మాసమేదైనా సూర్యారాధన ఎందుకు చేయమంటారు ?
మాసమేదైనా సూర్యారాధన ఎందుకు చేయమంటారు ?
- లక్ష్మీరమణ
సూర్యుడు ఒక జ్యోతిర్మండలం. ఆయన చుట్టూ భూమి తిరుగుతోంది , వాటి వాటి కక్షల్లో భూమితో సహా ఇతర గ్రహాలూ తిరుగుతున్నాయి . మనం నివశించే భూమే ఆ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అలా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండడం వలననే ఉత్తరాయణం , దక్షిణాయనం అనే కాల ప్రమాణాలు ఏర్పడ్డాయి . సంక్రాంతి రోజు నుండీ ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతోంది .
ఆదిత్యుని ప్రకాశం ఈ భూమి మీద ప్రసరించే ఈ రెండు కాలాలోని వైవిధ్యాన్ని మనం ప్రకృతిలో గమనించవచ్చు . నిజానికి మనం చూస్తున్న సూర్యుడు ఒక్కడే ఉన్నాడా అంతరీక్షంలో అనేది కూడా విషయం . ఇటువంటి అనేకమైన సూర్య మండలాలు అంతరిక్షంలో ఉన్నాయి . అయితే, మనకి వెలుగుని పంచుతూ , మన జీవికకి కారణమవుతున్న, ఈ భూమికి చెందిన ఆదిత్యుని గురించే మనం మాట్లాడుకుంటున్నాం .
ఇక్కడ మనకి కనిపించే సూర్యుడు ఒక్కడే. కానీ ఆయన ఈ భూమి మీదికి ప్రసరించే కిరణాలు అద్భుతమైనవి . ఋషులు తమ దర్శనా ప్రతిభ చేత వాటిని విశ్లేషించి పలు కిరణాలకి ప్రత్యేకమైన నామాలని పెట్టారు. వారిని వేదయుక్తంగా దేవతా స్వరూపాలుగా ఆరాధించడం కూడా మనకి సంస్కృతిలో ఉన్నది .
అయితే ఇక్కడ పృథ్వికి ప్రకాశాన్నిస్తున్న సూర్యుని ప్రకాశాన్ని అనుసరించి ఒక్కొక్క నెలలో ఒక్కో పేరుతొ సూర్యారాధన చేయాలని వేదం చెబుతోంది . ఈ విధంగా మనకి ద్వాదశ ఆదిత్యులు (12 మంది ) పన్నెండు నెలలకీ పన్నెండు నామాలతో కనిపిస్తారు . ఈ విధంగా కాలాన్ని అనుసరించి సూర్యుణ్ణి ఆయా రూపాల్లో ఆరాధించడం వలన అనంత ఫలితాలు సిద్ధిస్తాయి . ఆ ద్వాదశ ఆదిత్యరూపాలు ఇవీ !
‘ధాత’ అనే పేరుతో చైత్ర మాసంలో ఆరాధన చేయాలి.
‘ఆర్యముడు’ అనే పేరుతో వైశాఖమాసంలో అర్చించాలి.
‘మిత్రు’నిగా జ్యేష్ఠ మాసంలో ఆరాధించాలి .
‘వరుణుడు’ అనే నామంతో ఆషాఢంలో పూజించాలి .
‘ఇంద్రుని’గా శ్రావణ మాసంలో సూర్యారాధన చేయాలి .
‘వివస్వంతు’నిగా భాద్రపద మాసంలో అర్చించాలి.
‘త్వష్ట’గా ఆశ్వీయుజ మాసంలో ఆరాధించాలి .
‘విష్ణువు’గా కార్తీకమాసంలో కొలుచుకోవాలి .
‘ఆర్యముని’గా మార్గశిరమాసంలో ఆరాధించాలి .
‘భగుడు’ అనే పేరుతొ పుష్యమాసంలో పూజించాలి .
‘పూష’ పేరుతొ మాఘమాసంలో అర్చించాలి .
‘క్రతువు’ అనే పేరుతొ ఫాల్గుణ మాసంలో ఆరాధించాలి .
ఈ విధంగా ప్రతి మాసంలోనూ సూర్యారాధన చేయాలని మన వేదాలు చెబుతున్నాయి . సూర్యారాధన చేయడమంటే, ప్రత్యక్షంగా, మనకి కళ్ళకి కనిపించే భగవంతుణ్ణి ఆరాధించడమే. ఆయన అనుగ్రహం కూడా అదే విధంగా ఉంటుంది . చాలా త్వరగా అనుగ్రహించి అనంతమైన ఫలితాలని అనుగ్రహిస్తారు ఆదిత్యుడు . అన్నదాత , అనంతశక్తి ప్రదాత, ఆరోగ్యసిద్ధిదాయకుడైన ఆ ఆదిత్యునికి అనంతకోటి ప్రణామాలతో , స్వస్తి !!
#surya #sungod
Tags: surya, sun, surya aradhana