Online Puja Services

ఈ గుడిలో చెప్పుల దండని సమర్పిస్తారు.

18.119.167.189

ఈ గుడిలో చెప్పుల దండని సమర్పిస్తారు. 
- లక్ష్మీరమణ 

వినడానికి వింతగా ఉన్నా , ఇదే సంప్రదాయం అంటారు  కర్ణాటకలోని ప్రజలు . పైగా పూలమాల కొనుక్కొని వెళ్లినట్టు, ఆగుడిలోకి చెప్పుల దండ తీసుకొని వెళతారు . ఆలయాల దగ్గర పూలమాలల షాపులున్నట్టు , అక్కడ చెప్పుల దండలమ్మే షాపులుంటాయి . ఆలయంలోకి ఇలా చెప్పుల దండ తీసుకొని వెళ్లడం వెనకాల కూడా వింతైన సంఘటన ఒకటి ఉందంటారు స్థానికులు . సామాజిక మాధ్యమాల్లో విచిత్రంగా కనిపిస్తున్న ఈ ఆలయ శైలి  గురించి అనేక కథనాలున్నాయి .   

కొన్ని దేవాలయాలలోని ఆచార వ్యవహారాలు తొలినాటి నుండీ వింతగా ఉండకపోవచ్చు .  కాలంతో పాటు వచ్చిన మార్పులు అందుకు కారణం కావొచ్చు . పురాతనమైన ఈ దేవాలయంలోని విశేషం కూడా   అటువంటిదే ! పూలు పండ్లు, కొబ్బరికాయలు అర్పించడానికి బదులుగా ఇలా చెప్పులదండని గుడిలోకి తీసుకువెళ్లే సంప్రదాయం పాటిస్తున్న ఆలయం కర్ణాటకలో ఉంది . ఇక్కడి దేవత లక్కమ్మ . 
 
కర్నాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లాలోని అలంద్ తాలుకాలోని గోలబి గ్రామంలో లక్కమ్మ వారి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన ఐదు రోజులకు అంటే పంచమి రోజున, అలాగే కార్తీక పౌర్ణమి వేళ రెండ్రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలోనే కొత్త పాదరక్షలను కట్టే సంప్రదాయం ఉంది. ఈ గుడి ముందు చెప్పులు కట్టడమే ఈ జాతర ప్రత్యేకత.

ఈ సంప్రదాయం ఇలా మొదలయ్యిందట :
ప్రతి ఏటా జాతర సమయంలో ఈ గుడికి వచ్చే భక్తులందరూ తమ కోరికలను నెరవేరాలని గుడి ముందు పాదరక్షలను కట్టేవారు. ఒకప్పుడు ఈ ఆలయంలో ఎద్దులను బలి ఇచ్చే సంప్రదాయం ఉండేదని స్థానికులు చెబుతారు. అయితే ఇది ప్రభుత్వం చట్ట విరుద్ధమని చెప్పి పూర్తిగా రద్దు చేసింది. ఈ సమయంలో అమ్మవారికి కోపం వచ్చిందని, అప్పుడు లక్కమ్మ దేవిని శాంతపరిచేందుకు ఓ మహర్షి తపస్సు చేశాడు. ఆ తర్వాత జంతు  బలికి బదులుగా చెప్పులను సమర్పించాడు. దీంతో అమ్మవారి కోపం తగ్గిందని, అప్పటి నుంచి ఈ గుడిలో చెప్పులు సమర్పించే సంప్రదాయం ప్రారంభమైందని చాలా మంది నమ్ముతారు.

ఆలయ చరిత్ర:
కర్నాటకలోని ఈ ఆలయం చాలా పురాతనమైనది. తమ కోరికలు నెరవేరిన వారు ఆలయం వెలుపల ఉన్న చెట్టుకు చెప్పులను వేలాడదీస్తారు. అలాగే శాకాహారం, మాంసాహారం రెండింటినీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా లక్కమ్మ దేవికి చెప్పులు సమర్పించడం వల్ల దుష్టశక్తులన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు పాదాలు, మోకాళ్ల నొప్పితో బాధపడేవారికి కూడా పూర్తిగా నయమవుతుందని చాలా మంది విశ్వాసం. 

ఉద్దేశ్యం మంచిదయితేనే అమ్మ కటాక్షం :
అయితే ఈ అమ్మవారు ఇతరులకి  హాని తలపెట్టే వారిని, అలా ఆలోచించే వారిని అస్సలు క్షమించదని స్థానికులు చెబుతారు. ఈ దేవాలయానికి కర్నాటక, మహారాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు.

#lakkamma temple, #chappal

Tags: lakkamma temple, chappal, garland, golabi, 

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya