Online Puja Services

అష్టాదశ శక్తిపీఠం-11 ఓఢ్యాయాం గిరిజాదేవి

18.191.103.144

 

అష్టాదశ శక్తిపీఠం-11

ఓఢ్యాయాం గిరిజాదేవి
శ్రీ గిరిజా దేవి ధ్యానం

ఓధ్రదేశే భువనేశీ గిరిజానామ సంస్థితా
పాలికాఖిల లోకానాం వల్లవారుణ పాణినా

ఒరిస్సా రాష్ట్రమునకు ఈశాన్యదిశగా జాజ్‌పూర్‌జిల్లా కలదు. జిల్లా ముఖ్యకేంద్రము జాజ్‌పూర్‌ పట్టణం. ఈ క్షేత్రమున అష్టాదశశక్తి పీఠాల్లో పదకొండవదిగా గిరిజాదేవి పీఠం వుంది. మాతను విరజాదేవిగా పిలుస్తారు. స్థానికులు విరజాదేవిగా కొలుస్తారు. జాజ్‌పూర్‌ చాలా పురాతన పట్టణం. పవిత్రమైన వైతరణి నది ఒడ్డునగల జాజ్‌పూర్‌ను వైతరణి పట్టణముగా పిలుస్తారు.

ప్రాచీన కాలం నందు జాజ్‌పూర్‌ పట్టణము, రాజుల మత రాజధానిగా శోభిల్లింది. కళింగ గాంగవంశము, దత్తవంశము, సోమవంశి వంశము మొదలగు రాజుల కాలంలో జాజ్‌పూర్‌ క్షేత్రం అభివృద్ధి చెందినది. ఈ క్షేత్రమును గదక్షేత్రం, నాభిక్షేత్రం, విరాజక్షేత్రం, బ్రహ్మక్షేత్రం, విరాజతీర్థం, వైతరణితీర్థం మొదలగు పేర్లతో భక్తులు కొలుస్తారు. జాజ్‌పూర్‌ నందు శక్తిపీఠంతో పాటు శైవమతమునకు చెందిన అనేక శివలింగాలు, వైష్ణవ మతమునకు చెందిన ఆలయాలు మరియు తీర్థాలు కలవు.

ఈ క్షేత్రము తాంత్రికపీఠంగా కూడా ఖ్యాతి పొందినది. తంత్ర శాస్త్రమునకు సంబంధించిన పూజలు నిర్వహించేవారు. జాజ్‌పూర్‌ ప్రాంతములో హైందవమతంతో పాటు బౌద్ధమతం, జైనమతం కూడా అభివృద్ధి చెందినట్లు శాసనములు తెల్పుచున్నాయి. జిల్లాలోని రత్నగిరి, ఉదయగిరి బౌద్ధమతమునకు ముఖ్య కేంద్రములుగా ఉండేవి.

1360 మరియు 1568 సంవత్సరములలో మహమ్మదీయులు (బెంగాల్‌ నవాబులు) చేసిన దారుణ మారణకాండలో హైందవదేవాలయములు నేలమట్టం చేయగా, నేలమట్టమైన శకలాల మీద మరల కొన్ని ఆలయాలు పునరుద్ధరణ జరిగాయి. మరికొన్ని ఆలయాలు క్షీణదశ చేరగా, నరసింహదేవ్‌, సోమదత్త, ప్రతాపరుద్రదేవ్‌, యయాతి రాజు కాలములో వాటికి పునర్నిర్మాణములు జరిగినాయి.

జాజ్‌పూర్‌ బస్‌స్టాండ్‌ నుంచి సుమారు 2 కి.మీ. దూరమున బింజాపూర్‌ పోవు రోడ్డు మార్గమున బ్రహ్మకుండం వద్ద విరజాదేవి ఆలయం వుంది. నేటి ఆలయనిర్మాణం 18వ శతాబ్దంలో జరిగింది. ఆలయ ప్రాకారంలో నాభిగయ, ఇన్నైశ్వర్‌ శివాలయం, హనుమాన్‌ మందిరం, డోలమండపం, భైరవ, కార్తికేయ, గంగాధర్‌తోపాటు 108 శివలింగాలు, విష్ణురూపాలు దర్శించవచ్చును. ఆలయ గర్భగుడిలో విరజాదేవి మహా తేజోమహిమతో అలరారుతుంది. అమ్మవారి స్వరూపం దేదీప్యమానంగా, తేజోవంతంగా, శాంతిమూర్తిగా కనిపించి, మహామహిమోపేతమైన శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది. సతీదేవి యొక్క నాభిస్థానం పడటం చేత, దీనిని మహాశక్తి పీఠంగా పరిగణిస్తారు.

 

ఇది నాభిక్షేత్రంగా కూడా క్యాతి పొందినది. ఆలయప్రాకారం, సింహద్వారము శోభతో నయనానందకరంగా దర్శనమిస్తాయి. గుప్తుల కాలమునాటి విరజాదేవి విగ్రహం, రెండు చేతులు కలిగిన మహిషాసురమర్ధినిగా ఉంటుంది. రాక్షసశక్తి అయిన ఎనుబోతును, అమ్మవారు తన ఎడమకాలితో త్రొక్కి, కుడిచేతిలోని త్రిశూలమును ఎనుబోతు శరీరములో గ్రుచ్చి, ఎనుబోతు (మహిషాసుర) తోకను ఎడమచేతితో పుచ్చుకుని నిలుచుండెను.

 ఇటువంటి మహిషాసురమర్ధిని రూపం యొక్క నకలును జగన్నాథాలయ ప్రాకారం నందు, వాయువ్యవైపునగల ముక్తీశ్వర్‌ ఆలయం నందు కూడ చూడగలము. భారతదేశమున మరోచోట ఇటువంటి మహిషాసురమర్ధిని రూపమును దర్శించలేము.

సర్వేజనా సుఖినోభవంతు 

- రామ కృష్ణంరాజు గాదిరాజు 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi