అష్టాదశ శక్తిపీఠం-12 మాణిక్యా దక్షవాటికే
అష్టాదశ శక్తిపీఠం-12
మాణిక్యా దక్షవాటికే
శ్రీ మాణిక్యాంబ దేవి ధ్యానం
ద్రాక్షావటీ స్థితాశక్తిః విఖ్యాతా మణికాంబికా
వరదా శుభదాదేవీ భక్త మోక్ష ప్రదాయినీ
ఆంధ్రప్రదేశ్ నందలి తూర్పుగోదావరి జిల్లా ముఖ్యకేంద్రం కాకినాడ పట్టణము. దీనికి సుమారు 28 కి.మీ. దూరమున ద్రాక్షారామమే పుణ్యక్షేత్రం వుంది. ఇక్కడ భీమేశ్వరుడు మరియు శ్రీ మాణిక్యాంబదేవి కొలువు దీరియున్నారు.
భారతఖండములో విరసిల్లిన అష్టాదశ శక్తి పీఠాలలో పన్నెండవదిగా మాణిక్యాంబది. సతీదేవి ఎడమ చెక్కిలి పడిన ప్రదేశంగా ప్రసిద్ధిగాంచినది.
సతీదేవి తండ్రి అయిన దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశమును దక్షవాటికగా పిలుస్తారు. దక్షవాటిక దక్షరామం అని పిలువబడింది. కాలక్రమేణా ద్రాక్షారామంగా మారింది.
దక్షవాటికన దాక్షాయిని (సతీదేవి) ఆత్మాహుతి చేసుకున్న స్థానమున, పరమేశ్వరుడు భీమరూపమున స్వయంభువుడైనాడు. స్వయంభువ లింగమును భీమేశ్వరునిగా కొలుస్తారు. ద్రాక్షారామం దక్షిణకాశిగా భాసిల్లుతుంది. దక్షిణ భారతదేశము నందు గల అతి ప్రాచీనమై మరియు పురాణ ప్రసిద్ధిగాంచిన శివక్షేత్రాలలో ఒకటిగా ఖ్యాతి పొందినది. శ్రీశైలం – శ్రీకాళేశ్వరం – శ్రీ దాక్షారామం మధ్యగల భూమిని త్రిలింగ దేశముగా పిలుస్తారు. శ్రీభీమేశ్వరలింగము త్రిలింగములలో ఒకటిగా వర్ధిల్లుతోంది.
శ్రీ భీమేశ్వరాలయమునందు శ్రీ మాణిక్యాంబదేవికి ప్రత్యేక స్థానం కలదు. శ్రీ భీమేశ్వరాలయం రెండవ ప్రాకారములోని గర్భాలయమునకు నాలుగు ప్రక్కల మండపం వుంది. మండపం వరసలో స్వామివారి పరివార గణములతో పాటు మాణిక్యా శక్తిపీఠం కూడా కలదు. శ్రీ భీమేశ్వర లింగమునకు ఈశాన్యవైపున, దక్షిణముఖముగా శ్రీ మాణిక్యాంబ అమ్మవారు కొలువుతీరింది. తూర్పు చాళుక్యులు తమ ఇలవేల్పుగా మాణిక్యాంబను ఆరాధించారు.
శ్రీ మాణిక్యాంబ దేదీప్యమానంగా, తేజోవంతంగా, మంగళకరముగాను భక్తులకు దర్శనమిస్తుంది. సమస్త దేవతలలో మాణిక్యాంబ సుప్రసన్నమూర్తి. భక్తుల యొక్క ఆశ్రిత కల్పవృక్షం శ్రీమాణిక్యాంబదేవి. శ్రీ ఆదిశంకరులు మాణికేశ్వరిని చక్రబిందువుపై ప్రతిష్ఠించారు. అమ్మవారికి నిత్యం కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుతారు. శ్రీ భీమేశ్వరాలయం బయటపూజా సామాగ్రిలు విక్రయించు షాపులు కలవు.
స్థలపురాణము
ద్రాక్షారామ భీమేశ్వరాలయం పంచారామాలలో ఒకటిగా ప్రాముఖ్యత పొందినది. పురాణాల కాలములో దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో శంకరుని కుమారుడైన శ్రీ కుమారస్వామితో తారకాసురుడు యుద్ధంలో తలపడ్డాడు. తారకాసురుని కంఠమునందు గల అమృతలింగమును ఐదు ఖండాలుగా కుమారస్వామి చేధించినాడు. అవి ఐదు క్షేత్రాలలో పడ్డాయి. వీటిని పంచారామాలుగా పిలుస్తారు. వీటిని అమరారామం, భీమారామం, క్షీరారామం, ద్రాక్షారామం మరియు కుమారారామంగా కొలుస్తారు. మహాశివరాత్రి పర్వదినాన అసంఖ్యాక యాత్రికులు ఈ ఐదు క్షేత్రాలను ఒక వరుసలో సందర్శించి పునీతులవుతారు.
సర్వేజనా సుఖినోభవంతు
- రామ కృష్ణంరాజు గాదిరాజు