మామిడాకుల తోరణాలతో లక్ష్మీ కటాక్షం
మామిడాకుల తోరణాలతో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది .
- లక్ష్మి రమణ
ప్రతి శుభకార్యానికి ఇంటి గుమ్మానికి మామిడాకులతో తోరణాలు కడతాము . ఉగాదికి కూడా మనం ఇంటి ముందు ఈ మామిడాకుల తోరణాలు కడతాం . ఈ సంప్రదాయం మనకి అనాదిగా వస్తూ ఉన్నది . ఇలా కేవలం మామిడాకులనే తోరణాలుగా కట్టడానికి కారణమేమిటి ?
మామిడి, రావి, జువ్వి , మర్రి ఉత్తరేణి వీటిని పంచ పల్లవాలు అంటారు . వీటిని శుభకార్యాలలో వినియోగించడం హిందూ సంప్రదాయం . అయితే ఇది కేవలం ఒక సంప్రదాయ మాత్రమే కాదు. ఇందులో ఆయుర్వేద సూక్ష్మాలు ఎన్నో ఇమిడి ఉన్నాయి .అయితే, తోరణాలుగా మాత్రము మామిడి ఆకులని మాత్రమే వినియోగిస్తారు . పండుగలు , వేడుకలు, వివాహాది శుభకార్యాలు ఏవి జరుపుకున్నా కూడా ఆయా సమయాల్లో గుమ్మానికి మామిడాకులు తోరణాలుగా కట్టడం శుభసూచకంగా భావిస్తారు .
యజ్ఞ యాగాదులలో మామిడాకులతో కూడిన ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం . పూజా కలశంలో కూడా మామిడాకులు వినియోగిస్తుంటాం . ఇతిహాసాలైనా రామాయణ భారతాల్లో పేర్కొన్న ప్రకారం మామిడి ప్రేమ, సంపద , సంతానాభివృద్ధికి సంకేతం .
మామిడాకుల్లో నుండీ విడుదలయ్యే ప్రాణవాయువు వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంటుంది . ఎక్కువమంది గుమిగూడినప్పుడు ఎదురయ్యే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది . గుమ్మాలకి మామిడాకులని తోరణాలుగా కట్టడం వలన పరిశరాలలోని గాలి పరిశుభ్రమై ప్రాణవాయువు శాతం పెరుగుతుంది . మామిడాకులల్లో లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. అందువల్ల ఆర్ధిక సమస్యలు తలెత్తవు . వాకిట్లో అలంకరించిన మామిడి తోరణం వలన దుష్టశక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించవు . తద్వారా ఇంటి పరిసరాల్లో చక్కని సానుకూల శక్తి పెరుగుతుంది . ఇంట్లో ఉన్న వారికి మనశ్శాంతి, సుఖం, సంతోషం కలుగుతాయి .
కంచిలోని కామాక్షీ ఆలయంలో అమ్మవారు ఏకాంబరేశ్వరుని ప్రేమని గెలుచుకుంది తీయని మామిడి పండ్లతో అర్చించే కదా !! ఇప్పటికీ అమ్మ ఏ చెట్టు పండ్లతో అయితే, స్వామిని అర్చించిందో , ఆ చెట్టుని అమ్మవారి ఆలయంలో దర్శించుకోవచ్చు . లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని కాకుండా , ఆది దంపతుల దివ్యమైన అనురాగాన్ని మనకి అందించే శుభప్రదమైన వృక్షం మామిడి. ఉగాదికి చిన్నారి శివలింగాలంత కాయలతో నిండుగావుండే గౌరమ్మ ప్రతిరూపాలు . ఈ వృక్షాలని గౌరవిస్తూ, మన సంప్రదాయాన్ని పాటిస్తూ, రేపటి తరానికి విస్తరిద్దాం .
సర్వేజనా సుఖినో భవంతు !!