పూజ మంత్రాలు మాతృభాషలోనే ఎందుకు చెప్పకూడదు?
పూజామంత్రాలను సంస్కృతంలో వాడటానికి బదులుగా అందరికీ అర్థమయ్యే మాతృభాషలోనే ఎందుకు చెప్పకూడదు?
పూజ, హోమం మొదలైనవి పవిత్రమైన ధార్మిక క్రియలు. వీటియొక్క క్రమాన్ని వాటికి సంబంధించిన మంత్రాలను మనకి తెల్సినవారు మన సంప్రదాయకర్తలైన ఋషులు. వారికి ఈ మంత్రాలు ధ్యానంలో దైవంచే అనుగ్రహించబడ్డాయి. ఇవి వారు రచించినవి కావు. మనస్సులో ఊహించి, కల్పించినవి కావు. అందుకే వాటిని మనం మంత్రాలు అంటాం.
కనుక వారు మనకు ఏ రూపంలో, ఏ భాషలో వాటిని ఇచ్చారో అదే రూపంలో, అదే భాషలో ప్రయోగించటం సబబుగా ఉంటుంది. దానివలన ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాక మంత్రశాస్త్ర ప్రకారం ఈ మంత్రాలను సరిగా ఉచ్చరించినప్పుడు అవి వినేవారి మనస్సులలో ఉత్కృష్టమైన ఉల్లాసభరిత స్పందనలను కలుగజేస్తాయి.
కొన్ని శతాబ్దాలుగా వేలమంది పవిత్ర మనస్సుతో, విశ్వాసంతో అవే అక్షరాల కూర్పుతో భగవంతుణ్ణి ఉపాసిస్తూ వస్తున్నారు కనుక దైవశక్తి వాటిలో గర్భితంగా దాగి ఉంటుంది. మంత్రాలు శబ్దరూప పరబ్రహ్మగా మారతాయి.
ఇంతకుముందు తెలిపినట్లు అవి పరదైవమే ప్రసాదించినవి కాబట్టి మంత్రమంటే శబ్దరూప పరబ్రహ్మమే. కనుక వీటిని ఇతర భాషలలో చెప్తే అవి కేవలం అనువాదాలౌతాయి కాని 'మంత్రాలు' కావు.
ఐతే ఒక పని చేయవచ్చు పూజలో చేసే కర్మలను గురించిన విషయాల వివరాలు మంత్రాలు, వాటియొక్క అర్థం, వాటిని ప్రయోగించే పద్ధతులను గురించి ప్రాంతీయ భాషలలో వివరించి చెప్పి తర్వాత సంస్కృతంలోనే వాటిని ఉచ్చరించి, విధ్యుక్తరీతిలో పూజాదులను చేస్తే అది అందరికీ ఇతోధికంగా తోడ్పడుతుంది. ఇతర మతాలలో కూడా ధర్మకార్యాలన్నీ వాటి మూలశాస్త్రాలు ఏ భాషలలో ఉన్నాయో ఆ భాషలలోనే నెరవేర్చబడతాయన్న సంగతి మనం మరచిపోకూడదు.
రచన: స్వామి హర్షానంద