మూడవ మహాశక్తి స్వరూపము “ లక్ష్మీ దేవి”!
పరాప్రకృతి నుండీ ఆవిర్భవించిన మూడవ మహాశక్తి స్వరూపము “ లక్ష్మీ దేవి”!
-కామకోటివారి సౌజన్యంతో
అమ్మవారి రూపాలలో అత్యధికులు ఆరాధించే స్వరూపం లక్ష్మీ దేవి. ఆమాటకొస్తే, ఆవిడ రూపాలలో ఎవరు లక్ష్మి కారు ? సౌభాగ్యాన్ని, సిరులనీ అందించే ఆ తల్లి అష్టలక్ష్ములుగా విరాజిల్లుతూ తానే స్వయంగా జగజ్జననిగా ప్రకాశించడం లేదా ? ఈ మహాదేవి పంచమహాశక్తులలో మూడవ రూపము . పరాప్రకృతి నుండీ ఆవిర్భవించిన మూడవ స్వరూపము. జనమేజయ మహారాజుకి వేదవ్యాసుడు వివరించిన ఆ దేవి మూడవ మహాశక్తి స్వరూపాన్నీ, ఆవిర్భావాన్ని, ఆవిడ అనుగ్రహాన్ని పొందే విధానాన్ని మనమూ తెలుసుకుందామా !
పరాప్రకృతి నుండి ఆవిర్భవించిన మహాలక్ష్మీ పంచశక్తులలో మూడవది. ఆమె నారాయణునికి పత్నియై ఆశ్రయించిన వారికి అఖండమైన సర్వసంపదలనూ అనుగ్రహిస్తుంది. వైకంఠంలో మహాలక్ష్మిగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజ్యాలలో రాజ్యలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా లక్ష్మీ దేవి సౌభాగ్య దేవతగా విరాజాల్లుతోంది. ధనలక్ష్మి,ధాన్యలక్ష్మి,గజలక్ష్మి, రూపలక్ష్మి వంటి అనేక నామాలతో ప్రకాశిస్తూ, విష్ణువక్షస్ధలంలో నిత్యమూ నివశిస్తూ ఉంటుంది .
వైకుంఠ లక్ష్మీగా ఉన్న అమ్మవారి అంశ దుర్వాసుని మూలంగా , స్వర్గానికి దూరమై, దేవేంద్ద్రాది దేవతల ప్రార్ధనవలన , శ్రీ మహావిష్ణువు సంకల్పబలం వల్ల 'క్షీరసాగర కన్యక' గా ఆవిర్భవించింది. తేజస్సునకు, మాంగల్యానికీ, కాంతికి, శాంతి, సుఖాలకు ప్రధాన దేవత ఈ లక్ష్మీదేవి స్వరూపం . తనను ఆశ్రయించిన వారికి సంకల్ప మాత్రం చేతనే సర్వసంపదలనూ అనుగ్రహింపగల శక్తి ఆమెది.
అటువంటి దివ్యస్వరూపమైన అమ్మ వేదవాక్కులలో, భగవన్నామములో, గోపుచ్ఛములో, తులసీవృక్షంలో, ఏనుగు కుంభస్ధలంలో,శంఖంలో, ముత్యములో, స్త్రీలసీమంత ప్రదేశంలో , సత్య వాక్కులో, అగ్ని హోత్రములో సూక్ష్మరూపిణిగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇలాంటి స్థానాలను ఆదరించి, గౌరవించి, పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. తిరస్కరించిన వారికి కష్టాలు తప్పవు.
ఒక నాడు దూర్వాసముని వైకంఠంలో శ్రీ మహావిష్ణువును పూజించి, ఆయన ధరించిన పుష్పమాలను లక్ష్మీ ప్రసాదంగా స్వీకరించి, తిరిగి వెళ్తూ, మార్గం మధ్యలో స్వర్గలోకంలో ప్రవేశించాడు. తనకు ఆతిథ్య సత్కారాలను సమర్పించిన ఇంద్రునికి లక్ష్మీ ప్రసాదమైన పుష్పమాలను కానుకగా ఇచ్చాడు. ఇంద్రుడు ఆ పుష్పమాలను విలాసంగా తన వాహనమైన ఐరావతం మెడలో వేశాడు. పుష్పమాలా స్పర్శకు కలత చెందిన ఆ ఏనుగు ఆ మాలను తొండంతో లాగి నేలపై పడవేసి, పాదాలతో త్రొక్కి, ఛిన్నా భిన్నం చేసింది. తానిచ్చిన పుష్పమాల తన ఎదుటే ఇలా విధ్వంసం కావడానికి కారకుడైన ఇంద్రుని పై దుర్వాసమహర్షి ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'రాజ్యబ్రష్టుడవై పొమ్మ'ని శపించాడు. ఇంద్రుడు స్వర్గరాజ్యాలక్ష్మికి దూరమై కొండల్లో, కోనల్లో సంచరించ సాగాడు.
అలా సంచరిస్తూ, దేవేద్రుడు తన కష్టాలు తీరే ఉపాయం చెప్పుమని దేవగురువైన బృహస్పతిని కోరాడు. బృహస్పతి సూచనపై జగన్మాతను సేవించి ఆమె అనుగ్రహం పొందాలని థ్యాననిమగ్నుడయ్యాడు. ఇంద్రుని భార్య అయిన శచీదేవి కూడా తన భర్తకు స్వర్గరాజ్యాన్ని ప్రాప్తింప చేయవలసిందిగా లక్ష్మీదేవిని ప్రార్ధించింది. వారి మొరలు విని లక్ష్మీదేవి వారిని అనుగ్రహించగా, ఇంద్రునికి మళ్ళీ స్వర్గరాజ్యం లభించింది.
అందువలన, ఇంద్రుడు చేసినట్టు పొరపాటున కూడా లక్ష్మీదేవికి నిలయమైన, మంగళకరమైన పవిత్ర పదార్ధాలను అవమానించరాదు. అసత్యం పలికేచోట, స్త్రీని గౌరవించలేనిచోట, భర్తనెదిరించి పలికే ఇల్లాళ్ళున్న చోట, తన సంతానంలో కొందరిపట్ల పక్షపాత దృష్టితో ప్రవర్తించే తల్లి ఉన్న చోట, వేదవిప్రులను, పతివ్రతలను బాధించేచోట, వేదనింద, యజ్ఞనింద జరిగేచోట లక్ష్మీదేవి నిలువదని వివరిస్తూ వ్యాసమహర్షి ఈ వృత్తాంతాన్ని ముగించారు .