Online Puja Services

శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం .

18.191.165.149

శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం . 
సేకరణ 

మహాలక్ష్మి సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవత. ఆ జగజ్జనని సుందరమైన రూపాలలో ప్రాచీన ద్రష్టలు ఆరాధించారు.

‘పుత్ర పౌత్ర ధనం ధాన్యం మస్త్యశ్యాజానిగోరథమ్‌
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతు కరోతుమాన్‌

అని అన్నారు. అంటే, సహజంగా లక్ష్మీదేవి ధనాన్ని అనుగ్రహిస్తుందని అంటుంటారు. అయితే, ఆ మాత…పుత్రులను, పుత్రికలను, మనునళ్లను, మనుమరాళ్లను, ధనాన్ని, ధ్యాన్యాన్ని, వాహన సౌకర్యాన్ని ఇవ్వడంతోపాటూ, వాటన్నింటినీమించి ఆయుష్షును ఇస్తుందని శ్రీసూక్తం చెబుతోంది.

సువర్ణవర్చస్సుతో భాసించే మహాలక్ష్మీమాత, పూర్ణవికసిత పద్మంపై చతుర్భుజాలతో ఆసీనురాలై ఉంటుంది. పైనున్న రెండుచేతుల్లో పద్మపుష్పాలు ఉంటాయి. పద్మం సౌందర్యానికి, నిర్మలత్వానికి పసిడిపంటల శోభకు సంకేతము. ఆమె ఆసీనురాలై ఉన్న పద్మం బురద నుండి ఆవిర్భవిస్తుంది. ఎటువంటి వాతారణంలోనైనా పూర్ణవికాసం చెందగల మనలోని అపరిమితశక్తికి ఆ పుష్పం సంకేతం. ఆ పద్మం చుట్టూ నీరు ఉంటుంది. ఆ నీరు జీవశక్తికి సంకేతం. నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహించకపోతే, ఆ నీరు చెడిపోతుంది. అలాగే ధనం ప్రవహిస్తూ ఉండాలి. ధనం ఒకచోట నుండి మరో చోటుకు మారినప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది.

లక్ష్మీదేవి సుసంపన్నతను, తేజస్సును వెదజల్లుతుంటుంది. మన జీవితాలు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే ఆ జగన్మాత ఆకాంక్షిస్తుంటుంది. ఆమె నాలుగు హస్తాలు ధర్మార్థకామ మోక్షాలకు సంకేతాలు. ఆ హస్తాలు మన జీవితాలకు బంగారు పునాదులు. లక్ష్మీదేవి కుడి హస్తం నుండి బంగారు నాణేలు వర్షిస్తుంటాయి. ఆ తల్లి కరుణ మనకు లభిస్తే, మన జీవితాలు సువర్ణమయం అని ఆ నాణేలు గుర్తుచేస్తుంటాయి. ఇక ఆ తల్లి ఎడమ చేత్తో పట్టుకున్న సువర్ణకలశం సుభీక్షానికి ప్రతీక. ఆమె ఆకుపచ్చని రంగు చీరను ధరిస్తుంది. పచ్చపచ్చని పొలాల పంటల సిరికి, అభివృద్ధికి, ఆ హరితాంబరం సంకేతం. ఒక్కొక్కసారి ఆమె ఎరుపురంగు చీరలో దర్శనమిస్తుంది. ఎరుపురంగు కార్యశీలతకు, ప్రకృతిశక్తికి సంకేతం.

ఆమె కుడి, ఎడమల రెండు తెల్లటిఏనుగులు నిలబడి నీటిని విరజిమ్ముతుంటాయి. ధర్మబద్ధంగా, విజ్ఞత, జ్ఞానం, వినిర్మలతలతో ఐహిక, ఆధ్యాత్మిక సంపదలను పొందేందుకై ప్రతివ్యక్తి చేసే నిరాటంక ప్రయత్నానికి ఆ జలధారలు సంకేతాలు. మహాలక్ష్మి చిత్రపటాలలో అప్పుడప్పుడు ఓ తెల్లని గుడ్లగూబను చూస్తుంటాం. ఇందులో రెండు ప్రతీకలున్నాయి. ఒకటి విజ్ఞతకు, అదృష్టానికి సంకేతము. రెండు, తెలివితక్కువ తనానికి ప్రతీక. సక్రమంగా నిర్వహించని సంపద అదృశ్యమైపోతుందని ఆ సంకేతార్థం. లక్ష్మీదేవి గర్వం, అహంకారాలను క్షమించదు. అందుకే ఆమె చంచల అయింది. క్రూరబుద్ధి, నాస్తికులు, కృతఘ్నులు, పాపాత్ములు, అబద్ధాలు ఆడేవారు, అయుష్షులయందు తాను కరుణ చూపనని చెప్పిన వారిని కాక, లక్ష్మీదేవి సత్యాన్ని పలికేవరు, పరిశుభ్రతను పాటించేవారు, గురుభక్తి, గర్వం లేనిపుణ్యాత్ములు, నిశ్చలబుద్ధిగలవారు, జ్ఞానులు, తపస్సు, దానం చేసేవారు, బ్రహ్మచర్యం పాటించేవారు, దయాగుణం గలవారిని అనుగ్రహిస్తానని చెప్పింది. లక్ష్మీ అనే పదం లక్ష్యం అనే పదాఅన్ని కూడ సూచిస్తుంది. ఒక ప్పష్టమైన లక్ష్యం, గమ్యం ఉన్న వారికే ధనం లభిస్తుంది.

లక్ష్మీదేవి ఆవిర్భావం

లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి తెలుసుకోవాలంటే, క్షీరసాగర మథనానికి ముందటి పరిస్థితులను తెలుసుకోవాలి. ఆ కాలంలో స్వర్గాధిపతియైన ఇంద్రునిలో అమితమైన గర్వాతిశయం పొడుసూపింది. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా, ఎదురుగా దుర్వాసమహర్షి తారసపడతాడు. అల్లంతదూరాన ఇంద్రుని చూసిన దుర్వాసుడు, అమరావతి అధిపతికి గౌరవసూచకంగా తన మెడలోని దండనిస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు, దండ నిచ్చినదెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞత చెప్పకుండా, ఆ దండను తన ఏనుగు తొండడానికి తగిలిస్తాడు. తొండాన్ని అటూ, ఇటూ ఆడిస్తూన్న ఏనుగు, దండను కిందికి విసిరేసి కాళ్ళ్లతో తొక్కుతుంది. అసలే కోపిష్టి అయిన దూర్వాసుడు, ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపావేశ పూరితుడై, “ఓయీ ఇంద్రా! మితిమించిన అహంకారం, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను, ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి” అని శపించాడు.

అప్పుడు ఇంద్రుని కళ్ళకుకప్పుకున్న తెరలు తొలగడంతో దుర్వాసమునిని క్షమించమంటూ వేడుకున్నాడు. అది విన్న దుర్వాసుడు, శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వవైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు. అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది. బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తారు. ఇంద్రుని అతని పరివాంతోపాటు స్వరం నుండి తరిమేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి, తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో, ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుముర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో, అందరూ విష్ణుసన్నిధికి చేరుకుంటారు.

ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి, రాక్షసుల సాయంతో పాలసముద్రాన్ని చిలికి, అందునుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు. మందరపర్వతం, వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలెడతారు. విష్ణుమూర్తి కూర్మావతార రూపములో మందరపర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాలసముద్రం నుండి ఎన్నోరకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యివతి కళ్ళు చెదిరే అందంతో, అందెల మృదుమధుర రవళులతో, చేతిలో కలువమాలతో ఉదయిస్తుంది. ఆమె అక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి, నును సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మథనం నుంచి జనించిన లక్ష్మీదేవి దుష్టశిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోను ఆయన సరసనే ఉంటుంది.

చంచల స్వరూపిణి

లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదనేది జగమెరిగిన సత్యమే. గర్విష్ఠులు, ఈర్ష్యాద్వేష పూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదనడానికి దుర్యోధనుని ఉదంతమే ప్రబల ఉదాహరణ. ఒకరోజు తన తండ్రి ధృతరాష్ర్టుని ముందు నిలిచిన దుర్యోధనుడు, పాండవులపట్ల తనకు గల అక్కసునంతా వెళ్లగక్కుతాడు. పాండవులు అలవిలేనంత సంపదల మధ్య తులతూగిపోతున్నారనీ, లెక్కలేనంతమంది భృత్యులతో, రాజప్రసాదాలతో విలసిల్లుతున్నారనీ, చెప్పాలంటే సంపదలో కుబేరుని కూడ మించిపోయారని, వారిని మించాలంటే తనేం చేయాలో చెప్పాలంటూ అభ్యర్థిస్తారు. కొడుకు మాటలను విన్న ధృతరాష్ట్రుడు, పాండవుల్లా ఐశ్వర్యంలో తులతూగాలంటే నీతినియమాలతో ప్రవర్తించాలనీ, అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడేనని చెబుతాడు. అవును. ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ, అతడు నడిచిన బాట నైతిక ఋజువర్తనతో కూడినదే. ప్రహ్లాదుని ఋజువర్తనం మనకు ఇంద్రుని ఉదంతం ద్వారా తెలుస్తోంది.

ఒకసారి విషయవాంఛలతో విసిగి వేసారిపోయిన ఇంద్రుడు, తన గురువు బృహస్పతిని కలిసి, తను కోల్పోయిన సంతోషాన్ని ఏవిధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుని మాటలను విన్న దేవగురువు విజ్ఞానమే అన్నివిధాలైన సంతోషాలకు మూలమనీ, దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు. ఇంద్రుని మనసులో మరోసందేహం. విజ్ఞానం కంటే గొప్పదైన విషయము ఏమైనా ఉందా అని, అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే, ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షసగురువు శుక్రాచార్యుని కలుసుకోమంటాడు. వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరకెళ్ళి తన సందేహాన్ని వెలిబుచ్చగా, అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెబుతాడు. ప్రహ్లాదుని దగ్గరకెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైన అసలు మూలకారణం ఏమిటిని ప్రశ్నించగానే, తనిప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండటంవల్ల సమాధానం చెప్పే తీరికలేదన్న ప్రహ్లాదుడు, తనను క్షమించమంటాడు. 

అయినా పట్టువదలని ఇంద్రుడు, ఏదో ఒకరోజు వీలుచిక్కినప్పుడు, ఆ రహస్యాన్ని వివరించమని, అప్పటివరకు తాను అక్కడే ఉంటానంటూ ప్రహ్లాదునికి సేవలు చేస్తూగడుపుతుంటాడు. అలా కొన్నాళ్ళు గడిచిన పిదప, ఇంద్రుని శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు.

“రాజుగా నా స్థాయిని తలచుకుని నేను ఏనాడూ గర్వపడలేదు. సాధుజనుల సేవకునిగా ఉంటూ, గురువులు, పెద్దలపట్ల గౌరవభావాన్ని కలిగివుంటాను. విపరీతమైన కోరికలతో గతి తప్పను. సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గం”. ప్రహ్లాదుని సమాధానం ఇంద్రుని సంతోషపరుస్తుంది. ఇంద్రుని భక్తిని మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరంకొమ్మంటాడు. వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక ఋజువర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు. ప్రహ్లాదుడు ‘సరే’ నని ఒప్పుకోగానే, అతని నుంచి ఓ జ్వాల బయటకు వస్తుంది.

“నేను నీలోని నీతివంతమైన నడవడిని, నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యునిలో నివశిస్తానని చెప్పి, ఇంద్రునిలోకి ప్రవేశిస్తుంది. అనంతరం ప్రహ్లాదునిలోనుంచి బయల్వెడలిన మరో జ్వాల, తాను అతనిలోని ధర్మశీలతనని, నైతిక సౌశీల్యం లేకుండా ఉండజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది. అనంతరం బయటపడిన సత్యం, తాను నిజాన్ని అని, ధర్మబద్ధాతతో ఉంటానని చెప్పి వెళ్లిపోతుంది. తదనంతరం వెలువడిన మరో జ్వాల తాను అధికారాన్ని అని, తాను నిజం వెంటే ఉంటానని ఇంద్రునిలో ఐక్యమవుతుంది. చివరగా ధవళకాంతులతో మెరసిపోతున్న ఓ దేవత బయటకొచ్చి, తనను లక్ష్మి అంటారని, సంపదల దేవతనని, దీర్ఘకాలంనీవెంటే ఉన్నానని, ప్రస్తుతం తనను వదలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తోందని చెప్పి బయట పడుతుంది. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజం, అధికారం నైతికబద్ధ ప్రవర్తన ఉన్నచోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మనకు అర్థమవుతోంది.

లక్ష్మీదేవి చల్లని చూపుల కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. తమైఇళ్ళను పావనం చేయాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తుంటారు. ఆతల్లి భక్తజనప్రియ. తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది

Mahalakshmi Anugraham

#mahalakshmi #lakshmi #laxmi

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi