కర్మ విపాకము అనగా ఏమిటి...!?
కర్మ విపాకమునకు మించి మరొకటి ఏదైనా ఉన్నదా...!?
ఉంటే, అది సృష్టిలో అత్యంత దుర్బలుడిని కూడా అత్యంత బలవంతుడిగా చేయగలదా...!? విధి విలాసాన్ని కూడా మార్చగలదా...!? కర్మ విపాకము గురించి శ్రీ దేవి భాగవతం విస్తారంగా వివరిస్తుంది. శ్రీ దేవీ భాగవతం ప్రకారం,మాత సావిత్రికి సాక్షాత్తూ ధర్మదేవతా స్వరూపుడైన యమధర్మరాజు, కర్మ విపాకము గురించి విస్తారంగా వివరిస్తాడు. కర్మ విపాకము యొక్క ప్రధాన సూత్రాన్ని ( Ratio decidendi but not obiter dicta) మాత్రమే చెప్పుకోవాలి అంటే, ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి కానీ, అవి అన్నీ రెండు వర్గాలకు మాత్రమే చెందుతాయి.
1) మంచి, 2) చెడు.
మనం త్రికరణాలతో, అనగా మన మనస్సు వాక్కు శరీరములతో మరియూ కర్తృత్వ భావనతో చేసే కర్మలన్నీ కూడా, మంచి లేక చెడ్డ ఫలితాన్నిస్తాయి. నిజానికి కర్మ జడం. అది ఏ ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ కర్మ ఫలితాన్ని అనుభవింప చేసేది మాత్రం శ్రీ దుర్గా మాతయే అని శ్రీ దుర్గా సూక్తం "కర్మ ఫలేషు జుష్టామ్" అన్న మాటతో తెలియ చెబుతుంది .
శ్రీ దుర్గా అష్ట్తోత్తరంలో కూడా, "సర్వ కర్మ ఫలప్రధా" అన్న నామం ఉన్నది. కర్మ సిద్ధాంతం ప్రకారం, మనం అనేక జన్మలలో ఆచరించిన కర్మల యొక్క ఫలితాన్ని అంతా సంచితమనీ, దానిలో కొంత భాగము మనము ప్రస్తుతము తప్పనిసరిగా అనుభవించాల్సిన దానిని ప్రారబ్దము అని, మనము భవిష్యత్తులో అనుభవించవలసిన దానిని, ఆగామి అనీ శాస్త్ర వచనము. దీనినే విధి అంటారు, లేక కర్మ విపాకము అంటారు. "ఒక పక్క పాపపు రాశి, మరి ఒక పక్క పుణ్యపు రాశి" అని వాపోయాడు అన్నమయ్య. కర్మ విపాకమునుండి రక్షించునది, శ్రీ దుర్గా మాతయే కనుక "రోగపర్వత దంభోళీ మృత్యుదారు కుఠారికా". అన్న నామములు చెప్పారు వాగ్దేవతలు. కొన్ని రోగాలు కొంతమందిని, పర్వతాలు లాగా కూర్చొని బాధిస్తూనే ఉంటాయి. వీటినే మనం, క్రానిక్ డిసీజెస్ అంటాం.
దంభోళీ అనగా వజ్రం.
పర్వతాల రెక్కలను నరికింది వజ్రాయుధం. దీర్ఘకాలిక రోగాలు అనే పర్వతాలకు శ్రీదుర్గామాత నామం వజ్రం వంటిది, అటువంటి పర్వతాలను పిండి చేసేయగలదు. దారువు అంటే మొద్దు. జీవుల యొక్క మృత్యువు ఎలాంటిది అంటే, దారువు లాంటిది. అటువంటి దారువును పగలగొట్టి పారేయాలి అంటే, శ్రీదుర్గా నామము లాంటి పదునైన కుఠారికా కావాలి. కుఠారికా అనగా, గండ్రగొడ్డలి.దుర్గామాత జనన మరణ మనే భవ సాగరమును, "సుతర సితరసే నమః", సంపూర్ణంగా దాటించేస్తారని, దుర్గా సూక్తం చెబుతుంది.భక్తులకు జన్మ అంటూ లేకుండా చేసి, మృత్యువు యొక్క దారిని మూసేస్తుంది.భవదావ- సుధా వృష్టీ నామం నుండి మృత్యుదారు కుఠారికా నామం వరకు ఎనిమిది నామములు ఒక గుత్తిగా చెప్పారు వాగ్దేవతలు.శ్రీ మాత్రే నమః అన్న నామమును, ఈ ఎనిమిది నామములతో సంపుటీకరించి చేసే పారాయణము వల్ల, మన జాతకం ఇంకొకరికి చూపించుకోవలసిన పనిలేదు.
ఈ పారాయణం, సమస్త జాతక దోషాలను పరిహారింపగలదని మరియూ కర్మవిపాకము నుండి మనలను బయట పడవేయగలదని పెద్దలు చెప్పిన విషయం.శంకరులు, "సౌందర్యలహరి" లోని ఆరవ శ్లోకాన్ని, ఈ విషయాలనే వివరిస్తూ, ఇలా రచించారు."ధనుః పౌష్పం మౌర్వీ -మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో - మలయమరు దాయోధవరధః తధాప్యేకః సర్వం సిద్ధం - హిమగిరిసుతే కామపికృపామ్అ
పాంగా త్తే లబ్ద్వా - జగ దిద మనంగో విజయతే "
విధివశాత్తు, శివుని ఆగ్రహజ్వాలలో పూర్తిగా భస్మమై పోయాడు మన్మధుడు. మన్మధుడి యొక్క చితాభస్మము ద్వారా పుట్టుకొచ్చాడు బండాసురుడు.అమ్మవారు బండాసురుడిని కామేశ్వర అస్త్రం ప్రయోగించి పూర్తిగా దగ్ధం చేసేసారు.అలా మన్మధుడి యొక్క చితాభస్మం కూడా మిగలలేదు కానీ రతీదేవి ప్రార్ధనలను ఆలకించి, అమ్మవారు మన్మధుడిని రతీదేవి కనులకు మాత్రమే కనిపించేటట్లుగా తిరిగి బ్రతికించారు.
అమ్మవారు తన ఇచ్చానుసారం దేనిని ఎలాగైనా చేస్తారు!!!. ఆవిడని ప్రశ్నించే వారు లేరు. కనుకనే, "స్వతంత్ర" అనే నామం చెప్పారు వశిన్యాది వాగ్దేవతలు.జీవితము అనగా మనకు చేతగాని పనిని, కష్టమైన పనిని, ఇష్టంలేని పనిని కూడా చేయవలసి రావటం.అలాగే మన్మధుడి యొక్క జీవిత బాద్యత ప్రకారం, లోకంలో సర్వులనూ మోహపెట్టాలి.కానీ, మన్మధుడు యొక్క ధనస్సు"ధనుః పౌష్పం"అనగా పుష్ప ధనస్సు ( మన్మధుని ధనస్సు ఇక్షుదండం అనేది లోక ప్రసిద్ధం. కానీ, ఇక్కడ శంకరులు దానిని పుష్ప ధనస్సుగా చెప్పారు)"మౌర్వీ మధుకరమయీ" , అనగా మన్మధుడి యొక్క వింటినారిఏమో తుమ్మెదలు. "పంచ విశిఖాః " అనగా మన్మధుడి యొక్క పువ్వుల బాణములు కూడా ణదే, ఆరవది లేదు.
"వసంతః సామంతో", ఇక తన చెలికాడు వసంతుడు. కేవలం వసంత ఋతువులో మాత్రమే మన్మధుడికి సహాయం చేస్తాడు. "మలయమరు దాయోధవరధః" , అనగా,ఇక మన్మధుడికి యుద్ధం చేయడానికి ఉపయోగించే రథము మలయమారుతం. ఇది కేవలం మలయ పర్వతము దగ్గరే పనిచేస్తుంది.
ఇక మన్మధుడేమో ఒంటరి వాడు. అసలు శరీరమే లేనివాడు. అతని ఆయుధములు, రధము, చెలికాడు, అందరూ కూడా బలహీనులే. (హిమగిరిసుతే కామపి కృపామ్ అపాంగా త్తే లబ్ద్వా - జగ దిద మనంగో విజయతే )
నీ మన్మధుడు లోకాన్ని మొత్తం జయించాడు. కారణం హిమగిరిసుతే..!! అనగా హిమవంతుని పుత్రిక అయిన పార్వతీ మాత యొక్క ఆరాధన ఫలము అది. కాబట్టి ఈ శ్లోకము ద్వారా, శంకరులు మనకు ఏమి చెబుతున్నారు అంటే, "అంతా నా ప్రారబ్ధం అని కూర్చోకుండా, అమ్మవారిని ఆశ్రయించు!!! అమ్మవారిని ఆశ్రయించు !!! " అని. తద్వారా విధిని కూడా మనం జయించవచ్చు అని.
శ్రీ శంకర భగవత్పాద విరచిత
సౌందర్య లహరి.
సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది.
శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే
- శివకుమార్ రాయసం