Online Puja Services

వైతరిణీ నది ప్రవహించే చోటు గురించి తెలుసా ?

3.148.106.49

వైతరిణీ నది ప్రవహించే చోటు గురించి తెలుసా ?
-లక్ష్మీరమణ . 

నత్యజామికదాచిద్వైక్షేత్రంక్షేత్రజ్ఞకో_యథా
ఇదంగుహ్యతమంస్థానందేవానామపిదుర్లభం. 

స్కందపురాణం లో రుద్రనాథ్ గురించి వివరిస్తూ సాక్షాత్తూ పరమేశ్వరుడు , పార్వతీదేవితో అన్న మాటలివి . ఈ ప్రదేశాన్ని తాను ఎన్నటికీ వీడననీ, అత్యంతరహస్యమైన నా ఈ స్థానం దేవతలకు కూడా దుర్లభమనీ ఆయనే స్వయంగా పేర్కొన్నారు . ఇది పంచకేదార క్షేత్రాలలో మూడవది . కాగా మిగిలిన నాలుగు కల్పేశ్వర్ , కేదార్నాథ్ ,మధ్యమహేద్వార్ ,తుంగనాథ్ . సాధారణంగా జ్యోతిర్లింగం కూడా అయిన కేదార్నాథ్ యాత్రలో భాగంగా  రుద్రనాథుని దర్శిస్తుంటారు భక్తులు. 

కురుక్షేత్ర యుద్ధం ముగిసిన అనంతరం పాండవులు తమకు అంటిన బ్రహ్మహత్యా పాతకం, దాయాదులు, బందువులను చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానకి శివుడి దర్శనానికి వెళ్లారు. అయితే భోళాశంకరుడు పాండవులకు తన దర్శనభాగ్యం కల్పించడు. కాశీని వదిలి ఉత్తరదిశగా పయనించి హిమాలయాలకు చేరుకుంటారు శివుడు. పట్టువదలని పాండవులు, శివుడిని తన దర్శన నిమిత్తం వెంటాడతారు. నందిరూపంలో కనిపించిన శివుడిని పట్టుకోవడానికి భీముడు ప్రయత్నించగా, అప్పుడు ఈశ్వరుడు తన దర్శనాన్ని ఇవ్వకుండా ,  శరీర భాగాలు ఐదు చోట్ల పడేలా చేస్తారు . అవే పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. వీటినే శివ పురాణంలో పంచ కేదారాలుగా  అని అభివర్ణించారు. ఇవన్నీ కేదార్నాధ్ నుండీ వరుసగా దర్శించుకోవచ్చు . పదండి మనంకూడా దర్శనానికి వెళదాం . 

కేదార్నాథ్
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేదర్నాథ్ ఒకటి. పంచ కేదారాల్లో మొదటిది ఈ కేదార్నాథ్. పాండవులకు అందకుండా పోయిన పరమశివుడు నందిగా మారిన విషయం తెలిసిందే. ఆయన అయిదు భాగాలుగా విడిపోయినప్పుడు శివుడి మూపురభాగం ఉన్న చోటు కేదర్నాథ్ గామారిందని చెబుతారు. ఇక్కడి లింగం 8 గజముల పొడవు, 4 గజముల ఎత్తు, 4 గజముల వెడల్పు ఉంటుంది. లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు స్వర్గలోకానికి తమ అంతిమ దశ యాత్రను (స్వర్గావరోహణం) ఇక్కడి నుంచే ప్రారంభించారని పురాణాల కధనం. అంతేకాదు ఇది ఆదిగురువైన శంకరాచార్యులవారు మోక్షం పొందిన క్షేత్రం.

తుంగనాథ్
పంచ కేదారాల్లో రెండవ పుణ్యక్షేత్రమే తుంగనాథ్. శివుడి రెండు చేతులు పడిన ప్రాంతాన్ని తుంగానాథ్ అని అంటారు. శివుని చేతులు అడుగు ఎత్తులో లింగ రూపంలో వెలసిన క్షేత్రం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి. ఇది కేదర్నాథ్ కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. పాండవుల చిత్రాలు గోడపై చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడివైపు పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. ఈ పంచకేధార నమూనాలను అర్జునుడు నిర్మించారని స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది.

రుద్రనాథ్:
పంచ కేదరాల్లో మూడవ క్షేత్రమే రుద్రనాథ్. శివుని ముఖ భాగం వెలసిన పుణ్యక్షేత్రమే రుద్రానాథ్ అని భక్తులు విశ్వాసం. ఈ శివుడిని నీలకంఠ మహదేవ్‌ అని పిలుస్తారు. ఇక్కడ శివలింగం నంది ముఖ రూపంలో ఉంటుంది. తెల్లవారు జాము స్వామి వెండి తొడుగును తొలగిస్తారు. అందుకే భక్తులు ఎక్కువ స్వామి నిజరూప దర్శనానికి ప్రాధాన్యతనిస్తారు.   రుద్రనాథ్ మందిరానికి పక్కనే వనదుర్గ మందిరమున్నది. మందిరానికి వెనుక సరస్వతీకుండం ఉన్నది. అందులో స్నానం చేస్తే మూగవాడుకూడా కూడా వాక్పతి అవుతాడని వ్యాసవచనం. 

ఈ ఆలయానికి వెనుక వైతరిణీ నది ప్రవహిస్తుంది.ఇక్కడ పిండప్రదానం చేస్తే , గయాకోటిఫలం లభేత్ అని శృతి  వచనం . అందుకని  తమ పూర్వీకులకు మోక్షం కలిగించడానికి ఇక్కడ కి భక్తులు చాలా శ్రమతో చేరుకుంటారు . పంచకేదారాల్లో ఇది చాలా కష్టమైంది.  ఈ పుణ్యక్షేత్ర ప్రయాణం అంత సులువుకాదు . ఇక్కడికి 7 కి.మీ. దూరంలోని సగ్గర్ నుండీ గుర్రం పై ప్రయాణించడం ఉత్తమమైన మార్గమని చెప్తారు . 

 ఇది సముద్ర మట్టానికి 2286 మీటర్ల ఎత్తులో ఉంటుంది . ఇక్కడి నుండి మంచుతో కప్పబడిన హిమాలయ పర్వత శ్రేణులను చూడవచ్చు. ఈ దేవాలయాని వెళ్లే దారిలో హతి పర్వత, నంద దేవి, నంద ఘుంతి, త్రిశూల్ ప్రక్రుతి అందాలు మంత్రముగ్దులను చేస్తాయి. 

మధ్య మహేశ్వర్:
పంచ కేదారాల్లో నాల్గవది మధ్యమహేశ్వర్ పుణ్యక్షేత్రం. విశ్వనాథుడి నాభి భాగం పడిన ప్రాంతమే మధ్య మహేశ్వర్ అని చెబుతారు. ఈ ఆలయానికి ఎడమవైపు పార్వతీదేవి, అర్ధనారీశ్వరుని రెండు ఆలయాలు ఉన్నాయి. ఇది గుప్తకాశీకి 24 మైళ్ల దూరంలో ఉంది. దీన్ని భీముడు నిర్మించాడని అంటారు.ఈ ఆలయ దర్శనం వల్ల కుటుంబ సమస్యలన్నీ తొలిగిపోతాయని భక్తులు భావిస్తారు.

కల్పనాథ్
పంచ కేదారాల్లో చిట్టచివరిది కల్పనాథ్ పుణ్యక్షేత్రం. ఇక్కడ శివుడి ఝటాజూటం లింగ రూపంలో వెలిసాడిని స్థలపురాణం. దట్టమైన అడవుల మధ్య చిన్న గుహల్లో వెలిసిన ఈ స్వామిని ఝుటేశ్వర్ మహదేవ్ అని పిలుస్తారు. దుర్వాస మహర్షి ఈ ఆలయ ప్రాంగణంలోని కల్పవృక్షం కింద తపస్సు చేసి శివుని నుంచి అనేక వరాలు పొందాడని ప్రతీతి. 

జ్యోతిర్లింగాలు , పంచారామాలు శివాలయాలుగా సుప్రసిద్దాలు . ఈ ఆలయాలు కూడా వైభవోపేతంగా ఉంటాయి . కానీ పంచకేదారాల యాత్ర స్వర్గయాత్ర . ఈ ఆలయాలు చిన్న చిన్న గుహలుగా, హడావుడీ లేని ప్రాచీన మందిరాలుగా మనకి సాక్షాత్కరిస్తాయి. ఆ భస్మధారుని నిరాడంబరతని తమ అణువణువునా నింపుకున్నప్పటికీ , ఏంటో మహిమాన్వితమైన క్షేత్రాలివి . బ్రహ్మచర్యాన్ని విడిచిన వ్యక్తి గుహస్థాశ్రమాన్ని , ఆతర్వాత , వానప్రస్థాశ్రమాన్ని ఆతర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించి మోక్షాన్ని పొందాలి . ఇదే మన ధర్మం చెప్పే మాట . ఆ ధర్మాన్ని పాటించి, ఆశ్రమ ధర్మాలని అనుసరించి అంతిమంగా ఆ లయకారునిలో లీనమయ్యే మోక్షయాత్ర ఈ పంచకేదారాల యాత్ర . ఇది అనంతమైన పుణ్యాన్ని, అంతిమంగా ,మోక్షాన్ని అనుగ్రహించే యాత్ర . చేయగలిగిన వారికి ఇదొక మరపురాని ఆధ్యాత్మిక తృప్తి నిస్తుందనడంలో సందేహంలేదు .  

ఎలా చేరుకోవాలి :
వాయు మార్గం : డెహ్రాడూన్ లో గల జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ రుద్రనాథ్ కు సమీప ఎయిర్ పోర్ట్ రైలు మార్గం : రుద్రనాథ్ కు రిషికేష్ 
సమీప రైల్వే స్టేషన్ రోడ్డు / బస్సు మార్గం : రిషికేష్, డెహ్రాడూన్, కోట్ ద్వార, హరిద్వార ల నుండి బస్సులు కలవు.

Quote of the day

Love is an endless mystery, for it has nothing else to explain it.…

__________Rabindranath Tagore