అష్టాదశ శక్తిపీఠం-16 గయా మాంగళ్య గౌరికా
అష్టాదశ శక్తిపీఠం-16
గయా మాంగళ్య గౌరికా
శ్రీ మాంగళ్య గౌరీదేవి ధ్యానం
సర్వ మంగళ మాంగల్యా గయా మాంగల్య గౌరీ
అర్ధదా మోక్షదాదేవీ అక్షయ్య ఫలదాయినీ
హిందువులకు, బౌద్ధలకు గొప్ప పవిత్రమైన యాత్రాస్థలం గయా క్షేత్రం. గయ క్షేత్రం నందు పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించి, పిండప్రదానం చేస్తే పితృ ఋణాన్ని తీర్చుకుని, ఇహపర సాధనలో మోక్షం పొందుతారు అని గట్టి నమ్మకం. వారణాశిలో మొదలయిన శ్రాద్ధవిధులు, గయా శ్రాద్ధవిధులతో పూర్తి అవుతుంది. గయలోని వటవృక్షము క్రింద పితృకర్మలు చేయించి, పిండ ప్రదానములు చేయిస్తారు. ఈ కర్మతో పితృదేవతలు శాశ్వత కైవల్యం పొందగలరని గాఢమైన విశ్వాసం. శ్రాద్ధవిధులు పండాలు మంత్రయుక్తంగా, శాస్త్రోక్తవిధిగా చేయిస్తారు.
గురుక్షేత్రం ఉత్తరభారతదేశంలోని బీహార్ రాష్ట్రములో వుంది. రాష్ట్ర ప్రధాన నగరమైన పాట్నాకు సుమారు 112 కి.మీ. దూరమున గయ పట్టణము కలదు. ఇది గయ జిల్లాకు ముఖ్య పట్టణము. ఫల్గునీ నదీతీరమున, అందమైన పర్వతశ్రేణుల మధ్య అమరియున్న పట్టణము. గయ క్షేత్రము పితృగయగా మరియు బుద్ధగయగా రెండు భాగములుగా ఉంటుంది. హిందువుల పురాతన ఆలయాలకు పితృగయ ప్రసిద్ధి. దేవాలయాలపై ఉండే శిల్పకళ ఎంతో శోభగా ఉంటుంది.
బుద్ధ ఆశ్రమాలు, బౌద్ధ ఆలయాలకు బుద్ధగయ ప్రసిద్ధి. సిద్ధార్ధుడు తపస్సుచేసి, జ్ఞానాన్ని పొందిన పవిత్ర స్థలాలుగా బుద్ధ గయ ప్రఖ్యాతి చెందినది. వేదభూమి అయిన గయాక్షేత్రం పూర్వం మగధ సామ్రాజ్యంలో ఒక భూభాగంగా ఉండేది. మగధ గురించి వేదాల్లో, పురాణాల్లో ప్రసక్తి మరియు ప్రశస్తి వుంది. మగధ భూభాగంలో మౌర్యులు మరియు గుప్తుల పాలన కాలాలు స్వర్ణయుగంగా కీర్తించబడినాయి. బౌద్ధులకు ముఖ్య విహారంగా వుండి, విహార్ అనే నామంతో తేజరిల్లిన ప్రదేశం గయాక్షేత్రం.
అష్టాదశ శక్తిపీఠాలలో పదహారవ పీఠం అయిన శ్రీ మంగళగౌరి మహాశక్తి పీఠం గయాక్షేత్రం నందు కలదు. సతీదేవి యొక్క శరీరఖండం పడి, శక్తిపీఠం ఏర్పడింది. క్షేత్రంలోని విష్ణుపాద దేవాలయమునకు సుమారు 1 కి.మీ. దూరమున గల నారాయణ చుహ అనే ప్రాంతములో కొంత ఎత్తైన కొండమీద శ్రీ మంగళగౌరి పీఠం వుంది. కొండపైకి చేరుటకు మెట్లు మార్గంతోపాటు, కొండవెనుకభాగం నుంచి రోడ్ మార్గం కూడా కలదు. ఆటోరిక్షా, వేన్లు, టాక్సీలు మొదలగునవి కొండపైకి చేరుటకు వీలుగా వుంది.
సతీదేవి యొక్క స్తనములు పడినచోటుగా ప్రసిద్ధి. సుమారు 3 అడుగుల ఎత్తుగల ద్వారం గుండా గర్భగుడిలోనికి ప్రవేశం దొరుకుతుంది. అమ్మవారి స్తనములు పోలిన శిలకు పూజలు జరుగుతాయి. భక్తులు కూడా స్వయంగా పూజలు చేయవచ్చును. ప్రతి మంగళవారం నాడు విశేషంగా అమ్మవారి దర్శనము కొరకు వస్తారు. విజయదశమి, చైత్రమాసంలో విశేషపూజలు, ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి మందిరమునకు వెనుక భాగమున పార్వతి, కాళీ మూర్తులు దర్శించగలం. అమ్మవారి మందిరం ఎదురుగా వున్న మండపం నందు హోమం మొదలగు కార్యక్రమాలు నిర్వహించుటకు వీలుగా వున్నది. దీని ప్రక్కనే శివాలయం కూడా కలదు. పూజకు కావలసిన సామాగ్రిలు విక్రయించుశాలలు కూడా వున్నాయి. ఆలయ ప్రాంగణము భక్తి భావంతో నిండి వుంటుంది.
మహిళలకు శ్రావణమాసం అత్యంత ముఖ్యమైనది. మహిళలు ఆచరించే మంగళగౌరి వ్రతం శ్రావణ మాసమునకు ప్రధానమైనది. దీనినే శ్రావణ మంగళవార వ్రతం మరియు మంగళగౌరి నోము అని కూడా అంటారు. వ్రతం ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. మహిమాన్వితమైన మంగళగౌరి వ్రతమును త్రిలోకసంచారి అయిన నారదుడు మహా పతివ్రత సావిత్రికి తెలిపి ఆచరింపచేసినట్లు, శ్రీకృష్ణపరమాత్మ ద్రౌపదికి తెలిపి స్వయంగా ఆచరింపచేసినట్లు మరియు త్రిపురాసుర సంహార సమయంలో శివుడు, మంగళగౌరిని పూజించి విజయం సాధించినట్లు మన పురాణాలు వెల్లడించాయి.
సర్వేజనా సుఖినోభవంతు
- రామ కృష్ణంరాజు గాదిరాజు