సూర్యారాధన మినహా మరో మార్గం లేదు .
మానవుడు తరించడానికి సూర్యారాధన మినహా మరో మార్గం లేదు .
- లక్ష్మి రమణ
భారతీయ వాంగ్మయం యొక్క సనాతన పరంపరలో సూర్య భగవానుని స్థానము మహిమ కూడా అద్వితీయం. స్మృతి, పురాణాదులు, రామాయణ, భారతాదులు కూడా సూర్య మహిమ వల్ల పరిప్లతమై ఉన్నాయి. సూర్య భగవానుడు మనకు ప్రత్యక్ష దైవం. మన సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి, మనము అనేక దేవత మూర్తులను సేవిస్తున్నాం. కానీ మనకు ఆ మూర్తులన్నీ వేద, ఉపనిషత్తు, పురాణాదులలో వివరించబడినటువంటి విషయాల ఆధారంగా కనిపిస్తున్నారు.
సౌర శక్తికి చెందిన విజ్ఞానము ఎంతో, వేదంలోని సూర్య మంత్రాలలో నిక్షిప్తమై ఉంది. సూర్యుడు ప్రతిరోజూ ప్రత్యక్షంగా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తున్న దైవం. సమస్త విశ్వానికి ఆయనే ఆత్మ . సూర్యోపనిషత్తులోని ఒకటి నుంచి నాలుగు సర్గలను అనుసరించి, సూర్యుడు సమస్త ప్రాణిజాతమును ఉత్పత్తి చేస్తున్నాడు, పోషిస్తున్నాడు. అంతములో తనలోనే లయం చేసుకుంటున్నాడు అని మనకు తెలుస్తుంది.
విజయ ప్రాప్తి, ఆరోగ్య లాభము, రోగ నివారణార్థం వివిధ అనుష్టానాల ద్వారా సాధకులు సూర్యభగవానుడిని ఆరాధించాలి. సూర్యసబ్దానికి పెద్దలు చెప్పిన ఉత్పత్తిని చూసినట్లయితే, తన ఉదయం చేతనే, లోకాలన్నింటినీ ఆయా కర్మలయందు ప్రేరేపించేటటువంటి వాడు కాబట్టి అతడు సూర్యుడు. అందుకే ఆయన్ని జగత్ చక్షువు , కర్మసాక్షి అన్నారు .
ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడే మనం చేసే సమస్త శుభా శుభశుభకర్మలకు సాక్షి. కాబట్టి మనం ఆచరించే కర్మలు శుభకరములు, పుణ్యప్రదాయాలు అయి ఉండాలి. అందుకోసం ఎల్లప్పుడూ కూడా శుభ కర్మలను ఆచరించే అదృష్టాన్ని ప్రసాదించమని మనం సూర్యుణ్ణి వేడుకోవాలి.
‘ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపము. ఆయనని ఆరాధించడమే మానవునికి పరమ కర్తవ్యం.’ అని వేద శాస్త్రాలన్నీ ముక్తకంఠంతో ప్రబోధించాయి. సూర్యుడే కాలచక్ర ప్రణీత. సూర్యుడి వలన షడ్రుతువులు ఏర్పడ్డాయి. సమస్తానికి కారణభూతుడైన పరమాత్మ సూర్యుడే! కనుకనే ‘ఓం ఆదిత్యాయ విద్మహే, సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్’ అనే సూర్య గాయత్రీ మంత్రంతో నిత్యం ఆయనను ఆరాధించాలి. ఇది సూర్యునికి పరమ ప్రీతికరమైన మంత్రం.
అలాగే జపవిధి కోసం కూడా ఒక విశేషమైన అష్టాక్షరి మంత్రాన్ని బోధించింది సూర్యోపనిషత్తు. సూర్య మంత్రాన్ని జపించడం వల్ల మహా వ్యాధుల యొక్క పీడ నుంచి విముక్తి లభిస్తుంది. ఆపదల్లో చిక్కిన పాపాల్లో కూరుకుపోయిన అటవీ మధ్యలో దిక్కు తోచక , కర్తవ్య మూఢయై ఉన్న పురుషుడు సూర్య భగవానుడిని ఆరాధించినట్లయితే ఏ విధమైనటువంటి బాధలనుండైనా బయటపడతాడు. సమస్త దుఃఖాలను అధిగమిస్తాడని వివరిస్తుంది రామాయణం .
ఆకాశం యొక్క అధిపతి విష్ణువు. అగ్నికి అధిరాజ్ని మహేశ్వరి. వాయు తత్వానికి అధిపతి సూర్యుడు. పృద్వికి అధిపతి శివుడు. జలాధిపతి గణపతి. ఈ విధంగా కపిల తంత్రం బోధించిన పంచదేవో పాసనను తెలుసుకొని భువన భాస్కరుని గాయత్రీ మంత్రం ద్వారా ఉపాసన చేస్తే సమస్త దుర్దశలు, పటాపంచలవుతాయి.
ఆ శ్రీమన్నారాయణ డే సవిత్రు మండల మధ్యవర్తి అయి ఉన్నాడు . దానిని గ్రహించి’ ఓం నమో నారాయణాయ’ అని అష్టాక్షరీ మంత్రాన్ని స్మరిస్తూ , అర్ఘ్య ప్రధానం చేసి మనసును పవిత్రంగా ఏకాగ్రంగా నిలిపి భక్తి పూర్వకంగా ప్రతిరోజు ఉదయం 108 సార్లు ఆ అష్టాక్షరిని జపిస్తే, సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది.
సూర్యుడు కాలాత్మ. కాలస్వరూపం అని ఋగ్వేదం స్పష్టం చేస్తోంది. అంటే ఈ కాలాత్మ యొక్క రధము విశిష్టమైంది, విలక్షణమైనది. గమన శీలత కలిగినది కాబట్టి దాన్ని రధము అన్నారు. అది నిరంతరము ఆగకుండా నడుస్తూనే ఉంటుంది. ఆ రథానికి సంవత్సరాత్మ ఒకేచక్రం. . అహోరాత్ర స్వరూప నిర్వహణార్థం దానికి సప్తస్వాలు కట్టబడ్డాయి. ఈ సప్తశ్వాలు ఏడు వారాలు కానీ వాస్తవానికి ఆ ఏడుగా ప్రభావిస్తున్న అశ్వము ఒకటే. ‘ఏకో అశ్వవాహతి సప్త నామ’ అని చెప్పారు. ఆ ఒకే ఒక అశ్వానికి 7 పేర్లు ఉండడం చేత సప్తాశ్వం అంటున్నారు. ఆ ఏక అశ్వం పూన్చిన రథానికి ఉండే ఏక చక్రానికి భూత భవిష్యత్తు వర్తమానాలు అనే మూడు నాభులుంటాయి. ఆ రథం అజరామరం. అంటే వినాసం లేనటువంటిది. ఇటువంటి ఏడు అశ్వాలు కలిగినటువంటి రథాన్ని అధిరోహించిన భువన భాస్కరుని దర్శనం చేసుకున్నటువంటి మానవుడికి పునర్జన్మ లేదని పురాణాలు చెబుతున్నాయి.
వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో ఆదిత్య హృదయం కనిపిస్తుంది. అందులో సూర్య భగవానుడి విరాట్ స్వరూపం గోచరిస్తుంది. సమస్త దేవతలు ఒకే చోట మూర్తి భవించిన దైవమే సూర్య భగవానుడని తెలుస్తుంది. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సూర్యనారాయణున్ని స్మరించుటము, కీర్తించడము వలన దుఃఖాలు తొలగి శాంతి లభిస్తుంది.
సూర్యుడు అదితీ పుత్రుడు. అందువల్ల ఆదిత్యుడు అని పిలిచారు . “ఆదిత్యా నామాహం విష్ణుః’ అని కృష్ణ పరమాత్మ ఉవాచ. వేదాలు సమస్త జగత్తుకి ఆత్మ స్వరూపంగా సూర్యుడు ఉన్నాడు అని చెబుతున్నాయి . అటువంటి ఆత్మ రూపుని, ఆదిత్య దేవుని శుక్ల యజుర్వేదం ఈ విధంగా కీర్తిస్తుంది.
ఆదిత్య స్వరూపుని మహానుభావునిగా, వేదాంత మూర్తిగా, పెను చీకటి కవ్వలి వానిగా అంటే పరిపూర్ణ ప్రకాశ స్వరూపునిగా సూర్యభగవానుడిని నేను తెలుసుకుంటున్నాను. ఇటువంటి సూర్య దేవుని తెలుసుకున్న మానవుడు మృత్యువు నుంచి తరిస్తాడు. కనుక మోక్ష ప్రాప్తికి సూర్యారాధన మినహా మరో మార్గము లేదు.
సూర్యారాధన కోసం సూర్య నామాలు:
మిత్రాయ నమః
రవయే నమః
సూర్యాయ నమః
భానవే నమః
ఖగాయ నమః
పూష్ణే నమః
హిరణ్యగర్భయ నమః
మరీచినే నమః
ఆదిత్యాయనమః
అర్కాయ నమః
సవిత్రే నమః
భాస్కరాయ నమః
సూర్య నారాయణాయ నమః
పూజ్య గురుదేవులు, సమన్వయ సరస్వతి, శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి దివ్య ప్రవచనం నుండీ, నమస్సులతో .
#surya #suryaaradhana #suryanamaskar
Tags: surya, sungod, sun god, surya aradhana, namaskaram, namaskar