దేవాలయం లో భక్తుల ప్రవర్తన ఎలా ఉండాలి?
దేవాలయంలో భక్తుని ప్రవర్తన ఇలా ఉండాలని భృగుమహర్షి చెప్పారు .
-లక్ష్మీ రమణ
వైకుంఠానికి స్వయంగా వెళ్లి , అక్కడ నారాయణుడిని దర్శించగలిగిన తపోనిష్ఠా గరిష్ఠులు భృగు మహర్షి . కానీ , అహంకారం అనేది తాపసులనైనా , క్షణకాలం తమని తాము మరచిపోయి ప్రవర్తించేవారిగా , తామస ప్రవృతి గలవారుగా మార్చేస్తుంది . లక్ష్మీ మాతతో మాట్లాడుతున్న దేవదేవుడు తన్నాదరించలేదని , ఆ మహా విష్ణువునే కాలితో తన్నారు భృగువు . అంతటి అపచారం చేసినా చిరునవ్వుతోనే పాదపూజ చేసి, భృగు పాదంలో ఉన్న కంటిని దునిమి ఆయన గర్వాన్ని అణిచేశారా స్థితికారకులు . అందుకే, భృగువు దైవదర్శనానికి వెళ్లేప్పుడు ఎలా ఉండాలి, దేవాలయంలో ఎలా నడుచుకోవాలి, ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పేందుకు సరైన వ్యక్తి .
జ్ఞానబాండాగారం వంటి ఆయన, శ్రీవైఖానస భృగుసంహిత గ్రంథాలలో, భక్తులు దేవాలయంలో నడచుకోవలసిన నియమాలు వివరంగా తెలియజేశారు. వీటిలో ఆలయానికి వచ్చిన భక్తుని ప్రవర్తన, ఆలయంలో పాటించవలసిన అనేకములైన విధులు, నిషేధములు భృగుమహర్షులవారు వివరంగా చెప్పారు .
ఇవన్నీ పురుషపరంగా ఉన్నప్పటికీ, స్త్రీ పురుషులిరువురికి ఈ నియమాలు సమంగా వర్తిస్తాయి. వీటిని విధిగా ఆచరిస్తే, శ్రీవారి పరిపూర్ణకృపకు పాత్రులవుతారనే విషయంలో ఎటువంటి సందేహం లేదంటుంది భృగు సంహిత.
ఆలయంలోపల యానం (వాహనం - చక్రాలతో, యంత్రాలతో నడిచేది) మీద కాని, పాదరక్షలతోకాని ప్రవేశింపరాదు, తిరుగరాదు.
మెల్లగా ప్రదక్షిణచేసిన తర్వాత ఆలయంలోనికి ప్రవేశించాలి. విమానం (గర్భగుడి గోపురం) సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు స్వరూపం. కాబట్టి ఆ శిఖరాదులనీడలను పాదాలతో తొక్కకూడదు .
ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప, ఇంకెప్పుడూ దేవాలయం ధ్వజస్తంభం నీడనుకాని, విమానం నీడనుకాని, మహాద్వారరాజగోపుర ఛాయనుకాని, ప్రాకారం నీడనుకాని దాటకూడదు.
యజ్ఞోపవీతము (జందెము) ఉన్నవారు నడుముకి చుట్టుకుని కాని, చెవికి తగిలించుకుని కాని, అపసవ్యంగా వేసుకుని లేదా దండవలె ధరించిగాని ఆలయప్రవేశం చేయరాదు.
గోచీ లేకుండా ధోవతిని కట్టుకోరాదు. నగ్నంగా గానీ, కౌపీనం మాత్రమే ధరించికాని ఆలయంలోనికి ప్రవేశించరాదు.సంప్రదాయ వస్త్రధారణలో ఆలయాన్ని దర్శించడం మేలు .
మనోహరాకారుడైన విష్ణువును దర్శించుకోవడానికి ఆలయంలో ప్రవేశించేముందు ఉపవీతమును సవ్యంగా ధరించి, సదాశుచియై మంచి ఉత్తరీయం ధరించి ఆ దేవదేవుని దర్శించాలి. తలపాగా, టోపిధరించి కాని, చేతిలో ఆయుధం పట్టుకుని హరిని దర్శించుకోరాదు. వస్త్రంతోకాని (ఉత్తరీయం), శాలువాతో కాని శరీరం కప్పుకోవాలి.
రిక్తహస్తుడుగా కాని (చేతిలో భగవంతుడికి సమర్పించటానికి ఏదీ లేకుండా), తిలకం ధరించకుండా కానీ, ఉత్తరీయం లేకుండా కానీ, తాంబూలం నములుతూ కాని, తినుబండారాలు తింటూకానీ, పానీయసేవనం చేస్తూకానీ దేవాలయం లోనికి ప్రవేశింపరాదు. అట్లా ప్రవేశిస్తే పాపం చుట్టుకుంటుంది.
దేవాలయంలో శ్రీవారి ప్రసాదం తిని, మిగిలిన దానిని అక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోయినా, లేదా ప్రసాదం తినకుండా పారవేసినా, వద్దన్నా అలాంటి మూర్ఖులు, విపత్తుల పాలవుతారు.
దేవాలయంలో కాళ్ళు బార్లా చాపి కూర్చోరాదు. దేవాలయంలో ప్రవేశించి భక్తితో రోదించకూడదు. రోదిస్తూ దేవుని స్తుతించకూడదు. అలాచేస్తే అతని మనస్సు మలినమైనదని చెప్పవచ్చు. పరమపద మోక్షసాధనకు సులభమైన మార్గాన్ని చూపే హరి ఉన్న ఆలయంలో మలినమైన మనస్సుతో హరిని సేవించే వ్యక్తికి, విష్ణువు యొక్క పరమపద విశిష్టత తెలియదన్నమాటే! ఇది వైకుంఠానికి వచ్చినా (మోక్షాన్ని పొందినా ) తన ఇంటిని (భూలోకంలో ఉన్నఇంటిని - బంధాన్ని ) విడిచి పెట్టివచ్చానే అని భావించిన దానితో సమానం!
విష్ణువుఆలయంలో ప్రవేశించి వ్యర్థ సంభాషణలు చేసే వ్యక్తి ఎదుట సిద్ధంగా ఉన్న నవనిధులను విడిచి పెట్టీ, గవ్వలకోసం భిక్షమెత్తేవాడితో సమానం. అమృతాన్ని విడిచిపెట్టి, అన్నం కోసం భిక్షం అడిగేవానితో సమానం. ఆలయంలో కొన్ని క్షణాలప్పాటైనా పరమాత్మను గురించి ధ్యానం చేయకపోవటం హానికరం. అది మహాప్రమాదం, భ్రాంతికరం. (అనవసరంగా మాట్లాడడానికి అనేక ప్రదేశాలు, అనేక సమయాలు విశేషంగా ఉండనే ఉన్నవి.) అందుచేత శ్రీహరి ఆలయంలో ప్రవేశించే మహద్భాగ్యం పొందిన వ్యక్తి, ఇతర ఆలోచనలు విడిచి పెట్టి, అమూల్యమైన ఆ సమయంలో హరిని మాత్రమే చింతిస్తూ, హరినామస్మరణ చేయాలి.
దేవాలయంలో అనర్థ ప్రసంగాలు చేసే వ్యక్తి ఐదు జన్మల వరకు తిత్తిరి పక్షిగా జన్మిస్తాడు.
దేవాలయంలో, హరి సన్నిధి యందు, ఎన్నడూ వివాదములు పెట్టుకోరాదు. వివాదములకు అది స్థానం కాదు. ఎట్టి పరిస్థితులలోను హరి సమక్షంలో వివాదాల జోలికి వెళ్ళకూడదు.
దేవాలయంలో అహంకారంతో తనను తానే పొగడుకునే వ్యక్తి, దేవుడిని, పెద్దలను లెక్కచేయకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడే వ్యక్తి, గర్వించినవాడై, తనకు సంక్రమించే మహత్తరమైన దోషాన్ని గుర్తించలేడు.
తాను ఎంతటి స్థితిలో వున్నప్పటికీ, దేవాలయంలో తనకంటే పెద్దవారిని “నీవు” అని ఏకవచనంతో సంబోధించరాదు. ఆలయంలో దేవుని ఎదుట, ఇతరులను దూషించటం లేదా పొగడటం ఎట్టి పరిస్థితులలోను చేయరాదు. శ్రీవారిఆశీస్సులు, అనుగ్రహం కోరే వ్యక్తి ఆలయంలో ఇతరులను పొగడటం, పూజించటం చేయకూడదు.
దేవాలయంలో దేవునికి వీపు భాగం చూపిస్తూ కూర్చోరాదు. భక్తుడు అన్ని వేళల్లో దేవునికి అభిముఖుడై ఉండాలి. భగవదాశీస్సులు కోరే వ్యక్తి దేవునికి వీపు చూపరాదు, ఒక ప్రక్కగా తిరిగి మాత్రమే ఆలయం నుంచి నిష్మమించాలి.
చివరి అర్చన జరిగిన తర్వాత ఆలయ ద్వారాలు మూసివేయ బడతాయి . మరల ప్రత్యూష కాలంలో ద్వారాలు తెరువబడతాయి. ఈ మధ్య కాలంలో (అకాలంలో) హరిని సేవించరాదు. భక్తులు స్వామివారి సేవలలో పాల్గొనేటప్పుడు కూడా అకాలములు చాలా ఉంటాయి. ఆ సమయాలలో తెరవెనుక స్వామికి కొన్ని సేవలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో తెర తీసి చూడాలని ఆసక్తి కనపరచడం, చూడటం చాల తప్పు. కావున భక్తులు అలాంటి అకాలదర్శనాలు చేసుకోరాదు.
భగవంతుడిని , పెద్దవారినీ దర్శించుకోవడానికి వెళ్లేప్పుడు ఏ విధంగా ఉండాలని మన సంస్కృతీ - సంప్రదాయం చెబుతుందో ఆ విషయాలు మనకి భృగు సంహిత ప్రామాణికంగానే వచ్చి ఉండవచ్చు . అందుకనే ఈ సంప్రదాయాన్ని మనం ఆచరించడమే కాకుండా, మన తర్వాతి తరాలవారు కూడా ఆచరించేలా చేద్దాం . మన ధర్మాన్ని , మన సంప్రదాయాన్ని కాపాడుకుందాం . నమస్కారం .