అష్టాదశ శక్తిపీఠం-8, మహూర్యే ఏకవీరికా
అష్టాదశ శక్తిపీఠం-8
మహూర్యే ఏకవీరికా
శ్రీ ఏకవీరా దేవి ధ్యానం
ఏకవీరా మహాశక్తి మహుగ్రామ గుహాస్థితా
భవాని వీర విఖ్యాతా ధర్మ రక్షణ తత్పరా
మహారాష్ట్రం నందలి నాందేడ్ జిల్లాకు ముఖ్యకేంద్రము నాందేడ్ పట్టణము. నాందేడ్‌కు ఈశాన్యంగా, సుమారు 135 కి.మీ. దూరమున మహూర్‌గడ్ అను క్షేత్రం కలదు. క్షేత్రరాజ్యం పర్వతారణ్యయ ప్రాంతములోని ఒక గ్రామం. మహూర్‌గడ్ నిత్యం భక్తులతో యాత్రికులతో కోలహాలముగాను, తిరునాళ్ళుగాను దర్శనమిస్తుంది.
మహూర్ బస్‌స్టాండ్‌కు సుమారు 3 కి.మీ. దూరమున ఎత్తైన పర్వతము మీద శ్రీ రేణుకాదేవి శక్తిపీఠం వుంది. శ్రీ ఏకవీరికాదేవి శక్తి పీఠంగా భక్తులు కొలుస్తారు. అష్టాదశశక్తి పీఠములలో ఎనిమిదవదిగా ఖ్యాతి పొందినది. సతీదేవి కుడిస్తనం పడినచోటుగా భక్తులు భావించుతారు.
మహారాష్ట్రములోని మూడున్నర శక్తిపీఠములలో ఒకటిగా ప్రసిద్ధి. మిగిలిన కొల్హాపూర్ నందలి శ్రీ మహాలక్ష్మిపీఠం, తుల్జాపూర్ నందలి శ్రీభవాని పీఠం మరియు నాసిక్ నందలి పంచవటి తీరమునగల శ్రీధరాదేవి పీఠం (అరశక్తిపీఠం) వీటిని మహారాష్ట్ర ప్రజలు భక్తి విశ్వాసములతో సందర్శించుకుంటారు.
మహూర్ బస్టాండ్ నుంచి 3 కి.మీ. ఘాట్‌రోడ్ మార్గములో ప్రయాణము. ఆలయ దిగువ భాగము వరకు రవాణా సదుపాయములు హెచ్చు సంఖ్యలో లభ్యమవుతాయి. దిగువ భాగము నుంచి 250 మెట్లు ద్వారా శ్రీ రేణుకాదేవి మందిరము చేరవచ్చును. మెట్లు మార్గమునకు రెండు ప్రక్కలా పూజా సామాగ్రీలు, అమ్మవారి చిత్ర పఠములు మొదలగునవి విక్రయించు షాపులు కలవు.
శ్రీ ఏకవీరికాదేవి మందిరము చాల ప్రాచీనమైనది. ఆలయమంతా సింధూర రంగులో దర్శనమిస్తుంది. చిన్న ముఖద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేయాలి. ముందుగా శ్రీ పరశురామ్ గణేష్ దర్శనము చేయాలి. పిదప రేణుకామాత (ఏకవీరికాదేవి) దర్శనము చేసుకోవాలి. మెడగాని, భుజనాలు గాని లేని రేణుకాదేవి శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖమంతా సింధూరం పూస్తారు. అమ్మవారి ముక్కు, నోరు, కళ్ళు స్పష్టముగా చూడవచ్చును. రేణుకాదేవి మహా తేజోమహిమతో అలరారుతుంది.
మందిరంలో ఒక ప్రక్క యజ్ఞపీఠిక వుండగా, మరోప్రక్క ఉయ్యాలలో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుంది. భక్తులు అమ్మవారి ప్రతిమకు కుంకుమార్చన మొదలగునవి జరుపవచ్చును.
శ్రీ ఏకవీరికా మాత దర్శనానంతరము ఆలయము బయటకు వస్తే ఆలయ ప్రాంగణము నందు శ్రీలక్ష్మి, శ్రీభవానీమాత మరియు శివలింగము మొదలగునవి దర్శనమిస్తాయి. రేణుకాదేవి (ఏకవీరికాదేవి) నూతన ఆలయ నిర్మాణములో వుంది.
మహూర్‌గడ్ క్షేత్రం శ్రీ రేణుకాదేవి మందిరంతో పాటు శ్రీ దత్తపీఠం, శ్రీ అనసూయమాత మందిరములు చూడదగినవి.
క్షేత్రము నందలి శ్రీ పరశురామమందిరం, శ్రీ సర్వతీర్థ, శ్రీకైలాసగిరి, శ్రీవనదేవి, శ్రీమహాకాళి మందిరము, శ్రీ చింతామణి మందిరం, శ్రీ మాతృతీర్థ, శ్రీగోముఖ, శివతీర్థ, శ్రీపాపహరణికుండ్, శ్రీఅమ్‌త్‌కుండ్, శ్రీఆత్మబోదకుండ్, శ్రీజమదగ్నిగుట్ట, పాండవులగుహ, కోఠిభూమి, సంగమేశ్వరం, శ్రీదేవదేవేరిమందిరం, మ్యూజియం మొదలగునవి కూడ చూడదగినవి. వీటిని సందర్శించుటకు స్థానిక రవాణా సదుపాయములు దొరుకుతాయి.
సర్వేజనా సుఖినోభవంతు
- రామ కృష్ణంరాజు గాదిరాజు