శనీశ్వరుడు న్యాయాధికారి
*న్యాయాధికారి..*
మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైశ్చరుడు నియంత్రిస్తాడంటారు. అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గ నరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం.
శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
*మందపల్లి మందుడు..*
తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో శనీశ్వరాలయం ప్రసిద్ధిగాంచింది. పూర్వం అశ్వత్ధ´, పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి వారిని భక్షించేవారట. అప్పుడు వారంతా వెళ్లి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో వెురపెట్టుకున్నారట. వారి వెురను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడట. అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడట. అప్పట్నుంచి ఆ ఆలయం శనైశ్చర క్షేత్రంగా పేరుపొందింది.
శత్రుబాధ, రుణబాధ, రోగపీడతోనూ... ఏలినాటిశని, అర్ధాష్టమశనితోనూ బాధపడేవారు ఈ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తొలగిపోతాయని ప్రతీతి. ఏటా శ్రావణమాసంలోనూ శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.
ఇంకా... మహారాష్ట్రలోని శనిసింగణాపూర్ ప్రపంచ ప్రసిద్ధ శనైశ్చరాలయం. ఇటీవలే కర్ణాటకలోని ఉడుపిలో దేశంలోనే అతిపెద్దదైన శనీశ్వరుడి విగ్రహాన్ని (23 అడుగులు) ఆవిష్కరించారు.