అమ్మ ప్రసన్న కామాక్షిగా ఎలా మారింది ?
కంచిలో కాళికగా సంహారకేళి చేసిన అమ్మ ప్రసన్న కామాక్షిగా ఎలా మారింది ?
లక్ష్మీ రమణ
కంచి కామాక్షమ్మ కన్నులతోటే అనుగ్రహాన్ని వర్షించే తల్లి . ఆ దేవత కరుణాని కోరుకున్న మూకశంకరులని అనుగ్రహించిన అమ్మ , తన నోటిలోని తాంబూలాన్ని ఆయనకీ ఒక తల్లి తన బిడ్డకి తినిపించిన చందంగా తినిపించి అనుగ్రహించింది . ఆ వెంటనే ఆయన ఏకంగా మూకపంచశతితో , అమ్మని స్తుతించి ఆమె కరుణని ఆస్వాదించారు. కానీ అంతకు ముందర ఆ అమ్మే తామసగుణంతో వర్ధిల్లుతూ , కంచి రాజుకి , ప్రజలకీ సింహస్వప్నమై వర్థిల్లిందా ? అంటే, అవునంటుంది చరిత్ర . ఆ కథ కమనీయం , రమణీయం, శంకర అనుగ్రహ ప్రదాయకం .
కోటి చంద్రికలు ఉదయిస్తే విరిసే దరహాసం అమ్మ చిరునవ్వు. చల్లని అమృతోపమానమైన వెన్నెల అమ్మ చల్లని చూపు . నుదుటన మరో సూర్యబింబమేమో అనిపించే కుంకుమబొట్టు , అక్కడి నుండీ యోగాలకే యోగ్యాన్ని నేర్పే నాశిక . పూర్ణ చంద్రుడైనా, ఆ మాటకొస్తే, లోకంలోని సౌదర్యం ఒక కుప్పగా వేస్తే మాత్రం అమ్మ కొనగోటితో సరిపోలుతుందా ? చేరుకుగాడ్ని పట్టుకొని విశ్వాన్నే నడిపే శ్రీచక్ర బిందురాజనిలయ కదా ఆ కామాక్షి మాత . పద్మాసనం వేసుకొని ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న శంకరాచార్యులవారికి కూడా ఇలాంటి అనుగ్రహించింది ఆ తల్లి .
కానీ, ఆ దేశాన్నేలే రాజరాజు అమ్మవారు మహోగ్ర స్వరూపమై తన బిడ్డలనే బలితీసుకుంటోందని చెప్పారే ! అక్కడి ప్రజలు భయంతో సాయం సమయం తర్వాత బయటికి రావడమే మానుకున్నారే ! తాను ఆ మందిరంలో అడుగు పెట్టె ముందరివరకూ అదే పరిస్థితి . మరి ఇక్కడ చూస్తే, అమ్మ కోటి చంద్రులకైనా అటువంటి కాంతి సాధ్యం కాదన్నట్టు , ఇంతటి సౌందర్య స్వరూపంగా రాజరాజేశ్వరీ దేవిగా అనుగ్రహిస్తున్నారు ! ఆమెని శాంతింప జేయాలని శాంతి పూజలు చేసిన పండితులని కూడా ఆరగించిన అమ్మ ఈమేనా? శంకరా ! ఏమయ్యా ఈ లీలామృతం ? సహస్రదళ పద్మంలో సహస్రార చక్రంలో గానామృతాన్ని వర్షిస్తున్న సర్వేశ్వరుడు కుండలిని శక్తిని చుట్టుకొని కనులముందు సాక్షాత్కరిస్తున్నారు . జ్ఞానామృతాన్ని వర్షిస్తున్నారు . అనుగ్రహిస్తూ ముందురా జరిగేది చూడమన్నారు .
సాయం సమయం అయ్యింది . అమ్మ మెల్లిగా లేచి నిలబడింది . పాజమంజీరాలు సరిగమల సారమేమో అన్నట్టు సుమధురంగా మ్రోగాయి . ఆ నాదానికి అమ్మచేతి గాజులు వంతపాడాయి . కర్ణకేయూరాలు దివ్యనాట్యం చేశాయి . అమ్మ మెల్లగా తన ఆసనం నుండీ దిగి లేచి , గుమ్మం దగ్గరికి వచ్చింది . ఇదంతా ఆ పరమాచార్యులు శంకరుని మనోనేత్రానికి కనిపిస్తూనే ఉంది. గుమ్మం దగ్గరున్న అమ్మ కూడా బాల శంకరులుగా కనిపిస్తున్న ఆ పరమాచార్యులవారిని చూసి అమితమైన వాత్సల్య దీప్తికి లోనయ్యారు . ఆ బిడ్డని చేరి ఆశీర్వదించాలని ఉద్దేశ్యంతో గుమ్మం దాటారు . అంతే , ఆమెని ఏదో తామస శక్తి ఆవహించింది . కనులు రౌద్రంతో ఎగసి పడుతున్నాయి . నాలిక పెదవులు దాటి కిందికి వేలాడుతోంది . అపార సంహారి కాళిలా కనిపించిన ప్రతి ప్రాణినీ కబళించేంత తామసము ఆ తల్లిలోని అణువణువునూ ఆక్రమించసాగింది . శంకరులు దివ్య గానంతో సౌందర్యలహరిని గానం చేశారు . అమ్మని కీర్తించారు .
ఆమెలోని తామసము తగ్గకపోయినా , అందులోనించి ఆశ్చర్యం తొంగి చూసింది. ఎవరీ బాలుడు . ఇంతటి పాండితీ ప్రతిభ ఈ బాలునిలో ఎలా కలిగింది . ఇప్పటికే నా సంహారకేళిలో స్వాహా అయిపోవాల్సిన వాడిని, ఆరగించాలనే ఆతురత నాలో కలగడంలేదు . అద్భుతమైన అక్షరాల అమృతంతో నా దాహాన్ని తగ్గించేశాడా ? నాకితనిపై వాత్సల్యం ఎలా కలుగుతుందా అని ఆశ్చర్యపోయింది అంబిక.
అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపామ్,
అణిమాది భి రావృతాం మయూఖైః అహమి త్యేవ విభావయే భవానీమ్.
ధ్యాయేత్ పద్మాసనాస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం,
హేమాభాం, పీతవస్త్రాం కరకలిత లసద్దేమ పద్మాం వరాంగీమ్.
మరో సారి అమ్మవారిని ధ్యానిస్తూ గర్భాలయంలో తనకి కనిపించిన అదే రూపాన్ని ధ్యానించారు ఆది శంకరులు . అమ్మ కరిగిపోయింది . ఆమెలోని తామసకాళి క్షణకాలం మళ్ళీ కామాక్షమ్మ అయ్యింది . కరుణతో నిలువెల్లా కరిగింది . శంకరా ! ఆర్తిగా పిలిచింది . అమ్మా అన్నారు శంకరులు . చిద్విలాసంగా చూస్తున్నారు పరమేశ్వరులు .
నాయనా! నీ స్తోత్రానికి , ఆ పాండిత్య ధారామృతానికి నాలో మాతృ ప్రేమ ఉప్పొంగుతోంది . నీకేదైనా వరం ఇవ్వాలని అనిపిస్తోంది. అడుగునాయనా ! అంది వాత్సల్యఅమృతాన్ని వర్షిస్తూ !!
శంకరాచార్యుల వారు మెల్లగా కళ్ళు తెరిచి చూశారు . కన్నుల ముందు సాక్షాత్కరించిన కామాక్షిని చూసి, ఆది శంకరులు పసి పిల్లవాడే అయ్యారు . ఆయనన్నారు ! అమ్మా నేను పసితనంలోనే సన్యశించాను. అందువల్ల ఆ వయసులోని అచ్చటా ముచ్చటా తీరలేదమ్మా ! అమ్మలగన్న అమ్మవైన నీతో పాచికలాడి ఆ ముచ్చట తీర్చుకోవాలి అనుకుంటున్నాను . నాతొ కాసేపు ఆడతావా అమ్మా ! అన్నారాయన ! పసివాడిగా మారిన ఆ జ్ఞానగనిని చూసి చాలించిందా తల్లి . సరేనయనా ! కానీ పందెం ఏం పెడతావు ? నేను పరమేశ్వరునితో అయినా పందెం లేకుండా ఆడను . ఆటలో ఎప్పుడూ ఓడిపోను . అందా తల్లి .
శంకరులన్నారు, “ అమ్మా ! నేను గెలిస్తే , నువ్వు నీ సంహార కేళిని ఆపేయాలి . నువ్వు గెలిస్తే, నన్ను ఫలహారంగా ఆరగించు . నన్ను నీకు స్వయంగా అర్పణ చేసుకుంటాను తల్లి . అన్నారు శంకరులు . సరేనన్నాడు దేవ్ . జగన్నాటక సూత్రధారి . సృష్టి స్థితిలయములని నడిపించే అంబిక, అలా తన స్థానంలో తిరిగి కూర్చొని ఆట మొదలెట్టింది. పాచికలు గళ్ళు మారుతున్నాయి . శంకరులు తొమ్మిదితో పందెం మొదలెట్టారు . అమ్మా ! నీతో ఆట ! నాభాగ్యం యేమని వర్ణించను తల్లీ ! నీ కరుణని యేమని గానం చేయను ? అమ్మా నీనామమే నాకు సదా శక్తి యై వర్ధిల్లుతుంది . కాబట్టి నీనామాన్నే జపిస్తూ , నీ ముందర కూర్చొని , నీతో ఆడాలని ఉందమ్మా ! అన్నారు . అమ్మ అనడంతో ఉబ్బి తబ్బిబ్బయ్యింది . ఒక బిడ్డ అలా అడిగితె కాదనగల తల్లి మనసు ఎక్కడుంటుంది చెప్పండి .
అలా రసవత్తరమైన ఆట, సంస్కృత సుధా ధార ఛందో బద్ధమై ఆ అపర శంకరుల నోట అలా వర్షిస్తుంటే, ఆ గానామృతానికి జ్ఞానస్వరూపిణి మధ్యలో తలపంకిస్తూ , ఎత్తుకి పైఎత్తు వేస్తూ ఆడుతోంది . పసుపు కుంకుమలు, పూవులూ ఉపయోగిస్తూ అమ్మని కొలుస్తూనే ఆట సాగించారు శంకరులు .
వేకువఝాము కావొస్తున్న సమయంలో ఆదిశంకరులు ఓడిపోయి అమ్మ గెలిచింది . చిన్న పిల్లల సంబురం అమ్మ మోములో కదలాడింది . శంకరా ! నాతో పందెం కాశావు . ఓడిపోయావు చూశావా ? ఇక నన్ను నా సంహార కేళికి తరలనీ! నువ్వు నాకు షణ్ముఖ సమానుడవయ్యావు . కాబట్టి నిన్ను నేను బలితీసుకోలేను . అడ్డు తొలగు అన్నది . ఎక్కడికమ్మా ! నేను పందెంలో ఓడిపోయాను . కానీ ఇక్కడ ఒక్కసారి చూడమ్మా ! నీలోని ఆ తామసశక్తిని, సత్వతేజోసంపన్నంగా చేశాను . నవావరణాలతో , దేవతా ప్రత్యధిదేవతా స్వరూపాలతో శ్రీచక్రాన్ని మంత్రయుక్తంగా ప్రతిష్ఠించాను . అమ్మవి , అది మాతవు , నీవే ఇలా తామస ప్రవృత్తితో నీ బిడ్డలని బలితీసుకుంటే, ఎవరమ్మా ! వారికి అండగా నిలబడతారు ? ఇక నీవు బయటికి వెళ్ళడానికి కుదరదు తల్లీ అన్నారు .
పరమేశ్వరుడు సాక్షిగా వచ్చారు . ఆయనన్నారు , అవునుదేవీ, నాలో సగభాగమైన నిన్ను, అవమానించడం ఇష్టంలేక , ఇన్నాళ్లూ నేను నీతో ఈ విషయాన్నీ గట్టిగా చెప్పలేకపోయాను . శంకరుడు నా అంశతో జన్మించినవాడు . అందుకే ఆటలో ఓడినా నిన్ను కట్టడి చేయడంలో గెలవగలిగాడు. దేవీ ఇకపై నీవు నీ భక్తులని అనుగ్రహిస్తూ , అనుగ్రస్వరూపంలో రాజరాజేశ్వరివై కతాశయాన్ని మాత్రమే వర్షించాలని చెప్పారు .
పరమేశ్వరుని మాటని అంగీకరించిన ఆ అమ్మ నిజంగానే కరుణాతరంగతాక్షిగా మారిపోయింది . ఆ కామాక్షి దర్శనానికి వచ్చేవారికి అప్పటి నుండీ అమ్మ కరుణారసపూర్ణమై అనుగ్రహాన్ని వర్షిస్తోంది .
అప్పుడు ఆచార్యులు ప్రతిష్టించిన శ్రీచక్రానికి ఇప్పటికీ పూజలు జరుగుతాయి. అమ్మవారిని ఈ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని శంకారాచార్యులు కోరటంతో అమ్మవారు ఉత్సవాల సమయంలో శంకరాచార్యులవారి అనుమతి తీసుకొని బయటకొస్తుంది.
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. అమ్మవారు యోగముద్రలో పద్మాసనంపై ఆశీనురాలై అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి క్రింది హస్తాలలో చెరకుగడ, తామర పుష్పం, చిలుక పై చెతులలో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటారు. ఇక్కడ అమ్మవారు శక్తినంతా గ్రహించి మన్మధునిలో ఆవహింప జేస్తుందని, ఇంకొక కథనం ప్రకారం అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి ఆసనంలో ఉండటం వలన సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద తన ప్రభావం చూపుతుందని అంటారు.
కాంచీపురానికి బస్సు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు.