షోడశ ఫలాలు అందించే అష్టలక్ష్మీ ఆరాధన .
షోడశ ఫలాలు అందించే అష్టలక్ష్మీ ఆరాధన .
అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విష్ణు వక్షఃస్థలారూఢే భక్తమోక్ష ప్రదాయిని
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
జగన్మాత్రేచ మోహిన్యై మంగళం శుభమంగళం
అష్ట అంటే ఎనిమిది అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆ ఎనిమిది లక్ష్ములు ఎవరు? వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
ఆదిలక్ష్మీ :- వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువుతీరి ఉండేది ఆదిమాత.. అదే ఆదిలక్ష్మి.. ఈ సృష్టికి మూలం నారాయణుడు అని కొందరు.. కాదు అమ్మే అని మరి కొందరి విశ్వాసం.. నిజానికి ఇద్దరిలా కనిపించే వీరు ఇద్దరూ ఒక్కరే! లక్ష్మి దేవి చేతిలో కనిపించే కమలము పవిత్రతకు చిహ్నం.. ఇందిరా దేవి అని కూడా ఈ రూపంలో వీరిని పూజిస్తారు. ఆది లక్ష్మిని ఆరాధించుట వలన సంతోషం, పవిత్రత మనకు లభిస్తాయి.
ధాన్య లక్ష్మి :- ధాన్యం అంటే పండించిన పంట అని అర్థం. అంటే ఈ రూపంలో మనం ఈ శక్తిని పూజించుట వలన మన జీవితానికి కావల్సిన సస్యములు , పండ్లు తదితర ఆహారాన్ని సంవృద్ధిగా పొందగలం . ప్రక్రుతి స్వరూపిణిగా అనుగ్రహించే ఈ మాత దయ వలన అతి వృష్టి అనావృష్టి వంటి వైపరీత్యాలు సంభవించకుండా ఉంటాయి .
ధైర్య లక్ష్మి :- కష్టనష్టాలనేవి ఏ జీవికైనా సహజమైనవి . చీకటి వెంట వెలుగు వెలుగు వెంట చీకటిలాగా ఇవి వస్తూ పోతూ ఉంటాయి . కానీ కొన్ని సందర్భాలలో వాటి ఉదృతిని తట్టుకోవడం అసాధ్యమయిపోతుంటుంది . అటువంటప్పుడు ఈ దేవి అండదండలు అవసరం . అష్టలక్ష్ములలో ఈ అమ్మ ఉందంటే , మిగిలిన వారందరి కరుణా , ఆప్యాయతలూ సిద్ధించినట్టే !!
గజలక్ష్మి :- ఈ అవతారంలో దేవి , దేవ దానవులు సముద్ర మధనం సాగించే సమయంలో సముద్రుని కూతురుగా ఉద్భవించినట్లు భాగవతం చెబుతుంది. రెండు ఏనుగులు అమ్మ ప్రక్కన నిలబడి జలధారని వర్షింప చేస్తూంటాయి. ఈ మాతను పూజించుట వలన ఇల్లు, వాహనాలు వంటి భౌతిక సుఖాలు మనకు ఒనగూరుతాయి.
సంతాన లక్ష్మీ :- పున్నమనరకాన్నుంచి తప్పించే పుత్రులు , ఆణిముత్యాలై పుట్టినింటికీ మెట్టినింటికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే పుత్రికలు ఈ అమ్మ అనుగ్రహమే . సంతానాన్ని ప్రసాదించడమే కాకుండా వారికి సద్బుద్ధిని , ధీర్ఘాయుస్సుని అందిస్తుంది ఈ అమ్మవారి ఆశీర్వాదం .
విజయ లక్ష్మీ :- పేరులోనే ఉంది పెన్నిది. జీవితమే ఒక యుద్ధం కదా . ఆ యుద్ధంలో మనల్ని గెలిపించే విజయలక్ష్మి ఈ రూపంలోని దేవి . బాహ్య - అంతర్గత శత్రువులపై విజయం పొందాలని అన్నా.. శారీరకంగా, ఆర్ధికంగా ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలపై విజయం పొందాలి అంటే విజయ లక్ష్మి కృప ఉండి తీరవలసిందే.
ధనలక్ష్మి :- భూమిపై సంపద లేదా ధనం అంటే రూపాయలు బంగారు ఆభరణాలు కాదు.. పకృతిలో ఉండు అన్ని రకాల నదులు, ఫలవంతం అయిన చెట్లు, సమృద్ధిగా కురియు వర్షాలు ఇవ్వన్నీ సంపద క్రిందే వస్తాయి.. కనుక అవన్నీ మనకు ధన రూపంగా మార్చి ఇచ్చేది ఈ దేవతే.
విద్యాలక్ష్మి :- పాఠశాలలో, కళాశాల, విశ్వవిద్యాలయల్లో లభించే విద్యే కాదు.. ఏ తరహా విజ్ఞానం కావలన్న ఈమెను ఆశ్రయించ వలసినదే.. ఆధ్యాత్మికం.. భౌతికం ఎందులో ఏ విద్య అయినా మనకు అందులో దక్షత ఏర్పడాలి అంటే ఈ లక్ష్మి దయ మనకు ఉండవలసిందే. నిజానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి తమ జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవన్నీ అష్ట లక్ష్ముల ప్రతీకలే!
అష్ట లక్ష్ములని పూజించడం వలన షోడశ ఫలాలు మనకు లభిస్తాయి అనేది ఋషి వచనం . షోడశ అంటే 16.ఇవీ ఆ పూర్ణ ఫలాలు .
1 కీర్తి,
2 జ్ఞానం,
3 ధైర్యం.. బలం,
4 విజయం ,
5 సత్సంతానం
6 యుద్ధ నైపుణ్యం,
7 బంగారం ఇతర సంపదలు,
8 సంతోషం,
9 భౌతిక సుఖాలు,
10 తెలివితేటలు,
11 అందం
12 విద్యాభివృద్ధి,
13 ఉన్నత విలువలు.. ధ్యానం,
14 నీతి నియమాలు,
15 మంచి ఆరోగ్యం,
16 దీర్ఘ ఆయుః.
(సేకరణ)
లక్ష్మి రమణ