అలక్ష్మి కి మరొక పెద్ద ఆహ్వానం - కలహం
శ్రీ మహాలక్ష్మీ కటాక్షం.
మహాలక్ష్మి కృపవల్ల ఇల్లు సంపన్మయంగా ఉండాలని వేదకాంక్ష....
అభూతి, అసమృద్ధి -ఈరెండూ అలక్ష్మీ స్వరూపాలు.
ఐశ్వర్యము లేకపోవుట, ఉన్నది తగినంతగా చాలకపోవుట, ఇవే అభూతి, అసమృద్ధి. ఈ అలక్ష్మీభావాలు ఉండరాదు. లక్ష్మి ఇంట్లోనూ, ఒంట్లోనూ కూడా ప్రవేశించాలి. ఉత్సాహమూ, ఉల్లాసమూ, చైతన్యమూ, ఔదార్యమూ ఇవన్నీ మానసిక లక్ష్మీ గుణాలు.
చిరునవ్వు, ఆరోగ్యం, సోమరితనం లేకపోవుట ఇవి దైహికంగా లక్ష్మీప్రసాదాలు.
ఇంట్లో కలహాలు లేకపోవుట.
పరివారంలో ప్రేమపూర్వక అనుబంధం, సంపదకు కొదవలేకపోవడం, విజయం, సంతృప్తి ఇవి లక్ష్మీ అనుగ్రహ స్వరూపాలు.
వీటికి విరుద్ధమైనవి అలక్ష్మీ(జ్యేష్ఠా)స్వరూపాలుగా చెప్తారు.
నిజానికి ’సంస్కారపులేమి’నే ’అలక్ష్మి’ అనాలి.
మనిషికి ముందు ఉండేది సంస్కారరాహిత్యం. అదే జ్యేష్ఠం. (ఈపదం అర్థం నక్షత్రాదులకు వర్తించదు) అంటే ’ముందు ఉండేది’, ’పెద్దది’ అని అర్థం.
ముందు ఉండేది అజ్ఞానమూ, సంస్కారరాహిత్యము. అదే నిజమైన అలక్ష్మి.
దానిని మనం సంస్కారం ద్వారా, వివేకంద్వారా, సత్ప్రవర్తన ద్వారా సవరించుకుంటాం. అప్పుడు లభించేదే లక్ష్మి. అందుకే లక్ష్మి ’తరువాతది’ అని చెప్పబడుతోంది.
సంస్కారం వల్ల ఉత్పన్నమయ్యే పవిత్రత లక్ష్మి సంస్కార పూర్వముండే అవకారాలు, వికారాలు అనైశ్వర్యమూ, అసమృద్ధి. ’గృహం’ అంటే మనముండే ఇల్లు. అయితే శరీరం మన ఆత్మకి ఇల్లు. ఇంటివలే ఒంటినీ ఐశ్వర్యమయం చేసుకోవాలి.
అంటే నగానట్రాతో అలంకరించుకోవడం కాదు. సంస్కరించుకోవడం.
ఇంటిని సంస్కరించుకొనే విధానాలు మన శాస్త్రంలో చెప్పబడాయి. సత్యం, శీలం. అహింస, నిత్యానుష్ఠానం, శుచి - అనేవే వ్యక్తి సంస్కారాలు.
ఇంటిని, పరిసరాలనీ శుభ్రంగా ఉంచుకోవడం, దేవీపూజ, దీపారాధన, అన్నశుద్ధి, పాక(వండడంలో) శుద్ధి, ఆచారశుద్ధి - ఇవన్నీ గృహ సంస్కారాలు.
ఈరెండు సంస్కారాల వల్ల గలిగే శోభ, సౌందర్యం "లక్ష్మీదేవత" గా అభివర్ణింపబడ్డాయి.
మన ఆచార సంప్రదాయాలన్నీ మనలనీ, మన గృహాలనీ లక్ష్మీ నివాసంగా మలచడానికి నిర్దేశింపబడినవే.
వాటిని మనం కోల్పోయి అలక్ష్మిని ఆవహింపజేసుకుంటున్నాం. అనాచారము, అశౌచము, గృహాన్ని అలక్ష్మీనిలయంగా మార్చుతాయి.
ఉదయాన్నే శుభ్రంచేయనిదీ, ముంగిట ముగ్గులేనిదీ, దీపం వెలగనిదీ,శుచియైన పాకం లేనిదీ- అయిన ఇంటిని అలక్ష్మి తన పీఠంగా చేసుకుంటుందని పెద్దలు చెప్తారు.
అలక్ష్మి కి మరొక పెద్ద ఆహ్వానం - కలహం.
"అలక్ష్మీ కలహాధారా" అన్నారు. ’కలహం" అంటే ఒకరిట్ల ఒకరికి ద్వేషభావం ఏర్పడడం.
ద్వేషం ఉన్నచోట శోభ ఉండదు. ఐశ్వర్యమూ నిలువదు.
కనుక ఇంటిలో కలహానికి ఆస్కారం లేకుండా జాగ్రత్తపడాలి.
*సత్యేన శౌచసత్యాభ్యాం తథాశీలాదిభిర్గుణైః!*
*త్యజ్యంతే యే నరాః సద్యః సంత్యక్తా యే త్వయామలే!!*
సత్యమూ, శౌచమూ, శీలమూ మొదలైన గుణాలను విడిచిపెట్టిన వారిని లక్ష్మి వెంటనే విడిచిపెడుతుందని విష్ణుపురాణ వచనం.
- కందుకూరి శీను