అమ్మవారి యొక్క కుండలిని సుధాధార
శంకరులు, "సౌందర్యలహరి" లోని పదవ శ్లోకాన్ని, అమ్మవారి యొక్క కుండలిని సుధాధారను వివరిస్తూ, ఇలా రచించారు.
"సుధాధారాసారై - శ్చరణయుగళాంతర్విగళితై
ప్రపచం సించంతీ - పునరపి రసామ్నాయమహసా
అవాప్య త్వాం -భూమిం భుజగనిమధ్యుష్టవలయం
స్వమాత్మానం కృత్వా - స్వపిషి కులకుండే కుహరిణి"
సహస్రారమునుండి, అమ్మవారు తన పాదముల నుండి కురిపించే అమృతధార యొక్క జడివానచేత, జీవుడి ఉపాదిలోని 72 వేల నాడులలో స్రవింపచేసి, స్వస్దానమైన తన మూలాధారానికి చేరుతారు. అలా అమృత ధారలలో తడిసే దాకా జీవుడి యొక్క జీవ తాదాత్మ్యము తొలగదు. ఎప్పటిదాకా అది జరగదో, అప్పటిదాకా జీవ బ్రాంతి తొలగదు. అనగా మాయ తొలగదు. ఇదే వేదాంతంలో సర్ప భ్రాంతిగా చెప్పబడింది. చీకటిలో పామే, వెలుతురులో తాడుగా మారిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే...!? , పాము ఎక్కడికి పోయింది....!? సరియైన జవాబు ఏమిటంటే.. !?, పాము అసలు ఎప్పుడూ లేదు. అది కేవలం బ్రాంతి మాత్రమే. అనగా వెలుతురు వల్ల పోయింది బ్రాంతి కానీ, పాము కాదు. కాబట్టి, మాయ అనే లేనిదానిని జయించటం ఏమిటి.....!? తొలిగించాలి....!!
అసలు ఉన్నదో !! లేదో !!! తెలియని దానిని ఉంచాలా..!? వద్దా ..!? అన్న చర్చ ఏమిటి...!? విషయం అంత జటిలమైనది. ఆధ్యాత్మికమనేది లౌకిక విద్య లాంటిది కాదు. పొందవలసినది కుండలిని సాధన ద్వారా అమ్మవారి నుండి అమృతము అనే విషయము, శ్రీ లలితా సహస్ర నామములో వాగ్దేవతలు చెప్పిన "సుధాసారాభివర్షిణీ" "సుధాసృతిః" అన్న నామములు ద్వారా, శంకరులు చెప్పిన ఈ శ్లోకము ద్వారా, మనకు తెలిసింది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు, తెలియటం వేరు మరియు పొందటము వేరు. మన వజ్రపు ఉంగరం ఎక్కడో పడిపోయింది దాని కోసం వెతుకుతూ ఉన్నాము.ఎలావెతుకుతున్నాము అంటే, మన వజ్రపు ఉంగరం కోసం వెతుకుతున్నాము అన్న జ్ఞానముతో వెతుకుతాం లేకపోతే అది దొరకదు. అలా వామకేశ్వరతంత్ర గ్రంథములలో చెప్పబడినట్లు కుండలిని సాధన చేయవలసి ఉంటుంది..
కుంభకముతో ( అనగా మనసును నిలిపి, తన ప్రాణ వాయువును లోపల నిలిపి ఉంచగలగటం) అగ్నిని జ్వలింప చేసి, బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంధులను అనగా ముడులను చేదించి, ఆరు చక్రములను దాటి సహస్రారమునకు చేరాలి. అప్పుడు మాత్రమే వాగ్దేవతలు మరియు శంకరులు చెప్పిన అమృతము అమ్మవారి పాదముల నుండి మనకు లభించేది.
నమస్కారం!!! ఇదంతా మన వల్ల అయ్యే పనికాదు.
నమస్కారం మంచిదే కాని తిరస్కారం మంచిది కాదు. అమ్మవారు ఎవరని వశిన్యాది వాగ్దేవతలు చెప్పారు అంటే, "భక్తిప్రియా, భక్తిగమ్యా,భక్తివశ్యా,భయాపహా" మంత్రము, యంత్రము, తంత్రము, ఏమీ అవసరం లేనే లేదు. "తైల ధారవలే దుర్గా నామమును స్మరించినవారిని, మణిద్వీపమునకు చేర్చి, శ్రీ దుర్గా మాత వారు కోరినట్లుగా, జ్ఞాన మండపములో జ్ఞానమును, లేక మోక్ష మండపములో మోక్షమును ప్రసాదిస్తారు" అని శ్రీ దేవీభాగవతం స్పష్టం చేస్తున్నది. శ్రీ శంకర భగవత్పాద విరచిత సౌందర్య లహరి. సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది.
శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే
- శివకుమార్ రాయసం