అష్టాదశ శక్తిపీఠం-13 హరిక్షేత్ర కామరూపా
అష్టాదశ శక్తిపీఠం-13
హరిక్షేత్ర కామరూపా
శ్రీ కామరూపిణీ దేవి ధ్యానం
కామరూపిణీ విఖ్యాత హరిక్షేత్రే సనాతనీ
యోని ముద్రాత్రిఖండేశీ మాసే మాసే నిదర్శితా
భారతదేశమున, ఈశాన్యదిశగా అస్సాం రాష్ట్రం కలదు. పూర్వం దీనిని కామరూప దేశంగా పిలిచేవారు. అస్సాంలోని కామరూప జిల్లానందు కామాఖ్య ఆలయం కలదు. అస్సాం రాష్ట్రములోని ముఖ్యనగరమైన గౌహతి పట్టణమునకు సుమారు 10 కి.మీ. దూరమున గల నీలాచల పర్వతం మీద అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రధానమైన శ్రీ కామాఖ్య అమ్మవారి ఆలయం కలదు.
నీలాచల పర్వతమును కామగిరి పర్వతం అని కూడా అంటారు.
సముద్ర మట్టమునకు 535 అడుగల ఎత్తునగల కామాఖ్య ఆలయ ప్రాంతము ఎంతో రమణీయమైన ప్రకృతిశోభతో ఆహ్లాదకరముగా ఉంటుంది. కామాఖ్య శక్తిపీఠము ప్రాచీన కాలము నుండి ప్రసిద్ధ శక్తిపీఠంగాను మరియు తాంత్రిక విద్యలకు, పూజలకు కేంద్రం గాను ప్రఖ్యాతిగాంచినది.
శ్రీమహావిష్ణుకు ముడిపడిన అనేక తీర్థములు ఈ క్షేత్రము నందు ఉన్న కారణముగా, ఈ ప్రాంతము హరిక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచినది. ప్రపంచంలోని అతి పెద్ద నదులలో ఒకటిగా ఖ్యాతిపొందిన బ్రహ్మపుత్రనది నీలాచల పర్వతాన్ని అంటి ప్రవహిస్తూ వుంటుంది.
సతీదేవి యోని భాగము పడిన ప్రదేశమే కామాఖ్య శక్తిపీఠంగా విరాజిల్లుతుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో పదమూడవదిగా పరిగణించబడుతుంది. ఇది కామాఖ్య తాంత్రిక పీఠంగాను, కామ్యాసిద్ధి పీఠంగాను ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. కామాఖ్య ఆలయంలోపల ఒక గుహలాంటిది కనబడుతుంది.
గుహలోపల ఒకమూల, నల్లనిరాయిమీద ‘యోని’ రూపం చెక్కి ఉంటుంది. ఆ భాగమును (రూపాన్ని) భక్తులు పూజిస్తూ వుంటారు. ఆ కారణముగా కామాఖ్యపీఠం యోని పీఠంగా ఖ్యాతిపొందినది. యోనిని సృష్ఠికి, సృజనశక్తికీ సంకేతంగా భావిస్తారు. దీనివలన కామరూపాదేవికి ”భగవతి” అను నామం సార్ధకమైనది. భగము అనగా యోని అని అర్ధము. అమ్మవారి భగమును (యోని) పూజించేవారిని వామాచారులని పిలుస్తారు. వామాచార పూజలో ప్రధానపూజ జీవించివున్న స్త్రీ అవ్వడం గమనించదగినది.
నగరవాసులతోపాటు, చుట్టుప్రక్కలగల గిరిజన తెగలకు కూడా కామాఖ్య అమ్మవారు ముఖ్యఆరాధ్య దేవత. ఖాసీ అనే గిరిజన భాషలో కామాఖ్య అంటే జన్మనిచ్చే తల్లి అని అర్థం. తాంత్రికులను ఆకర్షించే ప్రధాన శక్తి పీఠాలలో కామాఖ్యపీఠం ముఖ్యమైనది. అమ్మవారు శక్తిరూపం గావున బలి, పూజాదులు మొదలగునవి జరుగుచుండేవి. ఇక్కడ తాంత్రిక ప్రజా విధానం జరుగుచుండేది. శ్రీ ఆదిశంకరాచార్యులు, తాంత్రిక పూజా విధానమునకు ప్రతిగా పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టినారు. దీనితో తాంత్రికధోరణుల వ్యాప్తి తగ్గిందని చెబుతారు. నేడు ఆలయము నందు పూజలు తాంత్రిక మరియు ఆగమపద్ధతిలో జరుగుతుంటాయి.
భక్తులు పూజా, ఉపాసనలతో కుమారీ పూజ చేస్తారు. పూజానంతరము భోజనం పెట్టడం గొప్ప సంప్రదాయంగా సాగుతోంది. కుమారీపూజను కన్యపూజ అని కూడ అంటారు. నవరాత్రులలో ఆర్ధికముగా శక్తి వున్నవారు ప్రతిరోజు ఒక్కొక్క కన్యను ఆహ్వానించి, శాస్త్రోక్తంగా పూజించాలి. రెండేళ్ళ నుంచి ఏడేళ్ళ వయస్సు వున్న కన్యలే యిందుకు అర్హులు. ఒంటిమీద గాయాలు, మచ్చలు, కురుపులు వున్నవారు మరియు రోగగ్రస్తులు కన్యాపూజకు అర్హులుకారు. వీరిని అమ్మవారి మూర్తిగా భావించి, శ్రీయుక్తనామమంత్రాలతో పూజించాలి. కుమారీ పూజావిధానం దేవీ భాగవతం నందు ప్రశంస కలదు. వివాహం కాని స్త్రీలు వివాహం కావాలని కుమారిదేవిని ఆరాధిస్తారు.
కామాఖ్యమాతను తార, ఛండీ, సరస్వతి, దుర్గ, కాళీ మొదలగు రూపాలలో కూడ పూజిస్తారు. ఆలయము నందు ఈ రూపాలను దర్శించగలరు. ఉదయం 8 గంటల నుంచి కామాఖ్య అమ్మవారి దర్శనము ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఆలయమును మూసివేస్తారు. సంతానం లేనివారు సంతానం కోసం పూజిస్తారు. కామాఖ్య అమ్మవారి దర్శనముతో, తమ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. కామాఖ్య దేవిని సందర్శించుకునే ముందుగా, యాత్రికులు ఆలయమునకు ఉత్తరంవైపున గల సౌభాగ్యకుండ్ నందు స్నానమాచరిస్తారు. సౌభాగ్యకుండ్ ప్రాంతములో పండాలు తర్పణ, శ్రాద్ధ కర్మలను నిర్వహించుతారు.
సర్వేజనా సుఖినోభవంతు
- రామ కృష్ణంరాజు గాదిరాజు