Online Puja Services

విశ్వచాలనా శక్తులు - సప్త మాతృకలు

18.117.75.218

విశ్వచాలనా శక్తులు - సప్త మాతృకలు  
- లక్ష్మీరమణ 

సృష్టి చాలకుడు పరమాత్మ. అయన చాలనా శక్తి ఆ పరమేశ్వరి. దేవీ మహత్యంలో వీరికి సంబంధించిన ఉదంతం కనిపిస్తుంది . ఈ శక్తి స్వరూపాల ఆవిర్భావం వెనుక, ఒక ఆసక్తికరమైన గాథ వుంది. పూర్వం శుంభ నిశుంభులనే రాక్షసులు, వరబలం చేత గర్వించి, దేవతలనూ, మహర్షులనూ అనేక విధాలుగా హింసించ సాగారు . ఆర్తజన రక్షణకు, మునిగణాలని కాపాడేందుకు, దేవతల ప్రార్ధన మేరకు అసురీ గణాలని సంహరించడానికి స్వయంగా ఆదిపరాశక్తే రంగంలోకి దిగింది .  ఆమెకు తోడుగా  బ్రహ్మాది దేవతల శక్తులు స్త్రీ  మూర్తులుగా  యుద్ధరంగంలో నిలిచారు .  అలా వచ్చిన సప్త ప్రధాన దేవతా శక్తి స్వరూపాలే సప్త మాతృకలు. ఈ కథని  'దేవీ మహాత్మ్యం' గొప్పగా వర్ణించింది. ఈ ఘట్టాన్ని, విన్నా, చదివినా అది సప్తమాతృకారాధన తో సమానం. ఇది  భక్తులకి అనంతమైన రక్షణ నిస్తుంది. వీరిని గురించిన మరిన్ని విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం. 

పురాణం ప్రకారం  శుంభ నిశుంభులను సంహరించడానికి అవతరించింది పరమాత్మిక.  ఆమె మీదికి  దానవ వీరులందరూ, అన్ని వైపుల నుంచీ ఒకేసారి, దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో, బ్రహ్మది దేవతల దివ్య శక్తులన్నీ, ఆ పరమాత్మికలో ప్రవేశించాయి. బ్రహ్మ దేవుని శక్తి సర్వసతి సూత్ర కమండలాదులు ధరించి, హంసవాహనం మీద అమ్మవారి పక్కన నిలబడింది.  శంఖ,చక్ర,గదా ధారిణిగా విష్ణు శక్తి  లక్ష్మీ దేవి గరుడవాహనం మీద వచ్చింది.  త్రిశూలమును ధరించి, అర్ధచంద్రుణ్ణి శిగలో తురుముకుని, వృషభ వాహనం మీద శివ శక్తి శాంకరీ దేవి వచ్చింది. శక్తి ఆయుధాన్ని ధరించి, నెమలి వాహనం మీద కూర్చొని కుమార స్వామి ఇల్లాలు కౌమారీ, వజ్రాయుధాన్ని చేత ధరించి ఐరావతం మీద శచీదేవీ, సూకరాకారంలో పీతాసనం మీద సూకరీ, నారసింహుని స్త్రీ స్వరూపం నారసింహీ, యమదండం ధరించి మహిష వాహనం మీద యామ్యా దేవీ, వారుణీ, తదితర  ప్రముఖ దిక్పాల స్త్రీ శక్తి స్వరూపాలు  తమ అనుచరులతో సహా వచ్చి పరమాత్మిక పక్కన నిలిచారు . అమ్మ సింహం ఒక్కసారిగా జూలు విదిల్చింది. దేవదేవి వికటాట్టహాసం చేసింది . 

బ్రహ్మణి హంసవాహనంపై రణరంగం మీద ఎగురుతూ, కమండలోదకాలను మంత్రించి జల్లుతోంది. అవి సోకిన దానవులు, నిశ్శబ్దంగా మారు మాట లేకుండా మృత్యు ఒడిలోకి చేరిపోతున్నారు. వైష్ణవీ శక్తి లక్ష్మి మహావిష్ణువే కదనరంగంలో నిలిచారా అన్నట్టు చెలరేగిపోతోంది. దేవి గరుడ వాహనం మీద గిరికీలు కొడుతూ, నాలుగు చేతులా నాలుగు ఆయుధాలను ప్రయోగిస్తూ, రాక్షస సంహారం చేస్తోంది . ఆమె విసిరిన సుదర్శనం వెళుతూ కొన్ని వేలమందిని, తిరిగి వస్తూ కొన్ని వేలమంది రాక్షసుల్ని మత్తు పెడుతోంది. ఇక  వృషభారూఢయైన పార్వతీ మాత  త్రిశూలాన్ని విసురుతూంటే, పోటుకి వందలూ వేలుగా, దానవుల శిరస్సులు బంతులై గాలిలోకి ఎగురుతున్నాయి . ఇంద్రుని వజ్రాయుధాన్ని ప్రయోగిస్తూన్న శచీదేవికి తిరుగేలేదు. ఆమె వాహనం వాహనంగా ఉన్న ఐరావతం పాదప్రహరణాలకి అంతేలేదు. వారాహీ దంతాలకు వాడి వేడి పెరిగిపోతోంది. ఆ దేవదేవి ఒక్క కుమ్ముతో తన కోరలకి దిగబడిన వందల కొద్దీ  దానవకళేబరాలను, విదిలించి కొడుతోంది . అవి మీదపడి మరింతమంది దానవులు మరణిస్తున్నారు. నారసింహి గర్జనకె గుండెలు అదిరి చచ్చి పడుతున్నారు దానవ వీరులు. ఇక గజసైన్యానయితే , చీల్చి చెండాడి , కుంభస్ధలాలు గుమ్మడి పండులాగా బద్దలు కొట్టి , వాడి గొల్లనే కత్తులుగా మలచి ఆమె చేస్తున్న కరాళ నృత్యం వర్ణించలేనంత భీతావహంగా ఉంది. రుచుకు పడింది. కౌమారి ప్రయోగిస్తున్న శక్తి ఆయుధానికి సమాధానం చెప్పలేక, దానవ యోధులు తమ శిరస్సులను కానుక పెట్టారు. వారుణీ దేవి పాశం విసిరితే, వేలకు వేలుగా రాక్షసులు సొమ్మసిల్లి పోయారు, బందీలైపోయారు. చిక్కినవారిని చిక్కినట్టు, సింహం భక్షించసాగింది. ఐరావతం మట్టగించింది. ఈ విధంగా సప్తమాతృకలతో పాటు ఇతర దేవతల స్త్రీ శక్తి స్వరూపాలు చేస్తున్న ప్రహారం ఒకెత్తయితే, పరమేశ్వరి జగజ్జనని ఆదిశక్తి చేస్తున్న యుద్ధం మరో ఎత్తు  . ఒకే దేవిగా, ఎన్నో రూపాల శక్తిగా ఆమె ఎక్కడ ఎలా దాడిచేస్తోందో, రాక్షస సేనకు అంతుచిక్కడమే లేదు. ఆమె ముందు నిలబడడం తర్వాత, వచ్చేందుకు కూడా ధైర్యం చాలట్లేదు ఆ దైత్య సేనకు . 

అలా చూస్తుండగానే, ఒకవైపు  సప్త మాతృకల ధాటికి దానవులు నిలువలేక, పారిపోయారు. మరో వైపు జగదీశ్వరి  శుంభ నిశుంభులని అత్యంత దారుణంగా అంతమొందించింది. దేవతలు, ఋషులు  అమ్మవారిని కీర్తించి పూల వర్షం కురిపించారు . పలు విధాలుగా కీర్తించారు . అమ్మని శాంతింప జేశారు . ఇన్ని రూపాల్లో రాభవించి రాక్షస సంహారం చేసి, లోకానికి వారి బెడద తప్పించిన  దేవదేవి సకల జనుల సుభిక్షార్థం, సప్త మాతృకలుగా  ముల్లోకాలలో పూజలందుకుంటున్నారు. 

ఆ మాతృకా స్వరూపాలే బ్రహ్మలోని శక్తి 'బ్రాహ్మి', విష్ణుశక్తి 'వైష్ణవి', మహేశ్వరుని శక్తి 'మహేశ్వరి', స్కందుని శక్తి 'కౌమారి', యజ్ఞ వరాహస్వామి శక్తి 'వారాహి', ఇంద్రుని శక్తి ఐంద్రి, అమ్మవారి భ్రూమధ్యమైన కనుబొమల ముడినుంచి ఆవిర్భవించిన కాలశక్తి చాముండి . సప్త మాతృకలైన ఈ శక్తులు, విశ్వాన్ని నిర్వహించే ఏడు రకాల మహా శక్తులు. ఆధ్యాత్మిక సాధనలోని పురోగతి క్రమంలో, మనలో జాగృతమయ్యే శివ శక్తులు వీరు. నిజానికి ఒకే శక్తి అయినా, పరమేశ్వరి తాలూకు వివిధ వ్యక్తీకరణలే, ఈ సప్తమాతృకలని చెప్పవచ్చు. ఆధ్మాత్మిక సాధనలో సప్తమాతృక శక్తులు మనకి ఎంతగానో సహకరిస్తాయి. వీరిని ఆరాధించడం వలన సాధనలో ఉన్నతి కలుగుతుంది . తామర తెంపరగా పుట్టుకొచ్చే రక్తబీజుడి  వంటి ఆలోచనల పాలిట అమ్మ కాళిగా మారి, చిత్తం ధ్యానంలో నిలిచేలా చేస్తుంది.   

జీవితంలోని అన్ని అవరోధాలూ తొలగి జీవితం సాఫీగా సాగేందుకు పోరాట శక్తిని అనుగ్రహిస్తుంది . వెంటే ఉండి, విజయాల్ని సాధించేందుకు అవసరమైన ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. సదా సన్మార్గంలో నడిచేలా మనకి మార్గ నిర్దేశనం చేస్తుంది. అమ్మకి శతకోటి నమస్సుల తో , ఆవిడ అనుగ్రహం మా పాఠకులకి సిద్ధించాలని కోరుతూ .. శుభం !!   

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya