వింతైన విశేషాలున్న ఐదు ఆలయాలు
వింతైన విశేషాలున్న ఐదు ఆలయాలు
-లక్ష్మీ రమణ
భగవంతుడు అంటేనే లీలామానుష రూపుడు కదా ! ఆయన చేసే మాయలు , వింతలూ సామాన్యులకి అర్థంకావడంలేదు సరే, పరిశోధకులకు , పండితులకి కూడా అంతు చిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి . అలాంటి వింతైన విశేషాలున్న ఐదు ఆలయాల వివరాల్ని మీముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం . మరి ఇంకెందుకాలస్యం , భక్తిగా నమస్కరిస్తూ చదివేసి , ఆపై తీరిగ్గా ఆశ్చర్యపోండి .
మద్యం నైవేద్యంగా స్వీకరించే ఆంజనేయుడు :
రాజస్థాన్‌లోని మెహందీపూర్ హనుమంతుడి ఆలయానికి విశేష చరిత్ర ఉంది. ఇందులోని స్వామి వారికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. సింహాసంపై ఉండే ఇక్కడ ఆంజనేయుడిని దర్శించుకుంటే దుష్ట శక్తుల భయం ఉండదు. ఈ ఆలయంలో సహజంగా వచ్చే వేడి నీటిలో స్నానం చేస్తే అన్ని సమస్యలు తొలగిపోయి, శారీరక రుగ్మతలు కూడా తగ్గుముఖం పడతాయి. గుడిలోని మూలవిరాట్టుకు మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామి నోటి దగ్గర గిన్నె పెట్టగానే అందులోని మద్యం అదృశ్యమవుతుంది.
రోజులో కొన్నిగంటలు మాత్రమే కనిపించే ఆలయం :
గుజరాత్‌లోని అరేబియా తీరంలో ఉన్న స్తంభేశ్వర ఆలయాన్ని, తారకేశ్వర సంహారం తర్వాత కార్తికేయుడు ప్రతిష్ఠించాడు. రోజులోని కొన్ని గంటలు మాత్రమే దర్శనమిస్తుంది. సముద్రం పాటుపోట్ల సమయంలోనే ఇక్కడ దర్శించుకోవచ్చు. లింగం నిరంతంరం నీటిలో మునిగి ఉంటుంది.
ఆలయంలోపల అన్ని ఎలుకలే ! బయట ఒక్క మూషికరాజమైనా కానరాదేమి ?
రాజస్థాన్‌లోని కర్ణి మాత ఆలయంలో కూడా మూషికాలను ఆరాధిస్తారు. మరణించిన పూర్వీకులు అవతారంగా ఎలుకలను భావిస్తారు. ఎలుక మరణించి తర్వాత మానవ జన్మ ధరిస్తుందనేది నమ్మకం. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక్క ఎలుక కూడా ఆలయం బయట కనిపించదు.
జ్వాలాముఖి జ్వాలా ఎక్కడిది ?
హిమాచల్‌ప్రదేశ్‌లోని జ్వాలాముఖి దేవి ఆలయానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. అమ్మవారి విగ్రహం నుంచి వెలువడే సహజ వాయువుతో ఆలయంలో దీపాలు వెలిగిస్తారు. ఈ వెలుగులో అమ్మవారి విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతుంది. అయితే నేచురల్ గ్యాస్ ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు.
బుల్లెట్ బాబా గురించి విన్నారా ?
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ‘ఓం బన్నా.. బుల్లెట్ బాబా’ ఆలయాన్ని దర్శించాల్సిందే!జోద్‌పూర్‌కు 47 కిమీల దూరంలో ఉన్న పాలి జాతీయ రహదారి పక్కన ఈ ఆలయం ఉంది. 350 సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటుంది. ఆ రహదారి మీదుగా వెళ్లేవారు తప్పకుండా ఈ ఆలయంలోని బుల్లెట్‌ను దర్శించుకుని వెళ్లాలని, లేకపోతే ప్రమాదాలకు గురవ్వుతారనేది స్థానికుల విశ్వాసం.
ఇక్కడ బుల్లెట్‌ను పూజించడం వెనుక పెద్ద కథే ఉంది. ఓం సింగ్ రాథోడ్ అలియాస్ ఓం బన్నా అనే వ్యక్తి.. 1988 డిసెంబర్ 2న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై మృతి చెందాడు. దీంతో పోలీసులు బుల్లెట్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. అయితే, తర్వాతి రోజు ఆ బుల్లెట్ స్టేషన్ నుంచి మాయమై.. ఘటనా స్థలంలో కనిపించింది. ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని భావించిన పోలీసులు.. మళ్లీ దాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లి పెట్రోల్ పూర్తిగా తీసేశారు. అయితే, తర్వాతి రోజు కూడా అది ఘటనా స్థలంలోనే కనిపించింది. దీంతో, పోలీసులు ఆ బుల్లెట్‌ను అక్కడే వదిలేశారు. అయితే, స్థానికులు.. ఓం బన్నా ఆత్మే ఇదంతా చేసిందని, ఆయన దైవంతో సమానమని భావించిన స్థానికులు.. అక్కడే ఆలయం కట్టి బైకుకు పూజలు చేయడం ప్రారంభించారు. దీనికి పూజలు చేసేందుకు ప్రత్యేకంగా అర్చకుడిని కూడా నియమించారు.