విష్ణువు నామాల్లో ఆదిత్యుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు ?
విష్ణువు నామాల్లో ఆదిత్యుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు ?
- లక్ష్మి రమణ
విష్ణు సహస్రనామాలు మనకి దొరికిన ఒక పెన్నిథి లాంటివి. అందులోకి తొంగి చూడాలేకానీ, వెలకట్టలేని విష్ణుభగవానుని దివ్య వైభవము అనే రత్నాలు, మణులు ఎన్నో లభ్యం అవుతాయి. ఒక్కొక్క నామమూ అనంతమైన శక్తి ప్రదాయకము. అనంతుని అనుగ్రహహన్ని అందుకొనే అవకాశాన్నిచ్చే అమృతోపమానము. అటువంటి నామాలలో ఆదిత్యః అనే నామం ఒకటి. విష్ణువు నామాల్లో ఆదిత్యుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు ?
స్వయమ్భూశ్శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥
అని విష్ణుసహస్రనామాల్లోని 5వశ్లోకం.
తనకు తానుగానే ఉద్భవించినవాడు - స్వయంభువు. సృష్టిలోని దృశ్యాదృశ్య స్వరూపాలన్నీ తానె అయ్యుండి, తనని తానె సృజియించుకున్న శంభుడు ఆదిత్యుడు. శంభుడు అంటే ‘శం సుఖం భక్తానాం భావయతీతి శంభుః’ అని కదా అర్థం. భక్తులకు సుఖమును కలిగించువాడు, అంతఃకరణమునకు, బాహ్యమునకు శుభములను అనుగ్రహించేవాడు ఎవరున్నారో అతను ఆదిత్యుడు. ఆదిత్యునిలో దాగిన ఆ మూలపుషుడెవ్వడు ? తెలుసుకోవడానికి ఈ పదాన్ని అర్థం చేసుకోవాలి.
ఆదిత్యః
ఓం ఆదిత్యాయ నమః | అని ఆదిత్యుని తలుస్తాము కదా !
ఆదిత్యః - అంటే సూర్య మండలాతర్భాగములో ఉన్నటువంటి హిరణ్మయ పురుషుడు. ఆదిత్యే భవః - ఆదిత్యుని యందు ఉండువాడు అని అర్థం. దీన్నే ఇంకొకలాగా చెప్పుకుంటే, ఆకాశంలో మనకి కనిపించే సూర్యుడు ఒక్కడే . కానీ, ఆయన ఒక్కడే అయినా , అనేకమైన జలము నిండిన తావుల్లో, పాత్రల్లో అనేకానేకములై ప్రతిబింబిస్తున్నాడు కదా ! అదే విధంగా పరమాత్మ - ఆత్మస్వరూపమై అనేక శరీరములయందు అనేకులవలె ప్రతిభాసిస్తూ ఉన్నాడు. అటువంటి వాడు ఆదిత్యుడు. అదితీమాతకి జన్మించినటువంటివాడు.
ఆయనే వేదములద్వారా తెలుసుకోదగిన పద్మముల వంటి కన్నులకలవాడు, వేదనాదము, వేదం కంఠము, గంభీరమైన వేదస్వరమూ అయినవాడు, జన్మమూ, నాశనము లేనివాడు, ఈ విశ్వాన్ని నిర్మిస్తున్నవాడూ, భరిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు, ధాతువై , అనేకరూపాల్లో ప్రభవించి రక్షిస్తున్నవాడూ అయిన పరమాత్మ ని సంపూర్ణ అర్థం.
భగవద్గీత - విభూతి యోగము లో పరమాత్మ తానే ఆదిత్యుడనని చెబుతూ ఇలా చెప్పారు.
ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ ।
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ॥ 21 ॥
నేను ఆదిత్యులలో విష్ణువనువాడను. (1. ధాత, 2. మిత్రుడు, 3. అర్యముడు, 4. శక్రుడు, 5. వరుణుడు, 6. అంశువు, 7. భగుడు, 8. వివస్వంతుడు, 9. పూష, 10. సవిత, 11. త్వష్ట, 12. విష్ణువు) ప్రకాశింపజేయువానిలో కిరణములుగల సూర్యుడను, మరుత్తులలను దేవతలలో మరీచియనువాడను, నక్షత్రములలో చంద్రుడను. అని చెబుతారు. అందుకే విష్ణు నామాల్లో ఆదిత్యుని ప్రస్తావన. ఆ ఆదిత్యునిలో దాగిన స్వర్ణ దేహుడు పరమాత్ముడైన, వేదస్వరూపమైన విష్ణువు.
కాబట్టి ఆదిత్యుడు అంటే పరమాత్మ స్వరూపమైన విష్ణువు. మనందరిలోనూ నిండి ఉన్న ఆత్మ స్వరూపము. ఆ ఆదిత్యుని ప్రార్ధించడం అంటే సాక్షాతూ పరమాత్మని ప్రార్ధించడమే. పోషకుడు ఎవరున్నారో ఆయనేకదా మన పోసనకి కావలసినవి అనుగ్రహించేవాడు . కాబట్టి మనం అనుగ్రహించేవాడినే వేడుకుంటున్నాం. ఖచ్చితంగా సరైన అధికారిని కలిస్తే, కావలసిన పని నెరవేరినట్టు, కావలసిన కామ్యములన్ని అనుగ్రహిస్తారు ఆ ఆదిత్య భగవానుడు. కేవలం ఇహానికి సంబంధించిన కోరికలు మాటమే కాదు, దహరాకాశంలో నిలిచినా ఆత్మ స్వరూపుడైన ఆ సూరీడు మనల్ని పరంజ్యోతి మార్గంలో నడిపిస్తాడు .
శుభం.
Vishnu Sahasra Namam
Surya Bhagavan
#vishnu #surya #aditya