భీమకుండం అద్భుతాలకు ఆలవాలం

భీముడు తన గదాఘాతంతో నిర్మించిన భీమకుండం అద్భుతాలకు ఆలవాలం
-లక్ష్మీ రమణ
భీముడు తన గదాఘాతంతో నిర్మించిన భీమకుండం భారతదేశంలో దర్శించితీరాల్సిన స్థలాల్లో ఒకటి . ఇది మధ్యప్రదేశ్ ఛత్తాపూర్ జిల్లా బాస్నా గ్రామంలో ఉంది . దీనికి నీలికుండ్ అనికూడా పేరుంది . గుహాంతర్భాగంలో ఉండే ఈ కుండం చాలా స్వచ్ఛంగా ఉంటుంది . గుహముఖభాగంనుండీ లోపలి మూడు కిలోమీటర్లు వెళితే అక్కడ ఈ కుండం దర్శనమిస్తుంది . మధ్యలో మనం శివదర్శనం చేసుకోవచ్చు . ఈ లింగేశ్వరుణ్ణి పాండవులు పూజించినట్టు చెబుతారు .
స్థలపురాణం
పాండవులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడికి వచ్చారని స్థలపురాణం .ఇక్కడి కొండల సౌందర్యానికి మెచ్చి వారిక్కడ వసించారట. కానీ ఇక్కడి సూర్యప్రతాపాన్ని సుకుమారైన ద్రౌపది తట్టుకోలేకపోయింది . కళ్ళుతిరిగి పడిపోయింది . దగ్గరలో నీటితావులేవీ లేకపోవడంతో , భీముడు తన గదాఘాతంతో ఈ కుండాన్ని ఏర్పరిచాడని స్థానికులు చెబుతారు . అందుకు నిదర్శనమా అన్నట్టు సరిగ్గా ఈ కుండం పైభాగంలో చిన్న రంధ్రం ఉంటుంది . చుట్టూ ఎర్రనిరాళ్ళ మధ్య నీలిరంగులోఉండే జలపాతం చూపారులని విస్మయానికి గురిచేస్తుందనడంలో సందేహం లేదు .
మరో విశేషం ఏంటంటే, ఎక్కడ సునామీ వచ్చినా, ఈ జలకుండం లోని నీరు దాదాపు 40అడుగుల ఎత్తునున్న శివలింగాన్ని సెకండ్ల కాలం లోనే తాకుతుందట .గుజరాత్ ,మనీలా లలో సునామీలోచ్చినప్పుడు ఇలానే జరిగింది .ఈ కుండం లో ఎంతమంది స్నానం చేసినా, నీళ్లు మురికికావు . స్పటికంలా స్వచ్ఛంగా ఉంటాయి .
నీలిరంగు ఇలా వచ్చింది
ఈ కుండం భీమనిర్మితమే అయినా , ఇక్కడినీటికి అబ్బిన వర్ణం మాత్రం నీలమేఘశ్యాముడిది . ఇందులో మర్మమేమి స్వామీ అంటే, స్థానికులు మరో కథ వినిపిస్తారు . దేవర్షి నారదుడు ఇక్కడ విష్ణుమూర్తి కోసం తపిస్తూ , అమృతగానం చేశారట. అందుకే దీన్ని నారదకుందాం అనికూడా పిలుస్తారు . అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ కుండంనుండీ ఆవిర్భవించి నారదుణ్ణి అనుగ్రహించాడట . అలా ఆ స్వామి వర్ణం ఈ కుండంలో నిలిచి , ఆ స్థితికారుని అనుగ్రహాన్ని భక్తులకి అనుగ్రహిస్తుందని చెబుతారు .
లోతెంత ?
ఆ పాలకడలినే తనతో తీసుకొచ్చారేమో భగవన్నారాయణులు మనకి తెలీదుగానీ ఈ కుండం లోతెంత అని పరిశోధించినవాళ్ళకి , అగాధమే సమాధానమయ్యింది . ఈ కుండానికీ, అరేబియా సముద్రానికి ,పవిత్ర గంగానదికీ సంబంధం ఉందంటారు .కానీ గంగ ఇక్కడికి వెయ్యి కిలోమీటర్లదూరం లో ఉంటె , అరేబియా సముద్రం అయిదు వందలకిలో మీటర్ల దూరంలో ఉంది .
ఈ జలాశయం లోతును ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు .డిస్కవరీ చానల్ వాళ్ళు గజఈతగాళ్ళని రంగంలోకి దింపి, లోతు కనుక్కునే ప్రయత్నం చేస్తే, వాళ్ళు సుమారు వంద అడుగులకంటే ఎక్కువ లోతుకు వెళ్ళ లేకపోయారట . దీనికీఅరేబియా సముద్రానికి సంబంధం ఉందని భావించారు .ఆ సముద్ర ఆలల తాకిడి తోపాటు ,సముద్రాలలో ఉండే అరుదైన జీవరాశులు అంత లోతు నీటిలో కనిపించి పెద్ద ఆశ్చర్యానికి లోనయ్యారట . అది ఎలా సాధ్యమో సర్వేశ్వరులవారికే ఎరుకని , ఎరుగదలచినవారు చివరికి చేతులెత్తేశారు .
ప్రతి సంక్రాంతికి ఇక్కడి ప్రజలు గొప్ప జాతర జరుపుతారు . వీలయితే తప్పక దర్శించండి . కానీ కుండంలో జలకాలాడేప్పుడు జాగ్రత్తగా ఉండడం మరువకండి . లేకపోతె చిరునామాలు గల్లంతయ్యేప్రమాదముంది .