పంచయజ్ఞప్రియా’ - అర్థం ఏమిటి ?
పంచయజ్ఞప్రియా’ అని లలితా నామం - అర్థం ఏమిటి ?
దేవతలకి ప్రీతిని చేకూర్చేందుకు, మానవులు అగ్నిముఖంగా ద్రవ్యాలని సమర్పించడమే యజ్ఞం . యజ్ఞాన్ని ఆచరించడం వలన కోరిన కోర్కెలు ఈడేరుతాయి . సుఖశాంతులు కలుగుతాయి . కర్మలని నశింపజేసి , పునర్జన్మ అనేది లేకుండా పరమాత్మలో లయం అయ్యేందుకు యజ్ఞం ఒక ఉపకరణంగా పురాణాలు చెబుతున్నాయి . మరో విధంగా చెప్పాలంటే, ఆత్మా పరిత్యాగమే యజ్ఞం .
‘యజ్ఞం’ అనే పదానికి ఇస్టి , యాగం , క్రతువు మొదలైన పేర్లున్నాయి.
వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. అంటే, యజ్ఞం విష్ణు స్వరూపమని అర్థం . ‘యజ్ఞం’ అను శబ్దం ‘యజ దేవపూజయాం’ అనే ధాతువు నుంచి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం. బ్రహ్మ పురాణాన్ని అనుసరించి, బ్రహ్మదేవుడు కూడా సృష్టిని ఆరంభించే ముందర యజ్ఞం చేశాడట . ఆ తర్వాత మానవుని సృష్టించారట . ఆ తర్వాత వారితో , ‘మీరందరూ కూడా కర్తవ్య కర్మ రూపమైన ఈ యజ్ఞాన్ని ఆచరిస్తూ వృద్ధిని పొందండి’ అని ఆశీర్వదించారట. అగ్ని ముఖంగా కాకుండా అర్పణ , కృతజ్ఞతా భావంతో చేసే కొన్ని కృత్యాలను కూడా యజ్ఞమనే పేర పిలుస్తూ ఉంటారు. పంచమహా యజ్ఞాలుగా మనకి వేదం ఐదు రకాల కార్యాలని పేర్కొంటుంది . ఈ ఐదు యజ్ఞాలనీ నిర్వర్తించేవారిపై ఆ జగన్మాత కృప ఎల్లప్పుడూ ఉంటుందట . అందుకనే ఆవిడని ‘ పంచయజ్ఞప్రియా ‘ అంటారని వివరిస్తుంది దేవీభాగవతం .
1. దైవయజ్ఞం - దేవతలపట్ల కృతజ్ఞతని ప్రకటించడం . దీనివల్ల దేవీ దేవతలా కృప లభిస్తుంది.
2. పితృయజ్ఞం - జీవితాన్నిచ్చిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతని ప్రకటించడమే పితుయజ్ఞం . పితృదేవతలకు తర్పణాలు వదలడం, పుత్రునిగా స్వీకరించినందుకు వారి పట్ల తన ధర్మాన్ని నిర్వర్తించం ఇందులోని భాగాలే . దీనివల్ల కుటుంబవ్యవస్థ పటిష్టమవుతుంది . పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది
3. ఋషియజ్ఞం -మనకి జ్ఞానభిక్షని పెట్టిన గురువులు, సత్యాన్వేషకులైన పెద్దలకు కృతజ్ఞతని తెలియజేసుకోవడం . వారి యెడల మన్ననతో , భక్తితో మెలిగి , వారి ఆదేశానుసారం నడుచుకోవడం . ఇది మనం నడవాల్సిన ధాటిని చూపిస్తుంది. గురువే కదా అజ్ఞానాంధకారంలో ముందుకు నడిపించగలిగిన ఏకైక దివ్యజ్ఞానజ్యోతి .
4. బ్రహ్మయజ్ఞం - వేదాధ్యయనమే బ్రహ్మయజ్ఞం. దీనివల్ల మానవ సంస్కారాలు పరిమళిస్తాయి . ‘సర్వేషాం శాంతిర్భవతు’ అంటుంది కదా వేదం . అందువల్ల లోకానికి శాంతి చేకూరుతుంది .
5. భూతయజ్ఞం - అహింసని కలిగిఉండడం . జీవుల పట్ల ప్రేమతో, దయతో వ్యవహరించడం. దీనివల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది .
పూర్వం నిత్యం యజ్ఞాలు చేసే నిత్యాగ్నిహోత్రులు ఉండేవారు. ఇప్పుడు అటువంటివారు క్రమంగా కనుమరుగవుతున్నారు . జన్మరాహిత్యాన్ని , పరమానంద ప్రాప్తిని అందించేటటువంటి ఈ యజ్ఞాన్ని ఆచరించేవారు పెరగాలని, తద్వారా విశ్వశాంతి చేకూరాలని ఆశిద్దాం .
- లక్ష్మి రమణ