Online Puja Services

కుబేరుడికి అనంత ఐశ్వర్యం ఎలా వచ్చింది ?

13.59.2.242

కుబేరుడికి అనంత ఐశ్వర్యం ఎలా వచ్చింది ?
లక్ష్మీ రమణ . 

మనం మనుషులం .  ఆధ్యాత్మికంగా చూసినా , ఇహలోకంలో పరలోకంలోని  సౌఖ్యాలనే ఎక్కువగా తలపోస్తాం. ఆ సౌఖ్యాలమీదున్న ఇష్టం , ఒకింత భయం , దాన్తోపాటొచ్చిన గౌరం మన ఆచరణలో అప్పుడప్పుడూ (వీలయితే, ఎప్పుడూ ) తొంగి చూస్తూనే ఉంటుంది . అందుకే అననుకానీ, చాలా మందికి - మన దేవీదేవతల్లో లక్ష్మీ దేవి మీద , కుబేరుడిమీద మక్కువ , భక్తి శ్రద్ధాలూ ఎక్కువ. కానీ అసలీ కుబేరుడు ఎవరు ? శ్రీపతికే సిరిని అప్పివ్వగల శక్తి, ఆయనతో ప్రాంసరీనోటు రాయించుకోదగిన యుక్తి ఎక్కడినుండి సంప్రాప్తినిచ్చాయి ? పైగా ఆ అప్పుకి సాయంచేసిన శివుడు “కుబేరుడు నా స్నేహితు”డన్నారే ! ఇది ఆలోచించవలసిన విషయమే . 

శివయ్య స్మశానవాసి . నిరంతరం బూడిదపూసుకొని, చర్మాంబరాలు కట్టుకొని , తపస్సులో నిమగ్నమయ్యుండే యోగి . కుబేరుడు అపార ధనవంతుడు. పట్టుపీతాంబరాలు కట్టుకొని , విలాసవంతమైన భవనాలలో , అంతులేని సంపదలతో తులతూగే వైశ్వానరుడు . ఆయనిచ్చేది బూడిద. ఈయనిచ్చేది ఐశ్వర్యం . 

దీన్నే మరో కోణంలో ఆలోచిస్తే, లయకారుని చిద్విలాసం కనిపిస్తుంది . ఆత్మమాత్రమే శాశ్వతం . నాదినాదని ఏదానిని నీవు ప్రేమిస్తున్నావా అది చివరికి బూడిదగా మారుతుంది . నిత్యుడవై సత్యుడవై, శుద్ధుడవైన ఆత్మ స్వరూపమైన - నీలో నున్న నేను మాత్రమే ఎప్పటికీ నిలచి ఉండేది అని చెప్పే పరమ జ్ఞానస్వరూపం శివుడు . 

మనిషిమీద స్వారీ చేసే కుబేరుడు దీనికి పూర్తిగా భిన్నం . ఈ శరీరం దేనికి సులభంగా లొంగుతుందో ఆ కోరికలకూ , ప్రలోభాలకూ , వాటికి చోదకాన్నిచ్చే ధనానికి  అధిపతి .  శాశ్వతమైన పూలదారి మొదట కంటకాల మయంగా కనిపించవచ్చు , కానీ ఆ దారిలో వెళ్లిన వారు శాశ్వతానందాన్ని , శివసాయుద్యాన్ని పొందుతారు . సుఖాల బాటలా ఉన్న, పూల పాన్పులా ఆహ్వానిస్తున్నా ముందర పొంచి ఉన్న ముళ్ళని యెరుగలేని వారు ధనాన్ని, ఇతర ఐహికసుఖాల మాయలో ఇరుక్కొని జన్మజన్మల పరంపరని పొంది సుడిగుండంలో చిక్కిన నావలా పరిభ్రమిస్తుంటారు . 
 
ఇంతకీ , ఆ కుబేరుడు అంత ఐశ్వర్యాన్ని పొందడానికి కారణం ఈశ్వర అనుగ్రహమే అనేది ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం . ఈ కధ శివాలయంలో శివరాత్రినాడు , ఆకలితో అలమటిస్తూ , నైవేద్యాలని దొంగలించేందుకు, తన చొక్కా చింపి  దీపం వెలిగించి , ఆ ఆత్రుతలోనే కిందపడి నందికి తలకొట్టుకోవడంతో చనిపోయిన బ్రాహ్మణ భ్రష్టుడు గుణానిధిది . ఆ శివరాత్రి నాడు తనకి తెలియకుండా చేసిన నదీస్నానం ,  ఉపవాసం, దీపారాధనం -భ్రష్టుడైనా కైలాసవాస ప్రాప్తిని పొందేలా చేశాయి . 

ఇక మహర్షి అయిన పులస్త్యుని కుమారుడు విశ్రవునికి, భరద్వాజ మహర్షి కుమార్తె అయిన దేవవర్ణికి పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే (విశ్రవుని కుమారుడు) కుబేరుడు. కుబేరుడు చిన్నతనం నుండి శివ భక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా (కుబేరునిగా) పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు, తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలు పెట్టాడు. 

కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్ధాలను సేవించి, తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమయ్యి, తనని లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్ధామనవుతాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతం మీద, సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారనీ, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడకి వెళ్ళి ఉండమనీ చెప్పి మాయమవుతాడు.

రాక్షస నగరమయిన లంకకు ఇప్పుడు కుబేరుడు అధిపతి కనుక రాక్షసాధిపతి అయ్యాడు. ఆ విధంగా కుబేరుడు లోకపాలకుడు, ధనాధ్యక్షుడు, రాక్షసాధిపతే కాక పుష్పక విమానాన్ని కూడా పొందాడు. దానితో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు. 

కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన సుమాలి అనే రాక్షసుడు (పాతాళ రాజు) అసూయ చెందాడు. సుమాలి కుమార్తె కైకసి. ఈవిడ విశ్రవ బ్రహ్మ రెండవ భార్య. అంటే కుబేరుని సవతి తల్లి. కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడయిన కుమారుడు కావలెనన్న కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది. విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో, వేళ కాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు (ఏనుగు యొక్క “కుంభ”స్థల ప్రమాణము కల కర్ణములు అనగా చెవులు కలవాడు అని అర్థం) అను రాక్షసులు జన్మిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావలెనని అడగటంతో, విశ్రవుని అనుగ్రహం వలన విష్ణు భక్తి కల విభీషణుడు (దుష్టులకు విశేషమయిన భీతిని కలిగించువాడు అని అర్థం) పుడతాడు. అలా కుబేరుడు రావణాసురుడి సోదరుడనమాట! రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారయిన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు. 

తన సవతి సోదరుడు భోగ భాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక, లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు. రావణాసురుడు మహాబలవంతుడు. అపరిమిత పరాక్రమశాలి. అతను లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుని తరిమేశాడు. 

కుబేరుడికి తెలిసింది తపస్సే! నిరంతర శివ ధ్యానమే! దీంతో లంకనుండీ బయటపడిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి, ఒంటి కాలి మీద నిలిచి, శివుని మనసులో నిలుపుకుని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలూ వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించటానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి, “లంకా నగరాన్ని మించిన దివ్యభవనాలతో, అపురూపమయిన చైత్ర రథం అనే ఉద్యానవనముతో, నవ నిధులతో, మణి మాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండీ నీవు అక్కడే ఉంటూ, యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు. ధనదుడవు, ధన దాతవు అయిన నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కును పరిపాలిస్తూ, నా ప్రియ మిత్రుడవై, నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు” అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు. అందుకనే అధిక ధనము కల వారిని “అపర కుబేరులు” అంటారు.

మణిమాణిక్యాలు, నిధులు, సంపదలతో నిండి వుండే ఈ అలకాపురం 100 యోజనాల పొడవు, 70 యోజనాల వెడల్పు కలిగి, కల్పవృక్షం నుండి వీచే చల్లని గాలితో పరిమళ భరితంగా ఉంటుంది. అక్కడ తుంబురులు, గంధర్వ కన్యలు గానం చేస్తుంటే, రంభ, చిత్రసేన, మిశ్రకేశి, మేనక, సహజన్య, ఊర్వశి, శౌరభేయి, బుల్బుద, లత, మొదలగు ఎంతోమంది అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. మణిభద్రుడు, గంధకుడు, గజకర్ణుడు, హేమనేత్రుడు, హాలకక్షుడు, మొదలయినవారు కుబేరుని కొలువులో ముఖ్యమయిన వారు. కుబేరుని ప్రధాన సహాయకుడు విరూపాక్షుడు. శివుడు నిత్యం దర్శించే ప్రదేశము ఈ అలకానగరం అంటూ ఆ నగర శోభని మహాభారతంలో నారదుడు ధర్మరాజుకి వివరించాడు. 

కాబట్టి , శివుడంటే, బూడిదనిచ్చేవాడు కాదు. అనంతమైన సంపదలిచ్చేవాడు . ఇహపర సుఖాలను ఆశించేవారి ఐచ్చికాన్ని బట్టీ అది వర్తిస్తుంది మరి . యోగులకి అలోకికత్వాన్ని , సంసారులకి లౌకిక సౌఖ్యాన్ని చేకూర్చే విభూతి ఆ లయకారుని సన్నిధి . 

ఓం నమః శివాయ .

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya