అందరి కోసం

అమృత వాక్కులు
అందరి కోసం
ఉన్నంత కాలం అందరి కోసం ఆలోచించేవాడు, అందరితో కలిసి పని చేసేవాడు, నది సముద్రంలో కలిసి పోయినట్లు సముద్రాకర నదిగా ఆనందం పొందాలనుకునే మానవుడి కంటే గొప్పవాడు లేడు. అతడే వేదాంతి. అతడే విశ్వప్రేమికుడు. అలాంటి వాడినే పరమాత్మ భగవద్గీతలో పరమ శ్రేష్ఠుడు అని చెప్పాడు.
సమబుద్ధి కలవాడికంటే మించినవాడు ఈ లోకంలో లేడు. ఈ సమత్వమే యోగం.
జీవితం “బుద్బుద పాయం”. ఇవ్వాళ ఉంటే రేపు పోతాం అనే నిరాశ వాదంతో, చేతలతో కాలం వెళ్లదీయకుండా - వర్ధమానాన్ని అనుభూతిస్తూ, భవిష్యత్తు కోసం అందమైన కలలు కంటూ, వాటిని సాకారం చేసుకునే దిశగా ప్రణాళికలు రచించుకునే వారికి జన్మ విలువ అమూల్యం.
కాలం ఆయుషు రూపంలో కరిగిపోతుందనుకునే వారికి ప్రతి క్షణం అపురూపమైనది. మనిషి జీవితంలో సమయ సద్వినియోగమే. ప్రతిభకు కొలమానంగా, తార్కాణంగా నిలుస్తుంది. వ్యక్తి జీవితంలో గాని, సామూహిక జీవితంలో గాని "తక్కువ తీసుకో, ఎక్కువ ఇచ్చుకో” అనే చైనా సామెత చాలా విలువైనది. ఇది త్యాగబుద్ధిని ప్రతిబింబిస్తుంది.
- బిజ్జ నాగభూషణం