ఎలుగుబంట్లు దర్శనంచేసుకొనే చండీదేవాలయం !
ఎలుగుబంట్లు దర్శనంచేసుకొనే చండీదేవాలయం !
- లక్ష్మి రమణ
చత్తీస ఘడ్ రాష్ట్రం బస్తర్ ఎన్నో ప్రక్రుతి అందాలకు, చారిత్రాత్మక విశేషాలకు నెలవు. నింగినుంచి జాలువారుతున్నాయా అనిపించే జలపాతాలు ,చారిత్రాత్మక ప్రదేశాలకు నిలయం చత్తీస్‌ఘడ్ అటవీ ప్రాంతం. ఇక్కడి ప్రకృతి అమ్మదర్శనానికి క్రూరమృగాలైనా అర్హులే . జగజ్జననికి అవి కూడా బిడ్డలేనని నిరూపిస్తుంటుంది .
చత్తీస్‌ఘడ్ బాగబహారా అటవీ ప్రాంతంలో చండీ దేవాలయం ఉంది . ఇక్కడ మనుషులతో పాటు ఎలుగుబంట్లు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటాయి. దేవాలయంలో పూజారి శంఖం పూరిస్తే చాలు వెంటనే అక్కడికి చేరుకుంటాయి ఎలుగుబంట్లు. అర్చకులు ఎలుగుబంట్లకు తీర్థప్రసాదాలు అందిస్తారు. భక్తులు ఇచ్చే ఫలహారాలు సైతం ఎలుగుబంట్లు స్వీకరిస్తాయి. అడవులలో సంచరించే మృగాలు దేవాలయాలకు వచ్చి దేవుని దర్శనం చేసుకుంటాయి.
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని మహ సముంద్ జిల్లాలోని చండి మాత భక్తులు ఈ ఎలుగుబంట్లు. ఇవి ఆలయానికి వచ్చి అమ్మ దర్శనం చేసుకొని , తీర్థప్రసాదాలు స్వీకరించడం ఇక్కడి విశేషం. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం మహా సముందు జిల్లా బాగబాహార అనే గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్న గుట్టపైన “చండీ దేవి” ఆలయం ఉంది. ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంది. గుడికి దగ్గరలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతంలో అనేక రకాలైన క్రూర జంతువులు నివసిస్తూ ఉంటాయి. ఎక్కువుగా ఎలుగు బంట్లు సంచరిస్తూ ఉంటాయి .
ఈ గుడికి సుమారు ఒక ఇరవై సంవత్సరాల నుండి నిత్యం ప్రతీ రోజు ఎలుగుబంట్లు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ పూజారి పెట్టిన ప్రసాదాలను తిని వెళ్తున్నాయి. అంతేకాదు భక్తులు పెట్టిన ఆహార పదార్దాలు, పానీయాలు త్రాగి వాటి అంతట అవే తిరిగి అడవిలోకి వెళ్తూ ఉంటాయి.
ప్రతీ రోజు గుడిలో పూజా కార్యక్రమాల అనంతరం, హారతి పూర్తి కాగానే, గుడిలో పూజారి శంఖం ఊదటం ఆనవాయితీ. శంఖం ఊదిన కొద్దిసేపటికే ఎలుగుబంట్లు గుంపులుగా. విడివిడిగా అడవిలో ఎక్కడ ఉన్న సరే అరుచుకుంటూ అమ్మవారి గర్భాలయంలోకి వచ్చేస్తాయి. అమ్మవారి సన్నిధిలో అక్కడ ఉన్న భక్తులను కానీ పూజారిని కానీ ఇప్పటివరకు దాడి చేసినట్టు కానీ ,గాయపరిచిన దాఖలాలు లేవు. కానీ, అవి అమ్మవారి సన్నిధి దాటి అటవీ ప్రాంతానికి వెళ్లిన తర్వాత మాత్రం క్రూర జంతువులు లాగానే ప్రవర్తిస్తాయని అక్కడి భక్తులు చెపుతున్నారు. క్రూర జంతువులు అప్పుడు అప్పుడు పులులు, చిరుత పులులు, నక్కలు సైతం చండి దేవి ఆలయానికి వచ్చి వెళుతుంటాయని పూజారులు అంటున్నారు .
ముఖ్యంగా క్రూర జంతువులలో ఎలుగుబంట్లు అక్కడ భక్తులు గుడి సన్నిధిలో ఉన్నంత సేపు ఏమి అనకుండా ,చండి దేవిని దర్శనం చేసుకొని వెళ్తాయి . సాధారణంగా ఎలుగుబంట్లు క్రూర జంతువులు, కానీ అక్కడ వారికి ఏ మాత్రం అపకారం చేసిన దాఖలాలు లేవు. ఇది అమ్మవారి మహిమేనన్నది ఇక్కడికొచ్చే భక్తుల నమ్మకం .