అష్టాదశ శక్తిపీఠం-4 చాముండీ
చాముండీ క్రౌంచ పట్టణే
శ్రీ చాముండేశ్వరీ దేవి ధ్యానం
క్రౌంచపుర స్థితామాతా చాముండా దుష్టనాశనీ
సర్వసిద్ధిప్రదాదేవీ భక్తపాలన దీక్షితా
కర్ణాటక రాష్ట్రమునకు ప్రధాన నగరం బెంగుళూరు. దీనికి సుమారు 140 కి.మీ. దూరమున ఆగ్నేయం వైపున మైసూరు పట్టణం వుంది. ఇది ఒడయార్ వంశీయులకు రాజధానిగా వుండేది. చక్కటి తోటలు, గొప్ప భవనములతో కూడిన మైసూరు పట్టణము పర్యాటకుల మనస్సును ఆహ్లాదం కలిగిస్తుంది. మైసూర్ పట్టణమునకు సుమారు 13 కి.మీ. దూరమున చాముండీ పర్వతం వుంది. సతీదేవి దివ్యాభరణాలు పడిన ప్రదేశముగా ప్రసిద్ధి. మార్కండేయ పురాణంలో దేవి ఉత్పత్తిని గురించి ప్రస్తావించబడింది. మాత మూడవ అవతారంలో మహామాయ, మహాసరస్వతీ రూపిణిగా శుంభ, నిశుంభలనే రాక్షసులను వధించింది. ఆమె దేహం నుంచి వెలువడిన కాళికాదేవి చండు, ముండులను సంహరించి ”చాముండి”గా ప్రసిద్ధి పొందినది.
పురాణ కాలములో మహిషాసురుడు పాలించిన పురమును మహిషాసురపురముగా పిలిచెడివారు. కాలక్రమేణా మైసూరుగా మారిందని ప్రతీతి. మహిషాసురుడు మహాబలవంతుడు. మరణంలేని వరాన్ని కోరుతూ ఘోరతపము చేసెను. అది అసాధ్యమని బ్రహ్మ తెలుపగా అంతట మహిషాసురుడు స్త్రీని అబలగా భావించి, స్త్రీ తప్ప ఇతరుల చేతిలో మరణంలేని వరం పొందినాడు. బ్రహ్మ యిచ్చిన వర ప్రభావంతో ముల్లోకములను జయించి దేవతలను, ఋషులను బాధించసాగెను. దుష్టపాలనతో ప్రజాకంటకుడుగా మారిన మహిషాసురుడు సంహరించుటకు జగన్మాత చాముండేశ్వరిగా అవతారము దాల్చి, రాక్షస సంహారము చేసెను. రాక్షస సంహారానంతరం చాముండేశ్వరి మాత మహిషాసురమర్ధినిగా ఖ్యాతి పొందినది. చాముండేశ్వరిదేవి అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగవది. మాత మైసూరు ప్రభువులకు కులదైవము మరియు ఆరాధ్యదైవమయినది.
చాముండి పర్వతము సముద్ర మట్టానికి సుమారు 1200 మీటర్లు ఎత్తుగా వున్నది. కొండమీదకి మెట్లు మార్గంతోపాటు రోడ్డు మార్గము కూడా కలదు. మూడోవంతు మెట్టెక్కేసరికి సమున్నతరగా కనబడు ప్రదేశములో 16 అడుగుల ఎత్తుగల ఏకశిలా నిర్మితమైన నంది విగ్రహం వుంది. నందీశ్వర శిలా విగ్రహం చూపరులను విశేషముగా ఆకర్షించుతుంది. కొండపైకి మహిషాసుర విగ్రహమును చూడవచ్చును. వీటితోపాటు ఒడయారు మహారాజు, మహారాణి విగ్రహములు కూడా దర్శనీయం.
నేటి చాముండేశ్వరాలయం 1827వ సంవత్సరములో పునరుద్ధరింపబడింది. చాముండి పర్వతమున, తూర్పువైపుగా ”దేవకెరె” అను తీర్థం కలదు. దేవికెరెకు సంబంధించిన కథ ఒకటి గలదు. పాపహరిణియగు గంగానదిలో స్నానమాచరించిన భక్తులు పుణ్యం సంపాదించి, విష్ణులోకం చేరుకొనుచున్నారు. వారి పాపములను గంగామాత స్వీకరించి, తాను మాత్రము క్షీణించుచుండెను. ఒకనాడు గంగామాత బ్రహ్మతో తన బాధను మొరపెట్టుకుంది. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారము దక్షిణ భారతదేశమున, పవిత్రమైన కావేరినది ప్రాంతమున గల మహాబలాద్రి పర్వతమున జన్మించి, మహాబలేశ్వర లింగమును ఆరాధించి, తిరిగి స్వచ్ఛత తెచ్చుకుంది. ఇంతటి పుణ్యత గలిగిన జలము నందు స్నానమాచరించి, ఆషాడమాసంలోని కృష్ణపక్షము నందు, రేవతి నక్షత్రం వున్న శుక్రవారం దినమున శ్రీ చాముండేశ్వరి మాతను చంపకమాలతో ఆరాధించిన భక్తుల యొక్క సకలబాధలు తొలగి, వారి కోర్కెలు తీరగలవు. సూర్యుడు మేషరాశిలో వుండగా, శుక్లపక్ష సప్తమి దినమున పాతాళ వాహినిలో స్నానమాచరించి, మహాబలాద్రి క్షేత్రమున గల మహాబలేశ్వర స్వామిని ఆరాధించిన వారి కోర్కెలను స్వామి తీర్చగలడు.
వైశాఖమాసం, శుక్లపక్ష, శుక్రవారం దినము పాతాళవాహినిలో స్నానమాచరించి రామనాధగిరిలోని స్వామిని ఆరాధించినా సర్వపాపములు తొలగి, సుఖసంతోషములతో జీవించగలరు. మాఘమాసం, శుద్ధపూర్ణిమ, ఆదివారం దినమున పాతాళగంగలో స్నానమాచరించి, రామనాధగిరిలోని స్వామిని ఆరాధించిన సూర్యలోకమును పొందగలరు.
పురాణ, ఇతిహాసకాలము నందు చాముండిపర్వతమును మహాబలాద్రి పర్వతముగా పిలిచెడివారు. దీనినే మహాబలగిరి అని కూడా సంబోధించేవారు. మహాబలద్రి పర్వతమున స్వయంభువ లింగముగా వెలసిన శ్రీ మహాబలేశ్వర ఆలయం కూడా పురాతనమైనది. శివాలయం నందలి లింగము చాల మహిమాన్వితమైనది. భక్తులు తమ కోర్కెల సాఫల్యం కోసం, నియమంగా స్వామిని ఆరాధించుదురు. వారి సర్వబాధలు తొలగి, సమస్యలకు పరిష్కారం లభించగలదు అని గట్టి నమ్మకం. శ్రీ చాముండేశ్వరి ఆలయమునకు కుడివైపున, కొంతదూరమున శ్రీ మహాబలేశ్వరాలయం వుంది. జీర్ణావస్థలో వున్నా, నిత్యం పూజాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీ మహాబలేశ్వర దర్శనం పుణ్యదాయకం. శివాలయమునకు వెనుక భాగమున శ్రీ నారాయణ స్వామి ఆలయం కూడా కలదు. శ్రీ నారాయణస్వామి దర్శనము కూడా పుణ్యదాయకం.
సర్వేజనా సుఖినోభవంతు
- రామ కృష్ణంరాజు గాదిరాజు