అష్టాదశ శక్తిపీఠం-1 లంకాయాం శాంకరీదేవి
అష్టాదశ శక్తిపీఠం-1
లంకాయాం శాంకరీదేవి
శ్రీ శాంకరీదేవి ధ్యానం : ట్రింకోమలి (శ్రీలంక)
శ్రీ సతీ శాంకరీదేవీ త్రికోమలి పురస్థితా
ఉత్తమాంగ ప్రభాగౌరీ భక్తకామ ఫలప్రదా
”లంకాయాం శాంకరీదేవి”, అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటిది. భారతదేశమునకు పొరుగున గల సింహళద్వీపం (శ్రీలంక) నందు ఉండేది. శ్రీలంక ద్వీపం నందు తూర్పు తీరప్రాంతములో ట్రింకోమలిపుర (ట్రింకోమ్‌లీ) పట్టణము వుంది. ఇది సతీదేవి కాలిగజ్జెలు పడిన ప్రదేశముగా ప్రసిద్ధి.ఇక్కడ శాంకరీదేవి మందిరము ఉండేది అని పూర్వీకుల వాదన. బౌద్ధమతం, క్రైస్తవమతం అభివృద్ధితో హిందూ మతము నకు రాజపోషణ కరువయింది. దీనితో ప్రజల ఆదరణ కూడా క్షీణించింది. కొంతకాలమునకు హిందూ దేవాలయములు శిథిలముగా మారినాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. శాంకరీదేవి మందిరము కూడా కాలగర్భంలో కలిసిపోయి వుండవచ్చును.
నేడు శ్రీలంకను శోధిస్తే, ఎక్కడా శాంకరీదేవి ఆలయం కనిపించుటలేదు. ప్రస్తుతం శాంకరీదేవి దర్శనం దుర్లభమే. శ్రీలంకలో తమిళులపై దాడులు హింసాత్మకమవటంతో, వాటిని తట్టుకోలేక పారిపోయి కెనడా, ఇండియా మొదలగు దేశములకు చేరిన హిందువుల సంఖ్య అధికం. క్రమక్రమంగా శ్రీలంకలో హిందూమతమునకు, హిందూ దేవాలయములకు ఆదరణ కరువయింది.
త్రేతాయుగంలో రావణాసురుడు, లోకనాథుడైన పరమేశ్వరునితో పాటు శాంకరీదేవిని నిత్యం పూజించినట్లు పురాణ కథనం. ట్రింకోమలీ నందు శాంకరీదేవి ఆలయ దర్శనం నేడు శూన్యం అయినా, క్షేత్ర మహాత్యం, క్షేత్ర దర్శనము ఆనందదాయకమే. కొలంబో పట్టణము పశ్చిమతీరంలో వుండగా, ట్రింకోమలీ పట్టణము తూర్పుతీరంలో వుంది.
రెండు పట్టణముల మధ్య రవాణా సదుపాయములు కలవు. మహాపట్టణం, గలోయపట్టణం మీదుగా శ్రీలంక ప్రభుత్వ రైలు మార్గం వుండగా, కాండిపట్టణం, గలోయ పట్టణముల మీదుగా రోడ్డు మార్గం కలదు. భారతీయులకు శ్రీలంకలోని పర్యాటక స్థలసందర్శనకై రూ. 35,000/-లు పైగా ఖర్చు అవ్వచ్చు.
సర్వేజనా సుఖినోభవంతు
- రామ కృష్ణంరాజు గాదిరాజు