర్యంగా దోసిళ్ళనిండా ఆ విబూదిని నింపుకున్నారు, కళ్ళకద్దుకున్నారు. కైలాసంలోంచి శివుడు కదలి వచ్చాడో, లేక కాలభైరవుడితో కాస్త విబూది పంపించాడో మరి ఆ చిన్న అద్దంకి గ్రామంలో పెంకుటింట్లో దశాబ్దాలుగా మానవాళికంతుపట్టని విచిత్రాలు రోజూ జరుగుతుంటాయి.
అలా అద్భుతంగా గాలిలోంచి విబూదిని సృష్టించిన ఆ మహానుభావుడు మాత్రం ఏ మాత్రం తొణకకుండా, అక్కడజరిగిందేదో మామూలు విషయం అన్నట్లు, పక్కనే వున్న ఈనాడు పేపర్ చింపి అందరికి ఇచ్చాడు, విబూది ఇళ్ళకి తీసుకెళ్ళడానికి! ఇదంతా చూస్తున్న వారిలో తూర్పు గోదావరి జిల్లా నించి వచ్చిన ఓ ఫిజిక్సు లెక్చరర్ గారికి ఇది సంభ్రమం గానే కాక మంచి అవకాశంగా కూడా తోచింది. ధైర్యంచేసి అనుమానం వ్యక్త పరచారు, ఈ సిద్ధ శక్తిని గురించి విని అన్వేషించడానికే ప్రత్యేకంగా వచ్చిన ఆ భౌతిక శాస్త్ర అధ్యాపకులు.
"అయ్యా! ఈ విభూదిని ఎలా సృష్టించారు? ఇలా గాలిలోంచి మీరు వస్తువులను సృష్టిస్తారని విని నేను చూడ్డానికే నేను వచ్చాను. నా ఏ విధమైన వ్యక్తిగత సమస్యలు గాని, ఆశలుగాని తీసుకుని మీవద్దకు రాలేదు. నా ఆసక్తి - ఆ శక్తే! దయచేసి చెప్పండి ఏ సాధన వల్ల, ఏ దివ్య శక్తి అనుగ్రహం వల్ల ఈ సిద్ధ శక్తిని మీరు సాధించారు?" అని వినయంగా అడిగారు మాష్టారు.
"మాష్టారు, ఇది అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి అనుగ్రహం. చిన్నతనం నించి ఆ అమ్మవారి ఉపాసన వల్ల ఒక దివ్య శక్తి నాకు లభించింది, అది నిరంతరం నాతో వుంటుంది" అని అమ్మవారి విగ్రహం వైపు చూసి నమస్కరించారు ఆ సిద్ధపురుషులు.
"భౌతికశాస్త్రాన్ని బోధించే నేను ఒక ప్రశ్న అడకకుండా ఉండలేకపోతున్నాను. మీరేమీ అనుకోకపోతే..!" అడిగారు మాష్టారు, "విశ్వంలో ఎవరూ పదార్ధాలని సృష్టించలేరు, నశింపచేయలేరు. ఈ ఫిజిక్సు సిద్ధాంతాన్ని ఇంతవరకు ఎవరూ అసత్యం అని నిరూపించలేదు. కానీ ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం మీరు విబూదిని సృష్టించారు, నన్ను, నేను జీవితాంతం నమ్మిన ఫిజిక్సునీ కూడా ఛాలెంజ్ చేసారు - ద్రవ్యనిత్యత్వ నియమాన్ని అబద్దం అని నిరూపించారు. ఆ ఆశ్చర్యం నించి నేనికా తేరుకోలేదు".
ఇలాంటి ఎన్నో చిత్రాలని చూసిన, చూపించిన ఆ సిద్ధ యోగి మాష్టారి ప్రశ్నకి ఆనందంగా నవ్వారు. "మాష్టారు, నేను కేవలం మూడో తరగతివరకే చదివాను. నాకు ఈ నియమాలు తెలియవు కానీ నేను కూడా ఫిజిక్సుని, ఆ మాటకొస్తే విజ్ఞానాన్నంతటినీ గౌరవిస్తాను. మా ఇద్దరు అబ్బాయిలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. నాకు మీరు చెప్పిన ఫిజిక్సు సూత్రం తెలియదు, కానీ మీ ప్రశ్న అర్ధమైంది. బహుశా నేనుకూడా ఆ సిధ్ధాంతాన్ని అసత్యంచేయటంలేదేమో! " అని ఆపారు.
మాష్టారికి అర్ధం కాలేదు. ఇప్పుడే గాలిలోంచి విబూదిని సృష్టించిన ఈయన ఏమీ సృష్టించేయలేదంటాడేమిటి? ఇదంతా కేవలం ఇంద్రజాలమా? కనికట్టా? ఇంతలో సిద్ధపురుషులు ఒక రహస్యాన్ని చెప్పారు.
"నిజంచెప్పాలంటే నేను విబూదిని సృఇష్టించలేదు. అది ఒక చోటినించి ఇంకొక చోటికి తరలించ బడింది అంటే! అయితే ఆ తరలించే పని చేసింది నేనో, ఏ మానవ శక్తో కాదు సుమా.." అని ఆపారు అర్ధమైందా? అన్న చూపుతో.
మాష్టారి ఆసక్తి ఇంకా పెరిగింది. అయితే ఈయన విబూదిని ఎక్కడో చేతుల్లో దాయలేదు, ఖాళీ చేతులు అందరు కళ్ళారా చూసారు, పైగా ఆయన కనీసం చొక్కా కూడా వేసుకోలేదు, కిలో విబూది దాచుకోడానికి. ఇది కనికట్టూ కాదు. అయితే ఈ శక్తి ఏంటి...... అన్న అనుమానం, జిజ్ఞాస దొలవడం ప్రారంభించాయి. ఆయన భావాలని కనిపెట్టినట్టు ఆ సిద్ధయోగులే చెప్పారు, "ఇది ఒక అద్భుత మంత్ర సిద్ధి. అనేకమంది ఉపాసకులు తీవ్రసాధన చేసాక కొన్ని సిద్ధులు అణిమ, గరిమ, మహిమ లాంటివి వస్తాయని మీరు వినేవుంటారు. అలాగే నాకు ఈ దివ్యశక్తి లభించింది..... అంటూనే గోడకున్న ఒక ప్రశంసా పత్రాన్ని చూపించారు. ఒక ప్రముఖ మాజీ ముఖ్యమంత్రి గారి సంతకంతో వున్న ఆ పత్రం, ఆ సిద్ధయోగి ఏ విధంగా తమకు అనుగ్రహాన్ని ప్రసాదించారో, కొన్ని అపురూపమైన విషయాలలో సహాయం చేశారో క్లుప్తంగా వుంది ఆ మంత్రిగారి ఫొటోతో బాటు.
ఫిజిక్సు మాష్టారు ఇంక వుండబట్టలేక అడిగేసారు, "స్వామీ, మీరు నన్ను శిష్యునిగా అనుగ్రహించి ఈ అపురూప విద్యని బోధిస్తారా?" అని.
యోగి అందుకు సమాధానమివ్వకుండా కళ్ళుమూసుకున్నారు. కొద్ది నిమిషాలలో కళ్ళు తెరిచి చెప్పారు, "మీకు మీ ఇష్ట దేవత ఐన అమ్మవారు, కనక దుర్గా దేవి ఏదో ఇవ్వాలనుకుంటోంది". మాష్టారు ఆనందంగా చూస్తుండగా ఆ యోగి ఇంకా చెప్పారు, "మీరు మళ్ళీ ఇక్కడికి రండి అదేంటో తెలుసుకుని అందచేస్తాను" అని. తర్వాత ఆ మాష్టారికి సిద్ధయోగి గాలిలోంచి విబూదిని, వస్తువులని సృష్టించడం వెనుక వున్న పద్ధతిని, క్రమాన్ని వివరించారు.
మాష్టారు నమస్కరించారు, ఆ సిద్ధయోగి నిజాయితీకి, శక్తికి, ఆయన వెనకున్న ఆ మహా శక్తికి! ఇక సెలవుతీసుకున్నారు. యోగులెందరో వున్నారు, ఎవరికి వారే శిష్యులను పెంచుకోడం, కీర్తిని, ధనాన్ని సంపాదించడంలో మునిగివున్నా, ఎక్కడో ఒక్కరైనా మహానుభావులు ఆ అతీతమైన తలాల (other dimensions) రహస్యాన్ని జిజ్ఞాసువులకు చెప్పినందుకు సంతోషించారు.
ఇది జరిగిన కొద్ది కాలానికి మాష్టారు మళ్ళీ వెళ్ళాలను కున్నారు, అనేక మానవాతీత విషయాలని తెలుసుకోవాలను కున్నారు. ఇంతలో తెలిసింది, ఆ సిద్ధయోగి తనువు చాలించారని. కాలానికెవరు అతీతులు? అమ్మ వారు ఏమి ఇద్దామనుకుంటోందో తెలుసుకునే లోపులోనే ఆ యోగి మరణించడంతో ఆ మాష్టారు ఇంకా అమ్మవారి సందేశంకోసం ఎదురుచూస్తూ అన్వేషిస్తూనే వున్నారు.భౌతిక శాస్త్రానికి , అధిభౌతిక శాస్త్రానికి మధ్య సంబంధాలని, కొత్తవిషయాలు తెలుసుకుని, సాధన చేసి తద్వారా కొన్ని శక్తులనీ సాధించారు, జ్యోతిశ్శాస్త్రంలోనూ పురోగమించారు.
ఒక యోగి, మామూలు ప్రపంచపు మానసిక పరుధులని దాటి దివ్యలోకపు అనుభవాలను నిజంగా పొందగలగడమే అనుభూతి, దాన్ని ఇతరులకు కూడా దర్శింప చేయగలగడం విభూతి.
1995 లో వినాయకుడు పాలు తాగి సి.ఏన్.ఏన్, బి.బి.సి లతో సహా అందరిని ఆశ్చర్యపరచాడని మనకి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా వినాయకుడి విగ్రహాలు పాలుతాగాయి ------ ఒక్కరోజు కోసం! అది ఎందరో నమ్మారు, ఎందరో నమ్మలేదు. కానీ నమ్మినవారు మాత్రం ఈనాటికి ఆశ్చర్యపోతున్నారు. ఇదెలా జరిగిందో అంటే ఒక గురువులు చెప్పారు, హిమాలయాలలో యుగప్రణాళికకు చెందిన ఒక మహా సమావేశం జరిగింది అని. దానికి అనేకురు మహా తపస్వులు వేంచేయగా అధ్యక్షునిగా సాక్షాత్తూ శ్రీ వినాయకుడే రావడం వల్ల సృష్టిలో ఒక చిత్రాన్ని చూపడం జరిగిందని, అదే వినాయకుడు పాలు తాగడం అని ఆ గురువులు చెప్పారు. అయితే ఆరోజు అందరు పాలు తీవ్రంగా కొనడం వల్ల పాల కొరత ఏర్పడి చాలా మంది ఈ చిత్రాన్ని చూడలేక పోయారు. కొంచెం ఆలోచిస్తే అసలు చిత్రం విగ్రహం పాలుతాగడం కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేకులు మేధావులు, పండితులు, విగ్రహం పాలు తాగింది అంటే నిజమా అని వారూ "ప్రయత్నించడం" ! నమ్మకం ఎంత చిత్రమైనదో, మానవుడి తృష్ణ అంతకన్నా చిత్రమైనది కదా! ఇవి కళ్ళతో ఎప్పుడు చూస్తామో తెలియదు, చూసేవరకు నమ్మాలో లేదో తెలియదు.
ఏది ఏమైనా నమ్మకం ప్రగాఢంగా వుంటే విభూతి అనుభూతిలోకి వస్తుందని వేదాంతులు అంటే, ఆ నమ్మకం కేవలం ఊహనే జనింపచేస్తోందని, కనిపించేది నిజంకాదని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. నమ్మకం వల్ల మానవ మేధస్సు దృశ్యాలని, చిత్రాలని జనింపచేస్తుంది 'నిజంగా వున్నాయా? ' అనిపింపచేస్తుంది అని వారి వాదం. మాస్ యూఫోరియా, మాస్ హిప్నోటిజం అనేక బలమైన విచిత్రాలని చూపగలవు, మనిషికి లేని శక్తిని ఇచ్చి సామాన్యులని కూడా హీరోలు గా చెయ్యగలవు అన్నది వాస్తవం కూడా. చొక్కా లేకుండా పది నిమిషాలు కూడా చలికి ఆగలేని ఒకతన్ని హిప్నోటిష్టు మంచుగడ్డ మీద అరగంట పడుకోబెట్టినా ఏమీ కానట్టు ఆనందంగా వుండగలుగుతున్నాడు. అందుకు కారణం మనిషికన్నా బలమైన మనో శక్తి "సబ్ కాన్షస్ మైండ్ ". పావుగంట ముందు పది రూపాయలు అప్పు తీసుకున్నా గుర్తులేని మనిషి పదిసంవత్సరాల క్రితం ఖచ్చితంగా ఏప్రిల్ ఒకటో తేదీన పళ్ళుతోంకున్నాడో లేదో చెప్పగలుగుతున్నాడు. చెప్పులు లేకపోతే ఎండలో బయటి వెళ్ళని ఇంకో సుకుమారుడు దేవుడికి మొక్కుకుని నిప్పులమీద నడిచేస్తున్నాడు. ఇంకొకాయన ఏడు రోజులు ఉపవాసం వుండి ఏడు కొండలు ఎక్కుతున్నాడు. దేవుడిమీద నమ్మకంతో పరిక్షలు పాసవుతున్నారు, అసాధ్యమనుకున్న ఇంటర్వ్యూలో విజయం సాధిస్తున్నారు.
స్వార్ధపూరితమైన మానవత్వం నశిస్తున్న అనేక మూల మూలల్లో, మన వ్యాసాలకి, వీసాలకి అర్ధంకాని జీవన సంగ్రామంలో, చీకటికోణంలో దేవుడు నిజంగా జీవించే వున్నాడు, అనుక్షణం ఆశాజ్యోతులని వెలిగిస్తున్నాడు అనిపిస్తుంది కదా? ఆ దేవుడు ఏ మతానికి, కులానికి, దేశానికి చెందని అతీత శక్తి, బహుశా ప్రతి మనిషిలో దాగిన నిగూఢ వ్యక్తి. అందరికి తెలిసిన అనామకుడు, ఆ దేవుడు. దేవుడున్నాడన్న నమ్మకంతో కొందరు మంచి పనులు చేస్తుంటే, దేవుడున్నాడేమో నన్న భయంతో కొందరు మంచిపనులు చేస్తున్నారు. ఏది ఏమైన మనకి దేముడి అవసరం వుందేమో అనిపిస్తోంది. అందుకే ఈ దృక్పధంలోంచి చూస్తే మంత్రం మన మనోవల్మీకంలో దాగిన అంతర్లీన ఆలోచనా శబ్దదృశ్య తరంగం. విశ్వాన్ని శాసించగల విశ్వాసం మంత్రం, విధికి అతీతంగా సంకల్పాన్ని సాధించే పెన్నిధి మంత్రం.
ఆంగ్లంలో ఆశ్చర్యకరమైన మంత్రాలని తెలుగువారికి అందించారు మాష్టర్ సీవీవీ. ప్రఖ్యాత శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారి వంటి వారు వీరి శిష్యులై ఈ నవీన మంత్రాలతో రోగాలను నయం చేసేవారట. "హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ ....." అనగానే ఆ హాలు వున్న అందరు కొద్దిసేపు స్పృహ కోల్పోయేవారుట. కొద్దిక్షణాలలో అందరు లేచేసరికి అనేకరోగాలు నయమయ్యే వట.
అసలు మంత్రానికి శబ్దం ప్రధానం కాదు అని వాదించినవారూ లేకపోలేదు. అందులో ప్రముఖ భారతీయ తత్వవేత్త మన తెలుగువారు జిడ్డు కృష్ణమూర్తి గారు ఒకరు. ". ఈ విషయం పక్కనుంచితే, వారి ఆలోచనా దృక్పధం చాలా పేరెన్నికగన్నది, వారి పుస్తకాలు నిజంగా ప్రతివారు చదవ వలసిన అపురూప జ్ఞాన భాండాలు. నిన్ను నువ్వు తెలుసుకుంటే అసలు గురువే అవసరంలేదు అన్నారాయన. వారి ఉపదేశంలో ఒకటి క్లుప్తంగా వివరిస్తే, "గురికోసం గురువు దగ్గరకు వెడితే, ఆ గురువనే గొడుగు నీకు దొరుకుతుంది. కానీ గొడుగులో వున్న నీకు ఎదుగుదలా వుండదూ, ఆ అనంత ఆకాశమూ కనిపించదు" అని అన్నారు. చాలా మందికి పెద్దగా పరిచయం లేకపోవచ్చుకాని జిడ్డు కృష్ణమూర్తి గారికి దగ్గరై, వారికి ఒక విధంగా భిన్న అభిప్రాయాలు వెలిబుచ్చిన ఇంకో మహానుభావులు యూజీ కృష్ణమూర్తి గారు. వారి అపురూప వాక్యం చాలా అలోచించదగినది, "నిజమైన గురువనేవాడే వుంటే ముందు తన బంధం నించి నిన్ను విముక్తుడ్ని చేస్తాడు".
గురువంటే గుర్తుకొచ్చింది మంత్రాలకున్న శక్తితో అటువంటి పరమగురువు అనుగ్రహాన్ని పొందవచ్చునా? ఆ గురువెవరో తెలుసుకో వచ్చునా? భూత,భవిష్యత్,వర్తమానాలని తెలిపే మంత్రాలున్నాయా? ఎవరి అనుభవం,అనుభూతి వారి స్వంతం.
ఎందరో మహానుభావులు.అందరికీ వందనాలు.
(సేకరించబడినది)