Online Puja Services

హస్తముద్రలెందుకుండవు

18.116.15.22
శ్రీ కంచి కామాక్షీ అమ్మవారికి, వరదాభయ హస్తముద్రలెందుకుండవు....!?
 
దేవీ దేవతలందరూ, చేతులతో అభయ ముద్రనూ, మరియూ వరముద్రనూ ధరించి, వారివారి భక్తులకు అభయమునూ మరియూ వరములనూ ఇస్తామని ప్రకటి స్తారు. కానీ, సుమేరు శృంగ మధ్యస్థా, శ్రీమన్నగర నాయికా, చింతామణి గృహంతస్దా, పంచబ్రహ్మసనస్థితా, మహపద్మాటవీసంస్దా, కదంబవనవాసినీ, సుధా సాగర మధ్యస్థా కామాక్షీ కామదాయినీ, అని, శ్రీ వశిన్యాది వాగ్దేవతలు శ్రీ లలితా సహస్రనామంలో చెప్పిన తల్లి కామాక్షి మాత మాత్రం అటువంటి వరదాభయ హస్తాలను ప్రదర్శించరు. విచారణయే వివేచన, వివేచనమే జ్ఞానము.

అటువంటి విచారణా దృష్టితో పరిశీలిస్తే, అమ్మవారు ధరించిన, పాశము, అంకుశము, చెరుకుగడ మరియు బాణములు దేనికి సంకేతములు అంటే..!?, అవే మనలోని, రాగము, ద్వేషము, పంచ జ్ఞానేంద్రియములు మరియు మనస్సు.

ఇంతకుమించి మనలో ఏమున్నాయి..!?

మన పంచ జ్ఞానేంద్రియముల ద్వారా ఏ ఏ విషయములైతే మన మనసుకు చేరుతున్నాయో , వాటి ద్వారా మనకు రాగము గానీ లేక ద్వేషము గానీ కలుగుతున్నది.

కాబట్టి అమ్మవారు ధరించినటువంటి పాశము, అంకుశము, చెరుకుగడ మరియు బాణములు ఏమి చెబుతున్నాయి అంటే, మన నియంత్రణ అంతా అమ్మ వారి చేతిలోనే ఉన్నది అని.

అయితే, శాస్త్ర వచనం ప్రకారం, మనలోని ఇంద్రియములు ఇరువదినాలుగు. తంత్ర శాస్త్రము ప్రకారము మనలోని ఇంద్రియములు 36. కానీ మనం బాగా విచారణ చేయాలి.

ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, పంచ భూతములు మరియు శబ్ద, స్పర్శ, రస, రూప, గంధము లనే,ఐదు తన్మాత్రలు, వెరసి ఇరవై ఇంద్రియములు.

మనలో ప్రకాశించే ఈ ఇరవై ఇంద్రియములకు, అధికారి మన మనసు.

మన మనసే మాయ. అది అమ్మవారి నియంత్రణలో ఉన్నది. బందమునకు కానీ లేక మోక్షమునకు గానీ అదే కారణము. ఈ ఇరువది ఒకటి ఇంద్రియములకు అధికారి మనలోని బుద్ధి. బుద్ధి నిశ్చయిస్తుంది. కానీ,అదీ అమ్మవారి యొక్క రూపమే. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా. మన బుద్ధిని కూడా మనం అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే, మన బుద్ధి మన కర్మానుసారిణి.

వీటన్నింటికీ మించి మనలో చిత్తం అని మరొక ఇంద్రియము ఉంది. మనకు ఇది మరీ ప్రమాదకరమైనటువంటిది. చిత్తము అనగా అంతా నా ఇష్టం. మన ఇష్టం వచ్చినట్లు మనం చేస్తే, దాని ఇష్టమొచ్చినట్లు అది అయిపోతుంది. మళ్లీ ఈ మానవ జన్మ కూడా దక్కదు. ఈ 23 ఇంద్రియముల పైన ఇంకొక ప్రమాదకరమైన అధికారి మనలో ఉన్నాడు.వాడే మనలో ఇరవై నాలుగోవ ఇంద్రియం.పేరు అహంకారం. మహా ప్రమాదకరం.

ఈ 24 ఇంద్రియములను మరికొంత విశ్లేషించి, తంత్ర శాస్త్రములలో 36 ఇంద్రియములుగా చెప్పారు. వాటి విశ్లేషణ ఇక్కడ అప్రస్తుతం. మరి ఈ ఇరువదినాలుగు ఇంద్రియములు మనకు శ్రేయస్సు కలిగించేవి కానప్పుడు మనం ఏమిచేయాలి..!? అంటే, సత్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారినే ఆశ్రయించాలి. శంకరులు, "సౌందర్యలహరి" లోని నాల్గవ శ్లోకాన్ని, అమ్మవారిని ఎలా ఆశ్రయించిలో వివరిస్తూ, ఇలా రచించారు.
 
త్వదన్యః పాణిభ్యా - మభయవరదో దైవతగణ
స్త్వమేకా నైవాసి -ప్రకటితవరాభీత్యభినయా
భయాత్త్రాతుం దాతుం -ఫలమపిచ వాంఛాసమధికం
శరణ్యే లోకానాం - తవ హి చరణావేవ నిపుణౌ .

లోకానాం = సర్వ లోకములకు, శరణ్యే = శరణ్యమైన తల్లీ, త్వదన్యః + త్వత్ + అన్యః = నీ కన్న వేరైన, దైవతగణః = దేవతలు, పాణిభ్యామ్ = తమ రెండు చేతులతో, అభయ వరధః = అభయాన్ని మరియు వరములను ఇస్తామని సూచించే అభయ ముద్రనూ, వరముద్రనూ ధరించారు. త్వమ్ = నీవు , ఏకా = ఒక్క దానివిమాత్రం, నైవాసి ( న+ఏవ+అసి) = ఏ మాత్రము కాకపోతివి.( అనగా, అభయాన్ని
మరియు వరములను ఇస్తానని ప్రకటించటంలేదు)

దానికి కారణము ఏమిటంటే, భయాత్ = భయము నుండి, త్రాతుం = రక్షించటానికి, వాంఛాసమధికం = కోరిన దానికంటే ఎక్కువగా, ఫలమ్ అపి = ఫలమును కూడా దాతుం = ఇవ్వటానికి, తవ =నీయొక్క చరణావేవ (చరణౌ + ఏవ) = పాదములే, నిపుణౌ హి = సామర్థ్యం కలిగినవి కదా. కంచిలోని శ్రీ కామాక్షి మాత , తన రెండు పాదములను చూపుతూ ఆశీనులై ఉంటారు.

శ్రీ కంచి కామాక్షి మాత వేసేటువంటి ఆ ఆసనం మరి ఎక్కడా మనకు కనిపించదు. అలా శ్రీ కామాక్షి మాత యొక్క పాదములను దర్శించి, నమస్కరించినవారి యొక్క సకల కష్టములు తొలగి మరియు వారు కోరుకున్న దానికంటే అధిక ఫలం పొందుతారు కాబట్టి, వారి వారి యొక్క ఆర్తికి ముగింపు లభిస్తుంది కాబట్టి, "కధ కంచికి మనం ఇంటికి" అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది.

ఈ శ్లోకము ద్వారా అమ్మవారిని ఎలా ఆశ్రయించాలో మనకు చెప్పారు శంకరులు.

శ్రీ శంకర భగవత్పాద విరచిత
సౌందర్య లహరి.
సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది.
శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే
 
- శివకుమార్ రాయసం 

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya