Online Puja Services

నవనందులు- సర్వ పాపహరణాలు

18.224.54.61

నవనందులు- సర్వ పాపహరణాలు
-లక్ష్మీ రమణ 

చెంబెడు నీళ్ళు నెత్తిన పోసి , ఇన్ని మారేడు దళాలు పెట్టి , ఒక దోసెడు బూడిద అలిమితే సంతోషించే దేవుడు ఎవరుంటారు ? ఖర్చులేని పూజ . అనంతమైన అనంతుని సేవ . ఆయనకి అదే ఆనందం . భక్తునికి శివలోక సాయుజ్యం . ఆయన బోళా శంకరుడు . భక్తికి ఎప్పుడూ దాసానుదాసుడు . భక్తులకోసం ఎన్ని కష్టాలైనా పడతాడు . పెట్టిందే తింటాడు . నాకిదికావాలి , అదికావాలని అడగడు. పరమేశ్వరుడు పరమ దయాళువు . ఆ భక్తులకోసం దివి నుండీ భువికి ఎన్నో సార్లు దిగివచ్చాడు. అలా దిగి వచ్చి నిలిచిన క్షేత్రాలలో నిరుపమానమైన క్షేత్రం నంద్యాల . నంద్యాల చుట్టుపక్కల  నందీశ్వరుని పేరుమీదుగా వెలిసి , నవనందులనే పేరా కొలుపులందుకుంటున్న ఈశ్వరుని ఈ రోజు దర్శనం చేద్దాం . కార్తీకమాసంలో ఈ నవనందుల దర్శనం సకలపాప వినాశానంగా చెబుతారు . భక్తుని భావన భగవంతుని చేరినా , అది సరాసరి ఆయన దర్శనం చేసినట్టే కదా ! అలా ఆ స్వామీ మహత్యాన్ని చదువుతూ , రూపాన్ని భావన చేస్తూ నవనదులనూ దర్శిద్దాం. అయినా మనసుని మించిన దర్శని  , మనసుని మించిన వాహనం మరోటి ఏదైనా ఉన్నదా మనము ప్రయాణించి ఆ క్షేత్రానికి చేరుకోవడానికి   !
 
శివుని ప్రమథ గణాల్లో ముఖ్యుడు నందీశ్వరుడు. ఆయన పేరుమీదుగా వెలిసిన మహానంది ఆలయం తెలుగురాష్ట్రాల్లో సుప్రసిద్ధం. ఆ ఆలయానికి చుట్టుపక్కల మరో ఎనిమిది శివాలయాలున్నాయి. మహానందితో కలిపి ఈ ఆలయాలను నవనందులుగా పిలుస్తారు .మహానందిలో  కామేశ్వరీ సమేతుడై మహానందీశ్వరుడిగా వెలిశాడు శివయ్య. ఆలయం చుట్టుపక్కల కొలువుదీరిన నవనంది క్షేత్రాల్లో ఇది విశిష్టమైనది.

స్థలపురాణం:
ఆలయ స్థలపురాణం ప్రకారం, పూర్వం శిలాదుడు అనే పరమశివభక్తుడైన మహర్షి ఉండేవాడు. ఆయన సంతానం కోసం ఘోర తపస్సు చేసి శివసాక్షాత్కారం పొందాడు. తనకు జగత్ప్రసిద్ధులూ, అపర శివభక్తులైన ఇద్దరు కుమారుల్ని ఇమ్మని కోరాడు మహర్షి. అలా ఆయనకు పర్వతుడు, మహానందుడు అనే కుమారులు జన్మించారు. పర్వతుడు ఈశ్వర తపస్సు చేసి, శ్రీశైల పర్వతంగా మారాడు. నంది స్వరూపుడైన మహానందుడు వేల సంవత్సరాలు శివుడికోసం తపస్సు చేసి, సాక్షాత్కారం పొంది ఆయన పాదాల ఎదురుగా స్థిరనివాసం ఉండే వరాన్నిమ్మని కోరుకున్నాడు. అలా మహానంది ఆలయంలో అమ్మవారితో కలిసి వెలిశాడు పరమేశ్వరుడు. 

తర్వాత, కలియుగంలో నంద్యాలను పరిపాలించిన నంద మహారాజుకు సంబంధించిన ఆలమందలోని ఒక ఆవు సాయంత్రం పాలు ఇచ్చేది కాదట. అది గమనించిన కాపరి పాలు ఏమవుతున్నాయా అని తెలుసుకునేందుకు ఆవును వెంబడించాడు. ఆ ఆవు ఒక పుట్టమీద నిలబడటం, పాలధార పుట్టలోకి పడటం గమనించి, ఈ విషయాన్ని రాజుకు చేరవేశాడు. తరువాతి రోజు ఆవును వెంబడించిన రాజు పుట్ట లోపలినుంచి వస్తున్న దివ్యతేజస్సు ఎవరిదో చూద్దామని ఆవు దగ్గరగా వెళ్లడంతో అది బెదిరి పరిగెట్టబోతూ పుట్టను తొక్కింది. తర్వాత ఆ తేజస్సు అదృశ్యమైందట. దీనికి చింతిస్తూ ఇంటిదారి పట్టిన రాజుకి ఆ రాత్రి కలలో శివుడు కనిపించి పుట్టలో ఉన్నది తానేననీ, అక్కడి శివలింగాన్ని బయటకు తీసి పూజించమనీ చెప్పాడు. ఈ లింగాన్ని ఉపాసించిన తన భక్తుడు నందీశ్వరుడి పేరుమీదుగా ఈ ప్రాంతం మహానందిగా విరాజిల్లుతుందనీ, ముల్లోకాల్లో ఖ్యాతిగాంచిన తీర్థాలన్నీ ఇక్కడే కొలువై ఉన్నాయనీ పలికాడు. వివిధ సమయాల్లో తనను ప్రార్థించిన భక్తుల కోసం ఈ చుట్టుపక్కలేే మరో ఎనిమిది చోట్ల వెలిసినట్టు తెలిపి అక్కడా అర్చనలు ఏర్పాటు చేయమని ఆదేశించాడట. స్కంద పురాణంలోని శ్రీశైల ఖండంలో ఈ ఆలయ విశేషాలు దర్శనమిస్తాయి.

 మహానందిలోని శివలింగాన్ని ఆవు తొక్కినదానికి గుర్తుగా శివలింగం మీద గిట్టల అచ్చులు కనిపిస్తాయి. అందుకే ఇక్కడి శివుడ్ని గోపాదలింగేశ్వరుడిగానూ పిలుస్తారు. మహానందిలో రుద్ర, విష్ణు, బ్రహ్మ గుండాలుగా పిలిచే మూడు పుష్కరిణులు ఉంటాయి. గుడి అడుగుభాగం నుంచి నిరంతరం నీరు వీటిలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గుండాల నుంచి పారే నీరు చుట్టుపక్కల ఉన్న సుమారు రెండువేల ఎకరాల్లోని పంటలకు సాగునీరుగా ఉపయోగపడుతోంది. ఇక్కడి నీరు స్ఫటికమంత స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటుంది. గుండాల అడుగుభాగాన్నీ అందులోని చేపల్నీ కూడా భక్తులు స్పష్టంగా చూడొచ్చు. ఇందులోని నీరు చలికాలంలో వెచ్చగానూ, ఎండాకాలంలో చల్లగానూ ఉంటుంది. కరవొచ్చినా, వరదలొచ్చినా ఈ పుష్కరిణుల్లోని నీటి మట్టంలో హెచ్చుతగ్గులుండకపోవడం మరో విశేషం. వీటిలో స్నానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలూ నశించి, ఆరోగ్యం సంప్రాప్తిస్తుందన్నది పురాణోక్తి.

ప్రథమ నంది: 
నందుల్లో మొదటిది ప్రథమ నంది క్షేత్రం . ఇది శ్యామకాల్వ ఒడ్డున, నంద్యాల రైల్వే స్టేషన్ కు సమీపాన ఉంది. కార్తీక మాసంలో సూర్యాస్తమ సమయాల్లోనందీశ్వరుని మీద సూర్య కిరణాలు పడటం ఇక్కడ విశేషం. విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రథమ నందీశ్వరాలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. 

ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఈ ఆలయం సొంతం. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ దివ్యాలయానికి చేరుకోగానే అక్కడి ప్రశాంత వాతావరణం మైమరపిస్తుంది. గర్భాలయంలో ప్రథమ నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న కేదారేశ్వర లింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజమానమవుతున్న కేదారేశ్వర లింగ దర్శనం, కేదారనాథ్‌లో కేదారేశ్వర లింగ దర్శన ఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడే మరోపక్క కేదారేశ్వరి మాత కొలువుతీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం.

నాగ నంది:
నంద్యాల బస్ స్టాండ్ కు సమీపాన ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో నాగ నంది కొలువై ఉంటాడు. నాగులు గరుత్మంతుని ధాటికి తట్టుకోలేక ఇక్కడే శివుని కోసం తపస్సు చేశారని స్థల పురాణం .  కోదండ రామాలయంగా ఖ్యాతికెక్కిన ఈ ఆలయం కూడా అతి పురాతనమైనదే. ఈ ఆలయంలో ఉపాలయాలు చాలా ఉంటాయి . ఇక్కడి  భారీ ఆకారంలో ఉన్న ఆంజనేయస్వామి మూర్తి చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంది. విశాల శిల్ప మూర్తిగా ఉన్న ఈ ఆంజనేయస్వామి దర్శనం సర్వ మంగళకరం. ఆంజనేయస్వామి గర్భాలయానికి సమీపంలో ఉన్న చిన్న మండపంలో నాగ నందీశ్వరుడు కొలువుదీరాడు. 

సోమ నంది:
నంద్యాల పట్టణంలోనే ఆత్మకూరు బస్టాండుకు సమీపంలో ఉన్న మరో ఆలయం శ్రీ సోమ నందీశ్వరాలయం. ఇది జగజ్జనని ఆలయానికి సమీపంలో ఉంది. చంద్రుడు (సోముడు) ఈశ్వరుని కోసం ఇక్కడే తప్పసు చేసాడు. అలా స్వయంగా చంద్రుడు ఇక్కడ మహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడంవల్ల ఈ లింగానికి సోమ నందీశ్వర లింగమనే పేరొచ్చింది. ఈ ఆలయం ప్రాంగణం చిన్నదే అయినప్పటికీ ప్రాశస్త్యం రీత్యా ఇక్కడ స్వామివారి మహిమ గొప్పది. గర్భాలయంలో సోమ నందీశ్వరుడు దర్శనమిస్తాడు.

సూర్య నంది:
ప్రతిరోజూ సూర్యుడు తన కిరణాలతో మహాశివుణ్ణి అభిషేకించే దివ్యాలయం సూర్యనంది . 
నంద్యాలకు సుమారు 8 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రం . సూర్యనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవనందులలో విశేషమైనదిగా చెప్పబడింది . సూర్యుడు ఇక్కడ శివుడి గురించి తపస్సు చేసి ఆ స్వామి లింగాన్ని ప్రతిష్టించాడు. ఆ కారణంగా ఇది సూర్యనంది అయ్యింది. పూర్వకాలం నాటి ఆనవాళ్ళని ఇప్పటికీ ఇక్కడ మనం దర్శించవచ్చు .  భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయ జీర్ణోద్ధరణ చేశారు . ఈ ఆలయం యు.బొల్లవరం గ్రామానికి సమీపంలో తమ్మడపల్లె గ్రామంలో ఉంది. 

ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం నంద్యాలనుంచి మహానంది మార్గంలో ఏడు కిలోమీటర్లు ప్రయాణించి యు.బొల్లవరం గ్రామానికి చేరుకోవాలి. అక్కడనుంచి కుడి చేతివైపుగా కిలోమీటరు దూరం ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. తమ్మడపల్లె ఓ చిన్ని గ్రామం. ఇక్కడ ఉన్న సూర్య నందీశ్వరాలయంవల్ల ఈ గ్రామ ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. గర్భాలయంలో సూర్య నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్నశివయ్య చెంతనే పార్వతి మాత కొలువుదీరి ఉంది.

శివ నంది:
నంద్యాలకు సుమారు 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే శివనందీశ్వరాలయం. శివనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవ నందులలో విశిష్టమైన ప్రాస్త్యాన్ని పొందింది . ఈ ఆలయం బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం అక్కడనుంచి ఏదైనా వాహనంలో గాని, బస్సులో గాని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. 

ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి దృశ్యాలు ఆభరణాలుగా అలరారుతున్న ఈ ఆలయ శోభ అనన్య సామాన్యం. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోనో కట్టడాలన్నీ చాళుక్యుల కాలం నాటివిగా ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ శివనందిని ప్రతిష్టించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో శివనందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న మహాదేవ లింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజమానమవుతున్న పరమేశ్వర లింగ దర్శనం, అమోఘమైన పుణ్యఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ముఖ మండపంలో పార్వతి మాత, వీరభద్రస్వామిలను దర్శించుకోవచ్చు .

విష్ణు లేదా కృష్ణ నంది:
శివనందీశ్వరస్వామి ఆలయానికి మూడు కిలోమీటర్లు దూరంలో తెలుగు గంగ కాల్వకు సమీపంలో విష్ణు నందీశ్వరుడు కొలువుదీరాడు. దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. చుట్టూ నల్లమల అడవీ ప్రాంతం, కొండలు, గుట్టలు తో పచ్చని ప్రక్రుతి పరవశింప చేస్తుంది . 

విష్ణునంది లేక కృష్ణనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది . ఆ కారణంగానే ఈ క్షేత్రానికి విష్ణునంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో విష్ణునందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్య ఫలంగా భక్తులు భావిస్తారు. ఆధ్యాత్మిక పరిమళాలు పంచె ఈ దివ్యాలయం చుట్టూ పురాతన కాలంనాటి కోనేరు, నవగ్రహాలు, వినాయక, విష్ణు, లక్ష్మి మందిరాలున్నాయి. ఆలయానికి సమీపంలో సెలయేరు నిత్యం పారుతూ ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సెలయేటిలోనే స్నానాలు చేసి విష్ణునందీశ్వరుడ్ని దర్శించుకుంటారు.
 

గరుడ నంది:
సూర్య నందీశ్వరస్వామి ఆలయానికి సుమారు పది కిలోమీటర్లు దూరంలో మహానంది దివ్య క్షేత్ర నడిబొడ్డున గరుడ నందీశ్వరుడు కొలువుదీరాడు. మహానంది క్షేతానికి ప్రారంభంలో ఉన్న ఈ గరుడ నందీశ్వరాలయం అతి పురాతనమైనది. ఆ కారణంగా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీనిని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. గరుడ నందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు గరుత్మంతుడు ఇక్కడ మహాదేవుని గురించి తపస్సు చేసి, ఇక్కడో భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే ఈ నందికి గరుడ నంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో గరుడ నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.

మహానంది:
నవ నందులలో విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న క్షేత్రం మహానంది. ఇది కర్నూలు జిల్లాలో నంద్యాలకు 14 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఆహ్లాదకరమైన యాత్రా స్థలం. గుడి చుట్టు ప్రవహించే నీటి బుగ్గల చల్లదనం, చుట్టు అల్లుకున్న నల్లమల అరణ్యపు ప్రకృతి సౌందర్యం, అన్ని కాలాల్లోను భక్తులను ఆకర్షిస్తూనే ఉంటుంది. నందీశ్వరుడు  పరమశివుని దర్శనం కోరి ఘోర తపస్సు చేసిన స్థలమిదని స్థలపురాణం . ప్రత్యక్షమైన శంకరుడు నందిని వరం కోరుకొమ్మన్నాడు. సదాశివ ధ్యానమే తనకు కలుగునట్లు వరం కోరుకున్నాడు నంది. శివుడు అమితానందభరితుడై అతనిని తన వాహనంగా స్వీకరించాడు. ఎన్నో సిద్ధులను ప్రసాదించి తనంతటి వాణ్ణి చేసి, తన చెంతనే ఉండమన్నాడు. ‘‘సుయశ’’ అనే కాంతనిచ్చి వివాహం చేశాడు. తన ద్వారపాలకునిగా నియమించుకున్నాడు. ఈ విధంగా నందిని శంకరుడు అనుగ్రహించిన ప్రదేశమే మహానంది క్షేత్రం. ఇక్కడ ఉన్న ఈశ్వరుని నంది ప్రతిష్టించాడని, అందువల్లనే ఇది నందీశ్వరాలయమైందని స్థల పురాణం. ఈ క్షేత్రంలో వెలసిన మహానందీశ్వర స్వామి లింగం స్వయంభూలింగంగా ఖ్యాతికెక్కింది. గర్భాలయంలో ఉన్న శివలింగంపై భాగాన ఆవు పాదం ముద్రలు కనిపిస్తాయి. శ్రీ మహానందీశ్వర స్వామి రజత కవచాలంకృతుడై నయన మనోహరంగా దర్శనమిస్తారు. పార్వతీదేవి కామేశ్వరిగా కొలుపులందుకుంటోంది. 
ఇక్కడి కొలను లోని నీరు 5 అడుగుల మేర లోతు ఉంటుంది. నీరు స్వచ్చంగా ఉండి, వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. 

వినాయక నంది: 
 మహానందీశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ దివ్యాలయం లో పరమేశ్వర లింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్టించడానికి ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలో వినాయక నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ లంబోదరుడు ఈశ్వరుని గురించి తపమాచరించారని స్థల ఐతిహ్యం . నాగ ఫణాఫణి ఛత్రంగా ఇక్కడ స్వామివారు అలరారుతున్నారు. వినాయక నందీశ్వరస్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.

క్షేత్ర ప్రదక్షిణ: 
మహానంది క్షేత్రానికి చుట్టూ 16 కిలోమీటర్ల దూరంలో ఈ నవనందులు కొలువై యున్నాయి . ఈ క్షేత్రాలను దర్శిస్తే భూ ప్రదక్షిణ ఫలితం దక్కుతుందన్నది పురాణోక్తి. కార్తికమాసంలోని సోమవారం, పౌర్ణమి రోజుల్లో భక్తులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు కాలినడకన నవనందీశ్వరులనూ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. అలా వెళ్లే వారు నంద్యాలలోని భ్రమరాంబామల్లికార్జునస్వామి ఆలయంలోని సాక్షిగణపతిని దర్శించుకొని ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. నవ నందుల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi