అష్టాదశ శక్తిపీఠం-7
అష్టాదశ శక్తిపీఠం-7
కొల్హాపురీ మహాలక్ష్మి
శ్రీ మహాలక్ష్మీ దేవి ధ్యానం
మహాలక్ష్మ్యభిదా దేవీ కరవీర పురస్థితా
పురుషార్ధ ప్రదామాతా సంపూర్ణామృత వర్షిణీ
దక్షిణ మహారాష్ట్రము నందు కొల్హాపూర్ జిల్లా కలదు. జిల్లా ముఖ్యకేంద్రమైన కొల్హాపూర్ పట్టణం పంచగంగానది ఒడ్డున వుంది. ఇది దక్షిణకాశీగా ప్రఖ్యాతి చెందినది. ఒకానొప్పుడు మరాఠా రాజ్యానికి ప్రధాన రాజధానిగా విలసిల్లిన క్షేత్రరాజ్యం. ప్రాచీనకాలం నందు ఈ పట్టణము కరవీరపురంగా పిలిచేవారు. నేడు కొల్హాపూర్‌గా వ్యవహరించుచున్నారు. కొల్హాపూర్ అనగా కనుమలోయలోని పట్టణము అని అర్థం.
క్షేత్రంలోని శ్రీమహాలక్ష్మి అష్టాదశ శక్తి పీఠాలల్లో ఏడవదిగా గణ్యత చెందినది. సతీదేవి వామహస్తం పడిన ప్రదేశముగా ప్రసిద్ధి గాంచినది. శక్తిరూపమైన శ్రీ మహాలక్ష్మితోపాటు శ్రీ మహాదేవలింగము కలదు. అమ్మవారితోపాటు శ్రీ మహాదేవ లింగమునకు ప్రాముఖ్యత వుంది. శ్రీ మహాలక్ష్మి ఆలయం 9వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయముపైన ఐదు గోపురాలు దర్శనమిస్తాయి. ప్రధానాలయమునందు శ్రీ మహాలక్ష్మికి ఇరువైపుల శ్రీమహాకాళి, శ్రీమహాసరస్వతి కొలువైనారు. వీరితోపాటు శ్రీమహాగణపతి దర్శనము కూడా లభ్యమవుతుంది.
శ్రీ మహాదేవలింగమునకు ప్రత్యేకముగా, ఆలయ ప్రాంగణములో స్థానము వుంది. జగన్మాత మహాలక్ష్మి గర్భాలయ బయట, శ్రీయంత్రం వుంది. భక్తులు శ్రీయంత్రమునకు పూజలు నిర్వహించుతారు. అమ్మవారికి ఎదురుగా సింహవాహనము దర్శనమవుతుంది. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి బంగారు పాదుకులున్నాయి. వీటిని భక్తులు దర్శించటానికి వీలుగా, బయటకు తీసి మరల అలంకరించడానికి వీలుగా వుండును. దేవి శిరస్సు మీద ఒక నాగపడగ, పడగనందు శివలింగము యోని ముద్ర వున్నాయి.
ప్రధానాలయం తెల్లవారి 4 గంటలకు తెరచి తిరిగి రాత్రి 10 గంటలకు మూయబడును. ప్రతి నిత్యము అమ్మవారికి ఐదు పర్యాయములు హారతి సేవ జరుగుతుంది. ఆలయం తెరచినప్పుడు జరుగు హారతి సేవ కాగడ హారతిగా పిలుస్తారు. ఉదయం 8 గంటలకు జరుగు మహాపూజ సమయంలో మంగళహారతి సేవ జరుగుతుంది. మధ్యాహ్నం 11 గంటలకు నైవేద్యం సమర్పించు సమయములో పరిమళమైన పుష్పములు, కుంకుమ, కర్పూరముతో హారతి సేవ జరుగుతుంది.
అమ్మకు నైవేద్యంగా ఘనమైన వంటకాలు, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె మొదలగునవి సమర్పించుకుంటారు. నైవేద్య సేవ ప్రతి శుక్రవారం రాత్రి కూడ జరుగుతుంది. ప్రతి నిత్యం రాత్రి 7 గంటలకు జరుగు సేవను భోగహారతిగా పిలుస్తారు. రాత్రి 10 గంటలకు సేజ హారతి సేవ (పవళింపు హారతి సేవ) జరుగుతుంది. కర్పూర హారతి సేవ అనంతరము అమ్మవారి ఆభరణములు దేవస్థాన ఖజానాలో జమ చేయుదురు. ప్రతి గురువారం, శుక్రవారం మరియు పండుగలకు హారతి సేవల సంఖ్యయే అధికమవుతుంది.
సర్వేజనా సుఖినోభవంతు
- రామ కృష్ణంరాజు గాదిరాజు