Online Puja Services

దత్తుని ఆశ్రయించినవారికి అలభ్యం అనేది ఏదీ లేదు

18.226.222.132

దత్తుని ఆశ్రయించినవారికి  అలభ్యం అనేది ఏదీ లేదు 
-సేకరణ : లక్ష్మి రమణ  

దత్తావతారం విశిష్టమైనది. అత్రి అనసూయల పుత్రుడు దత్తాత్రేయుడు, బ్రహ్మ కుమారుడు అత్రి, కర్దమ మహర్షి తనయ అనసూయ. అత్రి మహాముని పితౄణము నుండి విముక్తి చెందుటకై తపస్సు చేయగా, ఆ తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమవుతారు. వారిని చూసి వారి ముగ్గురి అంశతో తనకో కుమారుడు కావాలని కోరుకుంటాడు.

త్రిమూర్తుల అంశతో అనసూయ,అత్రి దంపతులు దత్తాత్రేయుణ్ణి తనయడుగా పొందుతారు. ఓసారి లక్ష్మి,సరస్వతి,పార్వతిదేవిలు అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షింపదలచి తమ భర్తలు ముగ్గురిని ప్రేరేపించగా వారు అభ్యాగతులుగా వెళ్ళి తమకు నగ్నంగా వడ్డించమన్నారు. మహాపతివ్రతైన అనసూయ వారిని పసిబిడ్డలుగా చేసి పాలిచ్చి పెంచసాగింది. దాంతో త్రిమూర్తులు ఆమెకు బిడ్డలయ్యారు.

అత్రి మహామునికి ఇచ్చిన వరాన్ని దత్తాత్రేయుడిగా మారి నిజం చేసారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ  త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు ఎందరికో గురుస్వరూపుడై, ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. పరశురాముడికి శ్రీ విద్యామంత్రాన్ని ఉపదేశించాడు, అదే పరశురామతంత్రం.  

కుమారస్వామి కూడా దత్తాత్రేయుని శిష్యుడే. ప్రహ్లాదునికి ఈ స్వామి జ్ఞానప్రదాత. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని శిష్యుడు. సిద్ధనాగార్జునునికి రసధాతు విద్యలను బోధించిందీ ఈ స్వామే. యదువునకు యోగమార్గమును తెలియజేసింది దత్తాత్రేయులవారే. జ్ఞానేశ్వరుడు, ఏకనాధుడు వీరందరూ దత్తోపాసకులే. దత్తుని ఆశ్రయించినవారికి  అలభ్యం అనేది ఏదీ లేదు.

మూడు శిరస్సులతో, ఆరు భుజాలతో, శంఖం, చక్రం, ఢమరుకం, త్రిశూలం, మాల, కమండలములను ధరించి నాలుగు కుక్కలతో, కామధేనువుతో ఒప్పారే దివ్యమంగళ స్వరూపుడీయన. 

ఈయన మూడు శిరస్సులు సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులకు సంకేతం కనుక దత్తాత్రేయుడు హరిహరహిరణ్య గర్భస్వరూపుడని తెలుస్తుంది.నాలుగు కుక్కలు నాలుగు వేదాలకు సంకేతం కాబట్టి దత్తాత్రేయులవారు సకలవేదస్వరూపుడుగా భావిస్తున్నాం. ఇక కామధేనువు ఇది మనస్సుకు మాయకు సంకేతం. సంకల్ప వికల్పాలకు, సుఖ, దుఃఖాలకు కారణమైన మాయను తన యోగబలంతో కామధేనువుగా మర్చి తన వద్ద వుంచుకున్న మాయాతీతుడు దత్తాత్రేయుడు.

దక్షిణ భారతదేశంలో అవతరించిన శ్రీపాదశ్రీవల్లభులు, శ్రీనృసింహసరస్వతి దత్తాత్రేయుని అవతారములే. స్మరిస్తే చాలు సంతోషంతో ప్రత్యక్షమయ్యే స్వామి, త్వరగా ప్రసన్నమయ్యే స్వామి దత్తుడని ఉపాసకులు చెబుతారు. పూజ, స్తోత్రం, మంత్రం, జపం, కవచం, పంజరస్తోత్రం, దత్తహృదయం, సహస్రనామం, ఇలా ఎన్నో ఉపాసనాభేదములు దత్త సాక్షాత్కారనికి వున్నాయి.

శ్రీపాదశ్రీవల్లభులు మొదటి అవతారంకాగా, రెండవ అవతారం శ్రీనృసింహసరస్వతి. మహారాష్ట్రలోని గాణ్గాపురంలోని వీరి పాదములున్నాయి. తెలంగాణాలో మాణిక్యప్రభువుల సంస్థానముంది. బెంగుళూరు దగ్గర దాదాపహాడ్ లో దత్తాత్రేయుల శ్రీపాదములున్నాయి.

మాహూర్, గిరివార్, కరంజ, ఔదంబర్, నరసింహవాడి, గాణ్గాపురము, కురుపురము, వారణాశి, భట్టగాము, పిఠాపురం, శ్రీశైలం ఇవన్నీ దత్తాక్షేత్రములు.

వ్రతాలలోకెల్లా అనఘాష్టమీ వ్రతం అత్యంత ఉత్తమం. అనఘాదేవి భక్తుల కోరికలను తీరుస్తుంది. దత్తాత్రేయులవారి యోగశక్తి యొక్క ప్రకాశమే అనఘ. అనఘాదేవి దత్తాత్రేయుల సంతానమే సిద్ధులు. దత్తాత్రేయులవారికి, అనఘాదేవికి సేవలు చేస్తే సకల శుభాలూ కలుగుతాయి.

అనఘా వ్రతం చేయడంవల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆదివారం, పూర్ణిమ వంటి రోజుల్లో ఈ వ్రతం చేయడం మరీ విశేషం. బియ్యపు పిండి, చలిమిడి, రాగిపిండి వంటి సామాన్యమైన నైవేద్యాలను కూడా స్వామివారికి సమర్పిస్తారు.

దత్తాత్రేయ గురుస్వరూపుడు మార్గశిర శుక్ల చతుర్దశి రోజున జన్మించినప్పటికీ, 'మార్గశిర పౌర్ణమి' రోజున ఆయన జయంతిని జరుపుకోవడం దత్త సంప్రదాయంగా వస్తోంది.

అత్యంత విశిష్టమైన ఈ రోజున దత్త పీఠాలను దర్శించడం, అక్కడి పాదుకలకు నమస్కరించడం, మేడిచెట్టుకి ప్రదక్షిణలు చేయడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. గురుపరంపరలో గల అవధూతలు కొలువైన ఆలయాలను దర్శించడం వలన సకల శుభాలు చేకూరతాయి. 

ఈ రోజున దత్తాత్రేయ స్వామి ప్రతిమకు షోడశోపచార పూజ చేసి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వలన, 'గురుగీత', 'గురుచరిత్ర' పారాయణం చేయడం వలన సమస్త కోరికలు సిద్ధిస్తాయి.

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi