Online Puja Services

అన్నవరం సత్యదేవుని కళ్యాణం

3.144.87.230
అన్నవరం సత్యదేవుని కళ్యాణం
 
అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామివారి కళ్యాణ మహోత్సవములు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా, స్మార్తాగమరీతిలో ఆపస్తంబ సూత్రరీత్యా మహావైభవంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు. 
 
శ్రీ సత్యనారాయణ స్వామివారిని
*" మూలతో బ్రహ్మరూపాయ*
*మధ్యతశ్చ మహేశ్వరం*
*అధతో విష్ణురూపాయ*
*త్ర్త్యెక్య రూపాయతేనమః "* అని స్తుతిస్తారు.
 
క్రీ.శ. 1891లో ఆ ప్రాంతానికి రాజైన శ్రీ రాజా ఇనుగంటి వేంకట రామానారాయణిం బహద్దూరువారి కలలో సత్యదేవుడు కనిపించి నేను రత్నగిరిమీద వెలుస్తున్నాను.. శాస్త్ర ప్రకారం ప్రతిష్టించి పూజించమని చెప్పాడు. ఆ రాజు సంతోషంతో అందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి వెతికి, ఒక పొదలో స్వామి విగ్రహాన్ని చూసి అమితానందం చెందారు. కాశీనుండి మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని తెప్పించి 1891, ఆగస్టు 6వ తారీకున ప్రతిష్టించి, ఆ యంత్రంపై స్వామిని దేవేరియైన అనంతలక్ష్మీ సత్యవతీ సమేతంగా ప్రతిష్టించారు. హరి హరులకు బేధం లేదని నిరూపిస్తూ సత్యన్నారాయణ స్వామి ప్రక్కనే ఈశ్వరుడుకూడా పూజలందుకుంటూంటాడు.
 
ఆలయ నిర్మాణం 1934 లో జరిగింది. ఆలయ నిర్మాణం రెండు అంతస్తులలో జరిగింది. క్రింది భాగంలో నారాయణ యంత్రం, పై అంతస్తులో దేవతా మూర్తులు. ప్రధాన ఆలయం రధాకారంలో నాలుగువైపులా చక్రాలతో నిర్మింపబడింది. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తుంటుంది. ఈ స్వామిని మూలం బ్రహ్మ, మధ్య భాగం ఈశ్వరుడు, పై భాగం మహ విష్ణువుగా, త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఆంధ్రులు అన్ని శుభకార్యాల్లో కొలిచే దేవుడు శ్రీ సత్యన్నారాయణ స్వామి. ఆయన వ్రతం ఏదో ఒక సందర్భంలో చెయ్యనివారు అరుదేమో. మరి సాక్షాత్తూ ఆ స్వామి సన్నిధిలోనే ఆయన వ్రతం చేసుకోవటంకన్నా భాగ్యమేముంటుంది.
 
అన్నవరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామము. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. ఈ గ్రామం లోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం - విజయవాడ రైలుమార్గం లో వస్తుంది. అన్నవరం ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం. తూర్పు గోదావరి జిల్లా లో శంఖవరం మండలానికి చెందిన గ్రామము. ఈ ప్రాంతం ప్రతి నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే కార్తీకమాసంలో ఇచ్చట కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు.
 
స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహం తో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి కి నివాస స్థానమైన భద్రాచలం గా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి గా వెలసే రత్నగిరి, లేదా రత్నాచలం కొండగా మారుతాడు.
 
పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం అయి ఒక శతాబ్దము పైగా మాత్రమే ఐనా చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో పంపా నది హోయలొలుకుతూ పారుతుంటుంది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ని దర్శించేందుకు గుడివరకు ఘాట్ రోడ్డు నిర్మించారు. మెట్లు గుండా కూడ వెళ్ళవచ్చు. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండువగా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత.
 
పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి.ప్రధాన ఆలయం రథాకారం లో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాల తో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణం లో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉండాలి.
 
త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తు లో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది.
రత్నగిరి పై ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణమే.
 
* శ్రావణ శుద్ధ విదియ - శ్రీసత్యనారాయణస్వామి జయంతి.
* వైశాఖ శుద్ద దశమి-వైశాఖ బహుళ పాఢ్యమి( ఐదు రోజులు) శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి.
* వైశాఖ శుద్ధ ఏకాదశి- స్వామివారి కళ్యాణం
* చైత్ర శుద్ధ పాడ్యమి - ఉగాది - పంచాగశ్రవణం
* శ్రీరామనవమి - చైత్ర శుద్ధ నవమి - శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలు
* చైత్ర బహుళ షష్ఠి - కనక దుర్గమ్మ జాతర
 
* సరస్వతీ పూజ
* శ్రీకృష్ణాష్టమి- శ్రీ కృష్ణ జయంతి
* వినాయక చవితి - 
* దేవీ నవరాత్రులు - యంత్రాలయం లో లక్ష కుంకుమార్చన
* విజయదశమి
* దీపావళి
* కార్తీక పౌర్ణమి - గిరి ప్రదక్షిణ - జ్వాలాతోరణం
* కార్తీక శుద్ధ ద్వాదశి - తెప్పోత్సవం
* మహాశివరాత్రి - లక్ష బిల్వార్చన
 
* స్వామి దర్శన వేళలు ఉదయం 6 గం నుండి రాత్రి 8 గం వరకు.
 
* అన్ని వర్గాల వారికి వసతి భోజన సదుపాయాలు ఉన్నాయి.
 

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore