Online Puja Services

కాలిన పాదాలు - కరక్కాయ లేపనం

18.119.213.36
పరమాచార్య స్వామివద్దకు మౌళి మామ పరిగెత్తుకుంటూ వచ్చారు. మామ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎలా భరించడం? అసలు ఎలా భరించడం? దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనను ఇప్పుడు తలచుకున్నా మామ కళ్ళల్లో కన్నీటి ధార. అసలు ఎందుకు అలా జరిగింది? అలా జరుగుతుందని ఎలా అనుకోగలం?

అందుకోసం, 1900 దశాబ్దం మొదట్లో తిండివనంలో జరిగిన సంఘటనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ స్వామినాథన్ అనే చిన్న పిల్లవాని జాతకం పరిశీలించి, ప్రపంచాన్ని సక్రమమైన మార్గంలో నడిపేందుకు వచ్చిన అవతారం అని అర్థం చేసుకున్నారు. ఆ పిల్లవాని పాదములను తాకి, నీళ్ళతో కడిగి, శుభ్రంగా తుడిచి, బాగా పరిశీలించి “అతి త్వరలోనే రాజులు, రారాజులు కూడా ఈ పాదాలను తాకలేరు” అని చెప్పారు. ఆ పిల్లవాని పాదాలలో ఎన్నో చక్రాల గుర్తులను చూశారు. ఈ బాలుడు జగద్గురువు అవుతాడు అని చెప్పారు.

పరమాచార్య స్వామీ వారు ఉదయార్ పాల్యంలో మకాం చేస్తున్న సమయం. మహాస్వామి అప్పుడు వారు బాల సన్యాసి. వారు అనుష్టానం చేసుకుంటూ ఉండగా ఉదయార్ పాల్యం రాజు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఆయన మంచి పండితుడు. స్వామివారు చేస్తున్నది నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆశ్చర్యంతో “మీరు సాక్షాత్ దైవ స్వరూపులు. మీ పాదాలలో చక్రాలు ఉన్నాయి” అన్నారు.

అప్పటి నుండి పరమాచార్య స్వామివారి పల్లకిని మోసే బోయీలు ఉదయార్ పాల్యం జమిందారి వాళ్ళే. వారిని పోషిస్తున్నది ఆ జమిందారిలే. శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ గారు చెప్పినట్లు ఆ రాజు గారు కూడా పాదాలలోని చక్రాలను దర్శించుకొన్నారు కాని తాకలేకపోయారు.

అది 1978 ఏప్రియల్ 14 లేదా 15. పరమాచార్య స్వామివారు తేనంబాక్కం నుండి యాత్ర మొదలు పెట్టారు. కాని ఆ యాత్ర ఎక్కడ ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఎవ్వరికి తెలియదు. అది యాత్ర అని కూడా ఎవరికీ తెలియదు. ఎనభై ఏళ్ల ప్రాయంలో కేవలం శ్రీ చంద్రమౌళి మామ (కుళ్ళ), శ్రీ వేదపురి మామ, శ్రీ శ్రీకంఠన్ మామ ముగ్గురు సేవకులతో నడుతున్న యాత్ర అది.

తెల్లవారుఝామున 3:45 అప్పుడు చిత్తూరు శివార్లలో గల థియోసాఫికల్ సొసైటి ప్రాంగణంలోకి వచ్చారు. మహాస్వామీ వారు పూజకోసం ఒక మామిడి చెట్టు క్రింద కూర్చున్నారు. సేవకుల భిక్షకై మౌళి మామ శ్రీకంఠన్ మామ మూడు కిమీ దూరంలో గల ఆగ్రహారానికి వెళ్ళారు. కొద్దిసేపటి తరువాత అంటే సుమారు పదకొండు గంటల సమయంలో వారి తిరిగి రాగా అసలు ఆ ప్రాంగణంలోకి వెళ్ళడానికి కూడా కుదరలేదు. చాలా మంది గుమిగూడి ఉన్నారు. అందరూ పరమాచార్య స్వామివారి చుట్టూ చేరి వారి పాదాలు తాకడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎవరో ఎవరికీ తెలిసినట్టు లేదు. కాని వారికి పట్టదు కదా!

అక్కడే ఉన్న ఇద్దరు సేవకులకి వారిని నిలువరించడం చాలా కష్టంగా ఉంది. పరమాచార్య స్వామివారు కనీసం పాదుకలు కూడా వేసుకోకుండా, అంతటి ఎండలో ఆ ప్రాంగణాన్ని వదిలి హైవే మీదకు పయనమయ్యారు. అంతే! ఇద్దరు సేవకులు మహాస్వామి వారితో బయలుదేరిపోయారు. చివరి క్షణంలో అక్కడకు వచ్చిన మౌళి మామ, శ్రీకంఠన్ మామ భిక్షగా తెచ్చినదంతా అక్కడ వేసి, రిక్షా తీసుకుని మొత్తం సామాను అంతా పెట్టుకుని స్వామి దగ్గరకు పరిగెత్తారు.

అది చైత్రమాసం అందులా చిత్తూరు జిల్లా కావడంతో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అంతటి ఎండలో మిట్టమధ్యాహ్నం పాదుకలు కూడా లేకుండా నడుస్తున్నారు స్వామివారు. న్యాయవాది జ్యోతిష్కులు శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ ఏ పాదాలనైతే ఎవ్వరూ తాకలేరు అన్నారో, రాజులు - రాణులు కూడా కేవలం దర్శనం మాత్రమే చేసుకోగలరో, యోగులు సిద్ధులు కూడా తాకే అర్హత లేకపోవడంతో కేవలం ధ్యానం మాత్రమే చేయగల ఆ పాదాలు ఆ తారు రోడ్డుపై నడవడంతో కాలిపోయి బొబ్బలు లేచాయి.

మకాం చిత్తూరు చేరుకుంది. మహాస్వామివారు ఒక కర్మాగారంలోకి నడిచారు. అక్కడ కొద్దిరోజులు బస చేశారు. రాత్రికి స్వామివారు “వేదపురి, కుళ్ళా మౌళిని పిలువు” అన్నారు. మౌళి మామ కరక్కాయని చక్కగా చూర్ణం చేసి లేపనంగా తయారుచేశాడు. పరుగు పరుగున వచ్చి ఎవరికి దొరకని ఆ పాదాల దగ్గర కూర్చున్నాడు. పరమాచార్య స్వామివారు కాళ్ళను బాగా చాపి “ఆ కరక్కాయ ముద్దని కాళ్ళకు రాయి” అని ఆదేశించారు. ఈ విషయం చెబుతూ ఇప్పుడు కూడా మామ మాటలు రాక గొంతు పూడుకుపోయి కళ్ళ నీరు పెట్టుకుంటాడు.

ఏమి ఈ సేవకుల భాగ్యం. ఒక్క పుష్పం స్వామివారికి సమర్పించి చాంతాడంత కోరికలు కోరుకుంటాము. కాని వీళ్ళు కేవలం స్వామివారి సేవ చేసుకోవడమే మహాద్భాగ్యంగా తలుస్తున్నారు. ఆ పరమాచార్య సేవకులకు అనంతకోటి సాష్టాంగ నమస్కారాలు.

ఆ పరమాచార్య సేవకులకు అంగప్రదక్షిణ నమస్కారాలు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore