మహత్యానికి మరోపేరు శ్రీశైలం ఇష్టకామేశ్వరి
మహత్యానికి మరోపేరు శ్రీశైలం ఇష్టకామేశ్వరి.......!!
కోరికలు అనేకం. వాటిని తీర్ఛుకోవడానికి మార్గాలు అనేకానేకం. మానవ ప్రయత్నంతో కాని వాటిని దైవానికి విన్నవించి తీర్చుకోవాలనుకొంటాం. దేవుడికి మన ఇష్టకామాలను (కోరికలు) చెప్పుకొంటాం. మన కోరికలు వినే దైవాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి ఆలయం ఒకటి. శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఇష్టకామేశ్వరీ దేవి భక్తుల కోరికలు తీర్చి వారిలో ఆస్తికతను పెంచుతున్నది.
ఇష్టకామేశ్వరి దేవత విగ్రహం చాలా విశిష్టమైనది. ఈ రాతి విగ్రహాన్ని తాకితే చాలా గట్టిగా ఉంటుంది. అయితే నుదట కుంకుమ పెట్టినప్పుడు నుదురు వేలికి మెత్తగా చర్మంలా తాకుతుంది. ఎన్నో సంవత్సరాలుగా వేలాది మంది భక్తులు ఈ అనుభూతిని పొందుతున్నారు. దేవి మందహసంతో భక్తులకు దర్శనం ఇస్తున్నది.
భక్తులకు దేవిపై అపార నమ్మకం. రెండు మూడు మార్లు ఈ దేవిని దర్శించిన వారున్నారు. మళ్ళీ మళ్లీ వస్తుంటారు. దానికి కారణం వారు వచ్చివెళ్లిన తర్వాత కోరిన కోరికలు సాఫల్యం కావడమే. కోరికలు తీరినందుకు కృతజ్ఞతాభావంగా ఆలయం సందర్శించి మళ్ళీ కొత్త కోరికలు అప్పగించి వెడతారు. అవి నెరవేరుతాయి. దీనితో మళ్లీ వస్తారు.
ఇష్టకామేశ్వరి విగ్రహం అరుదైనదని, ఇలాటి విశిష్టత కలిగిన విగ్రహ దేశంలో మరెక్కడా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో అరుదైన విషయం. భక్తులు తమంతట తామే ఆలయానికి రారని, వారిని దేవి ఆహ్వానిస్తుందని ప్రతీతి. అమ్మ భక్తులకు పిలుపు ఇస్తుందని, ఆ పిలుపు మేరకు వారు ఇక్కడికి వచ్చి పూజలు జరుపుతున్నారని నిర్వాహకులు చెబుతారు.
ఎంతోకాలం క్రిందట అడవిలో కొందరు చెంచులకు అమ్మ విగ్రహం కనిపించిందని, వారు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి పూజలు జరిపారని, ఇప్పటికీ వారి సంతతి వారే ఆలయ అర్చకులుగా వ్యవహరిఅస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.