శుక్ర వారానికి ఆపేరు ఎలా వచ్చిందో తెలుసా?
శుక్రవారపు శ్రీమహాలక్ష్మి దేవి..!! ఓం నమః శివాయ..!!
శుక్ర వారానికి ఆపేరు ఎలా వచ్చిందో తెలుసా?
ఈరోజు శుక్రవారం. అయితే చాలా మందికి శుక్రవారానికి ఆ పేరు ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలియదు. మరి ఆ కథేమిటో తెలుసుకొందామా..!
మనకు లక్ష్మీదేవి అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది శుక్రవారం. అందరూ శుక్రవారమే లక్ష్మీదేవి ఆరాధనకు అనుకూలమైన రోజుగా భావిస్తూ పూజలు చేస్తారు ఎందుకు? అలాగే రాక్షసులు కూడా ఆరోజే లక్ష్మీదేవిని ఎందుకు ఆరాదిస్తారు? రాక్షస సంహారి అయిన విష్ణుమూర్తి భార్యను రాక్షసులు ఎందుకు పూజిస్తారనే.. సందేహాలు వస్తుంటాయి.
మన పురాణాలు చెప్పిన దాని ప్రకారం రాక్షసుల గురువు శుక్రాచార్యుడు, ఈ శుక్రాచార్యుల పేరుమీదుగానే శుక్రవారం ఏర్పడింది. శుక్రాచార్యుడి తండ్రి భృగుమహర్షి, ఈ భృగుమహర్షి బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు. ఇతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా ! అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరు కూడా ఉంది. ఈ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు అవుతాడు. అందుకే ఆమెకు శుక్రవారం అంటే ప్రీతికరమైనది.
ఆ తల్లికి ప్రీతికరమైన శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు మనం చూస్తూ ఉంటాము. ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిథి కనుక ఆమె ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు తీసుకుని.. బంగారు ఆభరణాలతో ఐశ్వర్య రూపిణిగా ఉన్న ఆమెకు పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కానీ, విష్ణుమూర్తిని దరిచేరలేరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం, సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు.
ఇలా వీటితో ఆమెను శుక్రవారంనాడు ఆహ్వానించి పూజిస్తే అలాంటి వారికి సిరిసంపదలకు లోటు ఉండదు.
ఇదండీ శుక్రవారం విశిష్టత.!!
లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు. శుభమస్తు. అభీష్ట సిద్ధి రస్తు.!!
సర్వే జనా సుఖినోభవంతు.
శ్రీ మాత్రే నమః