Online Puja Services

ముగ్గురమ్మల స్వరూపం... మూకాంబికా దేవి.

3.145.62.36

ఓం శ్రీ మాత్రే నమః 

ముగ్గురమ్మల స్వరూపం... మూకాంబికా దేవి.

సరస్వతి, మహాకాళి, శక్తి  సంయుక్త స్వరూపం.

♦️శివుని వరం పొందిన "కామాసురుడు".. కూడకాద్రి పర్వతం మీద చేరి, దేవతలను మునులను హింసించేవాడు. 
సప్తర్షులు, దేవతలు అతని నుంచి ఎలా తప్పించు కోవాలా అని ప్రయత్నాలు చేశారు. 

♦️ఈ విషయాన్ని "శుక్రాచార్యుడు" కామాసురుడి చెవిన వేసారు. 
అతని చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుంది అని చెప్పాడు. దీంతో వెంటనే ఆ రాక్షసుడు... శివుని అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేసాడు. 
శివుడు ప్రత్యక్షమై రాక్షసుడిని వరం కోరుకోమన్నాడు. 

♦️కామాసురుడికి శివుడు వరం ఇస్తే లోకకంటకుడు అవుతాడని భావించిన వాగ్దేవి సరస్వతీ దేవి... 
వాడి నాలుక పై చేరి మాట రాకుండా... 
మూగ వాడిని చేసేసింది. 

♦️మూగవాడై పోయినందువల్ల ఆ కామాసురుడు శివుడిని నోటిమాటతో ఏ వరమూ కోరకోలేక పోయాడు.
అప్పటి నుంచి ఆ రాక్షసుడిని ''మూకాసురుడు'' అని పిలిచేవారు.

♦️''కోల రుషి'' ఉపాయం మేరకు "పార్వతీ దేవి" సకల దేవతల శక్తులన్నిటిని కలిపి... 
ఒక తీవ్రశక్తిగా సృష్టించింది. 
ఆ శక్తి మూకాసురునితో యుద్ధం చేసి సంహరించింది. 

♦️మూకాసురుడిని దేవి సంహరించిన ప్రదేశాన్ని ''మారణ కట్టే'' అంటారు(మరణ గద్దె). 
ఆ తరువాత మూకాసురుని ప్రార్ధన మన్నించి అతనికి కైవల్యం ప్రసాదించింది.

♦️మూకాసురుడు కోరిక మేరకు అమ్మవారు కొల్లూరులో మూకాంబిక నామంతో విరాజిల్లుతూ భక్తులకు కొంగుబంగారంగా ఉంది. 

♦️ఈ ఆలయంలో "మూకాంబికా దేవి" పద్మాసనంలో ప్రశాంతంగా మూడు నేత్రాలతో దర్శన మిస్తుంది. శంఖం, చక్రం, గద ఆయుధాలను ధరించి ఉంటుంది.

♦️జగద్గురు "ఆదిశంకరులు" కుడజాద్రి పర్వతంపై ఉండి అమ్మవారి కోసం తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి... అమ్మవారు ప్రత్యక్షమైంది. 

♦️ఆమెను తనతోబాటు తన జన్మస్థలమైన కేరళకు రావలసిందిగా శంకరులు చేసిన ప్రార్థనకు అంగీకరించిన దేవి... 
అందుకు ఒక షరతు విధిస్తుంది. 

♦️అదేమంటే... తాను వచ్చేటప్పుడు శంకరులు వెనక్కు తిరిగి చూడకూడదని...
ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే అక్కడే తాను శిలలా మారిపోతానంటుంది. అందుకు అంగీకరిస్తారు శంకరులు. 

♦️ముందుగా శంకరులు, వెనుక అమ్మవారు వెళ్తూ ఉంటారు.
కొల్లూరు ప్రాంతానికి రాగానే అమ్మవారి కాలి అందెల రవళి వినిపించకపోవడంతో...వెనక్కు తిరిగి చూస్తారు శంకరులు. 

♦️ఇచ్చిన మాట తప్పి వెనక్కు తిరిగి చూడడంతో అమ్మవారు అక్కడే శిలలా మారిపోతుంది. 
తన తప్పిదాన్ని మన్నించమని ప్రార్థించిన శంకరులతో... తనను అక్కడే ప్రతిష్ఠించమని చెబుతుంది. 

♦️జగద్గురువు తన తప్పును క్షమించి... 
కేరళకు రమ్మని కోరగా తాను...
పొద్దుటి పూట కేరళలోని చోటానిక్కరలో ఉన్న "భగవతీదేవి" ఆలయంలోనూ...
మధ్యాహ్నం "కొల్లూరు"లోనూ ఉంటానని చెప్పిందట

♦️పురాణాల ప్రకారం మూకాంబిక ఆలయంలో తేనె, మొదలైన పదార్థాలతో తయారు చేసే... "పంచకడ్జాయం' అనే ప్రసాదం పెడతారు. 
పూర్వం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించిన తరువాత... ఆలయంలో ఉన్న ఒక బావిలో వేసేవారట. 

♦️ఇదంతా చూసిన చదువురాని ఒక కేరళ నివాసి, ప్రసాదం బావిలో వేసే సమయంలో నీటి అడుగున దాక్కుని ఆ ప్రసాదాన్ని తిన్నాడట.
అమ్మవారికి నివేదించిన ప్రసాదం తిన్నందువల్ల అతడు మహాపండితుడు అయ్యాడని అంటారు. 

♦️ఆలయంలో అడుగుపెడితే దురలవాట్లు దూరం అవుతాయని... 
ఆమె సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే... చక్కటి విద్యాబుద్ధులు అలవడతాయని భక్తుల నమ్మకం. 

♦️ఆ తల్లికి నివేదన చేసిన ప్రసాదం స్వీకరిస్తే చాలు మహా పండితులవుతారనీ, అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సకల సౌభాగ్యాలూ సిద్ధిస్తాయి అని నమ్మకం.

- సత్య వాడపల్లి  

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda