Online Puja Services

సర్వ శ్రేష్ఠంగా పేరొందిన క్షేత్రం -కాళేశ్వరం

3.145.115.139

పితృకార్యాలకు, గ్రహ దోషనివారణ పూజలకు సర్వ  శ్రేష్ఠంగా  పేరొందిన క్షేత్రం -కాళేశ్వరం 
-లక్ష్మీ రమణ 

అడవి శిగలో అనంత జల సిరి. అందాల కోనలో ఆధ్యాత్మిక పెన్నిధి! కాలకాలుని కరుణా కటాక్షాల తరగని నిది , సాక్షాత్తూ సమవర్తి కొలువైన ధర్మపురి! అద్భుత లీలా వైచిత్రికి నెలవైన నేలిది. సంగమ స్థలిలో  నెలవైన ముక్తీశ్వర  సన్నిధి !నాలుగు ముక్కల్లో చెప్పాలంటే, కాళేశ్వర క్షేత్ర వైభవం ఇది .  

పవిత్ర త్రివేణీ సంగమ స్థలిలో పరమేస్వరుడు కొలువుదీరిన క్షేత్రం కాళేశ్వరం. లయకారుని లయవిన్యాసానికి ప్రతీకగా విరాజిల్లుతున్న  మహా పుణ్య క్షేత్రం.  బోళా శంకరుని అనంత కృపాకటాక్షాలకు నెలవైన దివ్యప్రదేశం . ఇంకెదుకాలస్యం , రండి ఆ లయకారుని దర్శనం చేసుకుందాం . 

గౌతమీ తీరంలోని కాళేశ్వర ముక్తీశ్వరుని సన్నిధానం, సమవర్తి సహితంగా కొలువైన శంకర క్షేత్రం.   పితృకార్యాలకు, గ్రహ దోషనివారణ పూజలకు సర్వ  శ్రేష్ఠంగా  పేరొందిన ప్రాంతం . మన తెలుగు నేలపైన విరాజిల్లుతున్న శైవక్షేత్రాలలో శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి, కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం లు ప్రసిద్ధిగాంచినవి. ఈ మూడు క్షేత్రాల కారణంగానే పూర్వం ఈ నేలను త్రిలింగ దేశం అని  పిలిచేవారు. వీటిలో త్రివేణీ సంగమ తీరాన కొలువైన కాళేశ్వర క్షేత్రం అనేక ప్రత్యేకతలకు నెలవై  తెలంగాణా నేలపై ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతోంది . ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీ క్షేత్రంగా ఈ పుణ్యస్థలి  ప్రసిద్ధిచెందింది . ఏటా ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకోవడానికి కొన్ని వందలమంది భక్తులు వస్తారని అంచనా . 

సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో మహా పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం కాళేశ్వరం. ఇది కరీంనగర్‌ జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతమైన గోదావరి నది ఒడ్డున నెలకొని ఉంది. గోదావరి తీరాన ఒకవైపు కాళేశ్వరం, మరో వైపు మహారాష్ట్ర ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని మహాదేవపూర్‌ మండలానికి 16 కి.మీ దూరాన, మహారాష్ట్ర సరిహద్దున సిరోంచ తాలూకాకు 4 కి.మీ దూరాన కాళేశ్వరం ఉంది. అతిప్రాచీన చరిత్ర గల కాళేశ్వరక్షేత్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి. 

త్రివేణి సంగమ స్థలి :

గోదారమ్మ నీటిమువ్వలు  సప్తరాగాలనూ ఆలపించే దివ్యనాదం వినాలంటే ఆ ముక్తీశ్వరుని సన్నిధానానికి చేరవలసిందే. అనంతలోకాలను చేరుకున్న పితృదేవతలకు పుణ్యలోకాలు ప్రాప్తించేలా సంతృప్తిగా పూజించుకోవాలంటే ఈ త్రివేణీ సంగమ స్థలమే సర్వ శ్రేష్టం . పుష్కర జలాలతో విలసిల్లే ఇక్కడి గంగమ్మ సాక్షాత్తూ ఆ శివగంగేనని భక్తుల విశ్వాసం . 

  ఇక్కడి గోదావరి జల సిరులు ఆదిదేవునికి నిత్యాభిషేకాలు చేస్తుంటాయి. ఇక్కడి గోదారి గంగమ్మ సంగమ క్షేత్రంగా కూడా విలసిల్లుతోంది. ఇక్కడి గౌతమిలో అంతర్వాహినిగా సరస్వతీనది, ప్రాణహిత నదులు సంగమిస్తున్నాయి. భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించడంతోపాటుగా  వైదిక కార్యాలు నిర్వహిస్తుంటారు. త్రివేణి సంగమ స్థలి కావడం వల్ల  శ్రీకాళేశ్వరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరినదికి, బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రాణహితనదికి పుష్కరాలు వస్తాయి. సరస్వతి అంతర్వాహినిగా ఉండడం వల్ల సరస్వతి నది పుష్కరాలకు కూడా తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల  నుంచి భక్తులు ఈ పుణ్య తీర్ధానికి అధిక సంఖ్యలో తరలివస్తారు.  

పితృదేవతలకు  పిండ ప్రదానం:

కాళేశ్వర క్షేత్రం పితృదేవతలకు  పిండ ప్రదానం చేసేందుకు విశిష్టమైన క్షేత్రం.  కాశికి వెల్లలేని వాళ్ళు కాళేశ్వరం లోని  గోదావరి-ప్రాణహిత-సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఇక్కడ చేసే ఈ కార్యక్రమాలు  కాశిలో జరిపించినంత  పుణ్యాన్ని ప్రాప్తింప చేస్తాయని చెప్తారు. విశేషించి పితరులకు తర్పణాలు వదలడం, శ్రార్ధ కర్మ నిర్వర్తించడం ఇక్కడికి వచ్చే భక్తులు తప్పక ఆచరిస్తుంటారు. అందుకే ఇక్కడి అంగళ్లలో  వీటికి అవసరమైన నువ్వులు, ఇతర దినుసులు విరివిగా లభ్యమవుతుంటాయి.ఇక శ్రీ కాళహస్తి తరువాత కాలసర్ప, శనిదోష నివారణ పూజలకు కాళేశ్వర క్షేత్రం ప్రసిద్ధి పొందింది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో కాలసర్పదోష నివారణ పూజలు, నవగ్రహాలయంలో శనిదోష నివారణకు శనిపూజలను నిర్వహిస్తున్నారు.   

ఇక విశాలమైన గోదారమ్మ నీటి తరగాలపైన నౌకా విహారాన్ని ఆస్వాదించాలనుకుంటే , అటువంటి సౌకర్యాలూ ఈ క్షేత్రంలో ఉన్నాయి. ఈ పరమేశ్వరుని సన్నిధికి సంగమ స్థలిలోని పవిత్రత , ప్రకృతి పంచె పారవశ్యత తోడై  ఒక అలౌకిక ఆనందాన్ని పరిచయం చేస్తాయి 

ముక్తినొసగే ముక్కంటి:

కాళేశ్వరంలోని ముక్తీశ్వరుడు నిత్యగాంగాభిషేక ప్రియుడు. విశేషించి కాలుడితో తన పానవట్టాన్ని పంచుకున్న లింగస్వరూపుడు. అపూర్వ వైచిత్రితో నిండిన ఇక్కడి ప్రధాన వేలుపు కొలిచినవారికి కొంగు బంగారమని, మొక్కిన వారికి ముక్తినొసగే ముక్కంటి రూపమని ఐతిహ్యం. ఈ నగరాన్ని యముని విన్నపం మేరకు విశ్వకర్మ గోదావరి, ప్రాణహిత నదుల సంగమానికి దక్షిణ దిశగా ఒక పట్టణాన్ని నిర్మించాడని, కాలుని (యముని) కోసం నిర్మితమైన పట్టణంలో ఈశ్వరుడు వెలిసినందున ఈ క్షేత్రానికి కాళేశ్వరం అని పేరు వచ్చిందని కాళేశ్వర ఖండంలో పేర్కొన్నారు.

 ఈ  రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు:

కాళేశ్వర ముక్తీస్వరం అనే పేరిట విరాజిల్లుతున్న ఈ పుణ్య క్షేత్రంలో ఒకే పానవట్టం పైన శివలింగం , యమలింగం కొలువై ఉండడం విశేషం.  ఒకటి శివ స్వరూపమైన ముక్తీశ్వరలింగం. కాగా రెండవది యమ స్వరూపమైన కాళేశ్వరలింగం. ముక్తీశ్వరునికి రెండు నాశికారంధ్రాలుంటాయి . ఈ  రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణి సంగమతీరంలో ఆ నీరు కలుస్తుందని స్థానిక కథనం. ఈ క్షేత్రం ప్రాశస్త్యాన్ని  గురించి స్కాందపురాణం, గౌతమీపురాణంలో కూడా పేర్కొన్నారు. అయితే ఈ ఆలయంలో తొలిపూజలు మాత్రం  కాళేశ్వరునికె. కాలుని పూజల తర్వాతే లయకారుని అర్చించాలని, అప్పుడే  స్వర్గలోక ప్రాప్తి సిద్ధిస్తుందని శృతి కధనం . 

విశ్వకర్మ నిర్మితం :

కాళేశ్వర పట్టణాన్ని యమధర్మరాజు కోసం విశ్వకర్మ నిర్మించాడని, తర్వాత అక్కడ శివుడు వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. తదనంతరం కాకతీయులు ఆలయ జీర్ణోద్ధారణ గావించారు. ఆ తర్వాత ఔరంగజేబు దండయాత్ర ఫలితంగా ధ్వంసమైంది. 1976-82 మధ్యలో నాటి దేవాదాయశాఖ మంత్రి జువ్వాడి చొక్కారావు నూతన ఆలయాలను నిర్మించినట్లు ఇక్కడి శాసనాధారాల ద్వారా తెలుస్తున్నది.

విచిత్రం ఈ తత్త్వం : 

అర్ధనారీశ్వరుడైన పరమేశ్వరుడు ఇక్కడ తన సరసన అమ్మను కాక కాలుణ్ణి పరివేష్టింప జేయడం విత్రంగా అనిపించడం సహజమే. ప్రపంచంలోనే మరెక్కడా కానరాని ఈ అపూర్వ పుణ్య తీర్థంలోని వైచిత్రికి కారణమైన కథ చాలా ఆశక్తికరంగా ఉంటుంది . ఒకప్పుడు యమధర్మరాజుకి నరకానికి వచ్చే నరులే లేకుండా పోయారట . కారణమెంటా  అని విచారించిన కాలుడికి  జనమంతా కాళేశ్వరంలోని ముక్తీశ్వరుడికి పూజలు చేసి సర్వపాపాలను హరింపజేసుకొని స్వర్గలోకానికి పోవడమే కారణమని అర్థమయింది.  తనను తలుచుకొని పనిలేకుండా చేశాడని భావించిన సమవర్తి ,పరమశివుడి కోసం తపస్సు చేశాడని , శివుడు ప్రత్యక్షమై తన పక్కనే లింగమై పూజలందుకునే వరం ఇచ్చాడని చెబుతారు. శివలింగాలన్నీ ఒకటే కదా యని మాయామోహగ్రస్తులైన ప్రజలు ముందుగా కాళేశ్వరుని పూజింపక, ముక్తీశ్వరుని పూజింతురో వారందరు నీ లోకమునకు వచ్చెదరని” వరప్రదానం చేశాడు . దీంతో  తొలుత కాలుడిని, అనంతరం లయకారుణ్ణి  పూజించే సంప్రదాయం ఆరంభమయ్యింది.  ఇలా పూజలు ఆచరించిన వారు సర్వపాపాలను హరింపజేసుకొని ముక్తిని పొందుతారని విశ్వాసం.

యమకోణం:

స్థల పురాణానికి బలం చేకూరుస్తూ ఆలయంలో యముడు తపమాచరించిన యమకోణం ఉంది. ఈ యమకోణం నుండి వెళితే ఇక యమపురి దర్శనం ఉండదని స్థల పురాణం. యమునికి ఈ క్షేత్రంలో గండ దీపాలు వెలిగిస్తారు. దీనివల్ల గండాలు గట్టెక్కి, అపమృత్యువు దరిచేరదని విశ్వాసం. ఇక్కడ యమగుండం కూడా ఉంటుంది . యముని కోరిక మేరకు విశ్వకర్మ ఈ యమగుండంను నిర్మించాడని , ఇందులో  స్నానమాచరించినవారికి మణికర్ణికా ఘట్టములో స్నానమాచరించిన ఫలితం కలుగుతుందని శివుడు వరమిచ్చాడని చెబుతారు. దీంతో రెండవ మణికర్ణికగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది 

అమ్మవారు శుభానందాదేవి:

నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లె ముక్తీస్వరుని కళ్యాణ మండపం శోభాయమానంగా ఉంటుంది .  ఇక్కడి అమ్మవారు శుభానందాదేవి. పేరుకు తగినట్టు సర్వమంగళకారిణిగా, శాంతస్వరూపిణిగా దర్శనమిస్తుంది.  శుభానందాదేవి , ముక్తీశ్వరరులు అలోకికమైన ఆధ్యాత్మిక ఫల ప్రాప్తినిచ్చే ఆదిదంపతులుగా ఇక్కడ విరాజిల్లుతున్నారు . 

ఉపాలయాలు:

ప్రధానాలయంలోని విశేషతలే అద్భుతం అనుకుంటే, ఆలయంలోని , ఉపాలయాలు పరిసర ప్రాంతాలలోని పుణ్య ప్రదేశాలలు మరింత విశేషంగా ఉంది విశ్వకర్మ వినిర్మితమైన ప్రాంతమిది అని నిరూపిస్తున్నట్టే ఉంటాయి. కాళేశ్వర క్షేత్ర దర్శనం ఖచ్చితంగా ఒక అద్భుతమైన దివ్యదేశ సందర్శనాన్ని తలపించక మానదు. 

గౌతమీ తీరంలోని కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్ర వైభవం యెంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశాలోనే ప్రసిద్ధమైన మూడు సరస్వతీ దేవాలయాలలో ఒకటి కాళేశ్వర క్షేత్రంలోనే ఉన్నది. ఇక్కడి ఇక్కడి ఉపాలయాలలో ఒకటైన శారదాదేవి ఆలయంలో అమ్మ ప్రౌఢ సరస్వతిగా పూజలందుకొంటోంది. కోదండరాముడు ఈ శైవ క్షేత్రంలో క్షేత్రపాలకుడై విరాజిల్లుతున్నాడు.ఇవికాక  ఆది ముక్తీశ్వర స్వామి, సంగమేశ్వర, దత్తాత్రేయ , సూర్యదేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 

ఆదిముక్తేశ్వర:

కాళేశ్వర క్షేత్రంలో ఆకుపచ్చటి చీరకట్టిన ప్రకృతి కాంత ముక్తీస్వరుకి సకల ఉపచారాలు నిర్వహిస్తుంటుంది. ఆయనకు తపోభంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకొంటుంది. కాలేస్వరానికి ఒక కిలో మీటరు దూరంలో ఆదిముక్తేశ్వర స్వామీ కొలువయ్యాడు. ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో ఎక్కడ  త్రవ్వినా  ఎర్రని రంగు గల మట్టిరాళ్లు దొరుకుతాయి. ఈ రాళ్ళను పగులగొడితే దానిలో పరిమళ భరితమైన మెత్తని భస్మము ఉంటుంది. ఎర్రగా ఉండే ఈ విభూతిని ధరించిన వారు యోగీశ్వరులు  పొందిన ఫలమును, నిత్యాగ్ని హోత్రం చేసిన ఫలితాన్ని  పొందుతారని స్తానిక విశ్వాసం . 

పుష్కరాలు:

ఇలా సర్వ దేవతా సన్నిధానంగా, దక్షిణ కైలాసంగా విలసిల్లుతున్న కాళేశ్వరానికి పుష్కరాలు 12 సంవత్సరాలలో 3 సార్లు వస్తాయి. గోదావరి తో పాటు సరస్వతి, ప్రాణహితలకు వచ్చే పుష్కరాలు ఈ త్రివేణీ సంగమంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. 
మహిమొపేతమైన కాళేశ్వర ముక్తీస్వరుని దర్శించుకొని ఎల్లరూ తరించగలరని ఆసిస్తూ ... శలవు.

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi