శనీశ్వరుడికి బిల్వపత్రార్చన మహాప్రీతి
శనీశ్వరుడికి బిల్వపత్రార్చన మహాప్రీతి . ఎందుకంటే …
లక్ష్మీ రమణ
శనీశ్వరునికి సాధారణంగా నువ్వులనూనె, నల్లని వస్త్రం , నల్లని నువ్వులు సమర్పిస్తుంటాం .అవే ఆయనకీ ఇష్టమైనవి. ఆయన అనుగ్రహాన్ని మనపై కురిపించేవని విశ్వసిస్తాం. నవగ్రహాల్లో ఉన్నప్పుడు శనికి అవే సమర్పణ చేస్తాం. ఇక, బిల్వదళాలు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఆ బిల్వార్చన చేస్తే, శివయ్య కరుణ అపారంగా లభిస్తుందని నమ్ముతాం. మరి ఈ బిల్వాలకీ, ఆ శనీశ్వరుడికీ ఏమిటట సంబంధం ? లక్ష్మీ స్వరూపమైన బిల్వం శనీశ్వరునికి ఎందుకు ప్రీతిపాత్రమైనది ?
సత్యం అనేది నివురుగప్పిన నిప్పు వంటిది అని మన పెద్దలు చెబుతుంటారు కదా ! నల్లగా ఉన్న, జ్వలిస్తూ ఉండే ఆ నిప్పుకణిక లాంటి సత్యమే శనిదేవుడు . సత్యాన్ని, ధర్మాన్ని ప్రాణం పణంగాపెట్టయినా సరే నిర్వర్తించేవాడు. తర-తమ భేదాలు లేకుండా ధర్మాన్ని నిర్వహించేవాడు . విధి నిర్వహణలో క్షణమైనా జాగు చేయనివాడు. అనంత శుభాలని అందించేవాడు .
అటువంటి శని యొక్క ధర్మాచరణని పరీక్షించాలన్న కోరికతో శివుడు ఆయన్ని పిలిపించారట. ‘శని నీవు నన్ను పట్టగలవా?’ అని ప్రశ్నించారట . అందుకు శని ‘రేపు ఉదయం నుంచి సాయంత్రంలోపు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను’. అని చెప్పి కైలాసం నుంచి వెళ్ళిపోయారట .
ఇక , మరుసటి రోజు ఉదయం పరమేశ్వరుడు ఎవరికీ కనిపించకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు బిల్వవృక్షము తొర్రలో దాక్కుని ఉన్నారు . పరమేశ్వరుని జాడ తెలియలేదని పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములూ గాలించారు. ఎంత వెతికినా పరమేశ్వరుని జాడలేదు .
సాయంత్రం సంధ్యా సమయం అయ్యింది . గడువుకాలం ముగిసింది. దాంతో , పరమేశ్వరుడు బిల్వవృక్షం నుంచి బయటకు వస్తారు. వెంటనే శనీ పరమేశ్వరుడి ముందు ప్రత్యక్షమవుతారు . ‘ ప్రగల్భాలు పలికావుగా శనీ, నన్ను పట్టుకోలేకపోయావే’ అని పరమేశ్వరుడు ప్రశ్నిస్తారు. అందుకు శని నమస్కరించి ‘నేను పట్టుకోవడం కారణంగానే కదా మీరు బిల్వవృక్ష రూపంగా రోజంతా ఉన్నారు’ అని చెబుతాడు. శని విధి నిర్వహణకు భక్తి ప్రపత్తులకు మెచ్చిన పరమేశ్వరుడు ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి ఉంచి నాతోనే నివసించి ఉన్నావు కాబట్టి, ఈ క్షణం నుంచి నీవు శనీశ్వరుడుగా (శని + ఈశ్వర) ప్రసిద్ధి చెందుతావని తెలియజేశారు.
అదేవిధంగా ‘శని దోషం ఉన్నవారు బిల్వ పత్రాలతో నన్ను(ఈశ్వరుని) పూజించినట్లయితే వారికి శని దోష నివారణ జరుగుతుంది, శని బాధల నుండీ విముక్తి కలుగుతుంది’ అని వరాన్ని అనుగ్రహిస్తారు . ఇదీ శనీశ్వరునికి బిల్వాలకీ ఉన్న సంబంధం.