వ్యాధులు నయం చేసే శంకరుడు తారకేశ్వరుడు !
వ్యాధులు నయం చేసే శంకరుడు తారకేశ్వరుడు !
-లక్ష్మీ రమణ
మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ శైవాలయాలున్నాయి. కానీ తారకేశ్వరుడికున్న ప్రత్యేకత మరెవ్వరికీ లేదనే చెప్పాలి . శివనామాల్లో వైద్యనాధుడనే పేరు కూడా ఉంది కదా ! అపార ధన్వంతరీ అవతారమే ఆ లయకారుని ఈ తారకేశ్వర స్వరూపం .
ఆలయం ఇక్కడ ఉంది :
తారకేశ్వర దేవాలయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, హుగ్లీ జిల్లా లో కలకత్తా నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో పండాలె అనే గ్రామంలో ఉంది. సుప్రసిద్ధ శివకేత్రాలలో ఇదికూడా ఒకటి . ఇక్కడ శివుడు లింగరూపంలో స్వయంభువుగా వెలిశాడని స్థలపురాణం. అయ్యవారితో పాటు కొలువైన అమ్మని తారకేశ్వరి పేరిట అర్చిస్తారు . ఆది దంపతులు కదా! మరి ఆయన తారకేశ్వరునిగా వస్తే ఆ అర్థనారీశ్వర తారకేశ్వరిగా మారి బిడ్డలని కాచుకోకుండా ఉంటుందా !
చరిత్ర , స్థల పురాణం :
ఈ ఆలయాన్ని 18 వ శతాబ్దంలో రాజా భరమల్లుడు నిర్మించాడు. ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న స్థలంలో పూర్వం ఆవులు స్వచ్ఛందంగా క్షీరధారాలు వర్షించి శివార్పణం చేసేవట. ఒకసారి రాజా భరమల్లుడుకి కలలో శివుడు కనిపించి తనకి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించామని చెప్పగా ఆ రాజు సంతోషించి శివాజ్ఞతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం.
నమ్మకం :
ఇంకా ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఎంతటి దీర్ఘ రోగమైనా, మోడీ వ్యాధి అయినా స్వామి తన మహిమ చేత తగ్గిస్తారని నమ్మకం . అందుకే ఈ తారకేశ్వరుణ్ణి దర్శించేందుకు భక్తులు ఇబ్బడి ముబ్బడిగా వస్తుంటారు. ఈ ఆలయం దగ్గర ఉన్న కోనేటిలో స్నానం చేసి, ఆలయం చుట్టూ ప్రదిక్షిణ చేస్తే సర్వ రోగాలు నయం అవుతాయని నమ్ముతారు. గుండెజబ్బులు ఉన్నవారు ఈ స్వామిని దర్శిస్తే తొందరగా నయం అవుతుందని చెబుతారు . ఈ ఆలయంలో ఒక పక్కన కొన్ని వందల సంఖ్యలో గంటలు, ఒకేదగ్గర ఉంటాయి. ఆలయంలో పూజ జరిగే సమయంలో భక్తులు ఈ గంటలని మోగిస్తుంటారు.
చౌడేశ్వరునికి చెముడున్నట్టు , ఈయనకి గట్టిగా వినిపించాలనో , లేక తమగోడు స్వామీ వినాలనే తెలీదుగానీ , ఈ గంటలు ఇంతభారీగా అదీ అనారోగ్యంతో ఉన్నవారు వచ్చే చోట మ్రోగించడం చూస్తే , వింతగా అనిపిస్తుంది . అయినా ఏ ఒక్కరికీ ఎటువంటి అసౌకర్యంలేకుండా బాధతో వచ్చి దర్శనం చేసుకున్నవారు ఉపశమనంతో ఇక్కడి నుండీ బయటికి వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది . ఇక్కడి స్థానికులని కదిలిస్తే తారకేశ్వరుని కథలు - కథలు కథలుగా , సజీవ సంఘటనలుగా చెబుతారు .
తారక మంత్రం కోరిన దొరికెను , ధన్యుడనైతిని తారకేశ్వరా అని భక్తుల చేత నోరారా అనిపించుకుని , వారి బాధలు తీర్చి , ఎల్లప్పుడూ మృత్యుంజయీభవ! అని దీవించే ఈ మృత్యుంజయుని దర్శనం శుభకరం. ఫలప్రదం .