దత్తాత్రేయ స్వరూపం విలక్షణం, విశిష్టం!

దత్తాత్రేయ స్వరూపం విలక్షణం, విశిష్టం!
సేకరణ
మనం భగవంతుడి అవతారాలన్నీ నిశితంగా పరిశీలిస్తే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లక్ష్యాలుగా ఉంటాయి. ఆ ప్రత్యేకమైన విధి నిర్వహణ తర్వాత ఆ అవతారాలు పరిసమాప్తి అవుతాయి. కానీ దత్తాత్రేయ అవతారం అలాకాదు. ఆయన ఆవిర్భావం వెనక ఒక నిగూఢమైన, నిరంతరాయమైన కార్యక్రమం ఉంది. మనుషుల్లో జ్ఞాన, వైరాగ్య, ఆధ్యాత్మికోన్నతి కలిగించడం అనే ముక్కోణ ప్రణాళిక ఉంది. అందుకే భాగవత మహాపురాణం మహావిష్ణువు ధరించిన 21 అవతారాల్లో దత్తాత్రేయ అవతారాన్ని గురించి ప్రత్యేకంగా వివరించింది.
సత్త్వ, రజో, తమో గుణాలను జయించిన మహా తపశ్శాలి అత్రి మహాముని. అసూయలేని సాధ్వీమణి అనసూయ. ఈ దంపతులిద్దరి తపో ఫలితంగా త్రిమూర్తుల అంశతో మార్గశిర పూర్ణిమనాడు దత్రాత్రేయుడు జన్మించాడు.
దత్తుడు జ్ఞానానికి ప్రతీక. ఇతర దైవాల తీరులో ఆయన రాక్షస సంహారం చేయలేదు. ఆయన దృష్టిలో మనిషిలో ఉండే అజ్ఞానం, అహంకార మమకారాలే రాక్షసులు. మనిషిలోని దుర్గుణాలే అతడిని రాక్షసుడిని చేస్తాయి. అందుకే దత్తుడు అజ్ఞానాన్ని సంహరించి, జ్ఞానదీపాలు వెలిగించాడు. అసలు దత్తాత్రేయుడి పేరులోనే ప్రత్యేకత ఉంది. దత్తం అంటే త్యజించడం అనే అర్థముంది. సూక్ష్మ, స్థూల, కారణాలనే మూడు రకాల శరీరాలను, జాగృత్, స్వప్న, సుషుప్తి అనే మూడు స్థితులను, సత్త్వ, రజో, తమో గుణాలను జయించినందుకు ఆయన దత్తాత్రేయుడయ్యాడు.
శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటారు. ఆయన పేరులో లాగానే, ఆయన స్వరూపంలోనూ ఒక గొప్ప అంతరార్థం ఉంది . వీటికి గల అర్థాలను పరిశీలిస్తే,
మూడు శిరస్సులు:
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.
నాలుగు కుక్కలు:
నాలుగు వేదములు ఇవి. శ్రీ దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరులు .
ఆవు:
మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చారు .
మాల:
అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు, సాహిత్య, సంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.
త్రిశూలము :
ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.
చక్రము:
అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.
డమరు:
సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.
కమండలము:
సమస్త బాధలను పోగొట్టేటటువంటిది . శుభములను సమకూర్చేది .
చిత్రకూటం సమీపంలో ఉన్న అనసూయపహాడ్ దత్తాత్రేయస్వామి అవతరించిన స్థలమని చెబుతారు. బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా దత్తపురాణం ఉంది. మనకు లభిస్తున్న మొదటి గురుచరిత్ర ఇది. వ్యాసమహర్షి దీనికి కర్త. భాగవత మహాపురాణం, మార్కండేయ పురాణాల్లో కూడా దత్తుడికి సంబంధించిన ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పిన ఉద్భవగీతలో మొదటి అధ్యాయం పూర్తిగా దత్తాత్రేయుడి గురించి వివరిస్తుంది. జగన్మాతను అర్చించే శ్రీవిద్యా సంప్రదాయంలో కూడా దత్తాత్రేయుడికి ముఖ్యస్థానం ఉంది.